Asia Cup 2023:
ఆసియాకప్ -2023కి మార్గం సుగమమైందని సమాచారం! ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంగీకరించింది. మరో వారం రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది. షెడ్యూలు, వేదికల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. పాకిస్థాన్, శ్రీలంకలో మ్యాచులు జరుగుతాయని తెలిసింది. టీమ్‌ఇండియా ఆడే మ్యాచులకు సింహళ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలకు ముందు ఆసియాకప్‌ను నిర్వహించడం ఆనవాయితీ! మెగా టోర్నీకి ఇది ప్రిపరేషన్‌గా పనికొస్తుంది. ప్రపంచకప్‌ను బట్టి ఫార్మాట్‌ను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది నవంబర్లో బీసీసీఐ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పాక్‌కు వెళ్లేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. దాంతో పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ హైబ్రీడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. టోర్నీ మొత్తం 13 రోజులు ఉంటుంది. పాక్‌లో 4 లేదా 5 మ్యాచులు ఉంటాయి.
సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు ఆసియాకప్ టోర్నీ జరుగుతుంది. పాకిస్థాన్ లెగ్‌లోని మ్యాచులు లాహోర్‌లో నిర్వహిస్తారు. శ్రీలంక లెగ్‌లోని మ్యాచులు పల్లెకెలె లేదా గాలెలో ఉంటాయని తెలిసింది. కొన్నాళ్లుగా ఆసియాకప్ నిర్వహణపై వివాదం కొనసాగుతోంది. తమ దేశంలో టోర్నీ జరగకపోతే వన్డే ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ హెచ్చరింది. అలాగే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ హక్కులూ దానికే ఉండటంతో సయోధ్య కోసం ఐసీసీ శ్రమించింది. ఇప్పుడు ఆసియా కప్ విజయవంతమైతే అప్పుడు ఐసీసీ ట్రోఫీకీ ఇబ్బందులు ఉండవు.
హైబ్రీడ్ మోడల్‌ను బీసీసీఐ మొదటి నుంచీ నిరాకరిస్తోంది. ఒకవేళ అంగీకరిస్తే వన్డే ప్రపంచకప్‌ను ఇలాగే నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతుందని అనుమానించింది. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ సైతం హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించాయి. కాగా కొన్ని మ్యాచుల్ని దుబాయ్‌లో పెట్టాలని పాక్ భావించగా బంగ్లా గట్టిగా వ్యతిరేకించింది. సెప్టెంబర్లో అక్కడి వాతావరణం అనువుగా ఉండదని అభ్యంతరం చెప్పింది.
రెండు వారాల క్రితం ఏసీసీ ఉపాధ్యక్షుడు, ఒమన్ క్రికెట్ అధినేత పంకజ్ ఖిమిజినీ పీసీబీ చీఫ్ నజమ్ సేథీ కలిశారు. హైబ్రీడ్ మోడల్ గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలతో టీమ్‌ఇండియా పాక్‌కు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారని తెలిపింది. వీరిద్దరూ ఒక పరిష్కారం కోస ప్రయత్నించారని సమాచారం. 'ఇప్పటికైతే భారత్ లేని మ్యాచుల్ని లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తారు. పాకిస్థాన్ vs నేపాల్, బంగ్లాదేశ్ vs అఫ్గానిస్థాన్, అఫ్గానిస్థాన్ vs శ్రీలంక, శ్రీలంక vs బంగ్లాదేశ్ మ్యాచులు అక్కడ ఉంటాయి. భారత్ vs పాకిస్థాన్, సూపర్ 4 మ్యాచులన్నీ పల్లెకెలె లేదా గాలెలో ఉంటాయి' అని ఏసీసీ వర్గాలు మీడియాకు తెలిపాయి.