'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్ 'పంచ్' ప్రసాద్. ఆయన గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కిడ్నీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తోటి ‘జబర్దస్త్’ కమెడియన్స్ సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు. ఎంతో మంది దాతలు ఆయన ఆపరేషన్ కు సాయం చేశారు.
ఏపీ సీఎం సహాయ నిధి నుంచి ప్రసాద్ కు సాయం
పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ సర్కారు ఆయనకు అండగా నిలిచింది. ఆయన చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ హరికృష్ణ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మా టీమ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో చర్చించింది. LOC దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యింది. డ్యాక్యుమెంట్స్ ధృవీకరణను పూర్తి చేసి, ప్రసాద్ కిడ్నీ మార్పిడి కోసం CMRF కింద LOC మంజూరు చేశాము” అని ప్రకటించారు.
అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని సాయం చేసిన ప్రతి ఒక్కరికీ పంచ్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మరో ‘జబర్దస్త్’ కమెడియన్ నూకరాజు కలిసి యూట్యూబ్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ‘నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, దాతలకు, రోజాకు, ఏపీ సర్కారుకు స్పెషల్ థ్యాంక్స్. వారి సాయం ఎప్పటికీ నేను మర్చిపోలేను” అని పంచ్ ప్రసాద్ తెలిపారు. అటు “ప్రసాద్ అన్నకు సాయం చేయాలని మేము పెట్టిన పోస్టుకు ఎంతో మంది స్పందించారు. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేశారు. కానీ, కొన్ని లావాదేవీల తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేసిన స్కానర్ పని చేయలేదు. కానీ, పలువురు దాతలు సాయం చేశారు. జబర్దస్త్ జడ్జి, ఏపీ మంత్రి రోజా సాయంతో జగన్ సర్కారు పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు కావాల్సిన డబ్బును సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు చేసింది. ప్రసాద్ అన్నకు సాయం చేసిన ప్రతిఒక్కరికీ థ్యాంక్స్” అని చెప్పాడు నూకరాజు.
అసలు ప్రసాద్ ఆరోగ్య సమస్య ఏమిటి?
కిడ్నీ సమస్యల కారణంగా ప్రసాద్ కు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఓసారి ఆయనకు సీరియస్ అయ్యింది. ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. కిడ్నీ సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు చెప్పారు. నడుము వెనక వైపు చీము పట్టిందని వెల్లడించారు. అప్పుడు ఓ ఆపరేషన్ జరిగింది. పంచ్ ప్రసాద్ నడవలేని నడవలేని స్థితి నుంచి మళ్ళీ కోలుకుని టీవీ షూటింగులు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయి. ఈ నేపథ్యంలో తోటి ‘జబర్దస్త్’ కమెడియన్స్ సినిమా, టీవీ ఇండస్ట్రీలో తమకు తెలిసిన ప్రముఖుల నుంచి సాయం కోరుతూ ఫండ్ రైజింగ్ చేశారు.
Read Also: బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పని జూనియర్ ఎన్టీఆర్? ఫ్యాన్స్ హర్ట్!