ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చివరి రోజు భారత్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా గెలవాలంటే ఏడు వికెట్లు తీయాలి. కాబట్టి ఈ మ్యాచ్‌లో అన్ని రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న మాట. క్రీజులో విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు), అజింక్య రహానే (20 బ్యాటింగ్: 59 బంతుల్లో, మూడు ఫోర్లు) ఉన్నారు.


వివాదాస్పదంగా అవుట్ అయిన గిల్
444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఎక్కడా డిఫెన్సివ్‌గా ఆడలేదు. మొదటి నుంచి అటాకింగ్‌కే దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (18: 19 బంతుల్లో, రెండు ఫోర్లు), రోహిత్ శర్మ (43: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)బౌండరీలు కొడుతూ స్కోరును నడిపించారు. అయితే ఏడో ఓవర్లో స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. గిల్ కొట్టిన బంతిని కామెరాన్ గ్రీన్ అద్భుతంగా అందుకున్నాడు. కానీ టీవీ రీప్లేలో బంతి నేలకు తగిలినట్లు క్లియర్‌గా కనిపించింది. అయినా సరే థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయింది.


నిలబడ్డ రహానే, కోహ్లీ
ఆ తర్వాత ఛతేశ్వర్ పుజారా (27: 47 బంతుల్లో), రోహిత్ శర్మ క్రీజులో నిలబడ్డారు. వేగంగా తగ్గకుండా విజయం కోసమే ఆడారు. దీంతో ఇన్నింగ్స్ కుదుటపడింది. వీరు క్రీజులో ఉంటే భారత్‌ మ్యాచ్‌లో నిలబడుతుంది అనిపించింది. రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించిన అనంతరం ఐదు బంతుల వ్యవధిలోనే వీరిద్దరూ అవుట్ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. ఇప్పటికే నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వీరి తర్వాత కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లకు మాత్రమే బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ జోడి ఐదో రోజు ఎంత సేపు క్రీజులో ఉంటే అంత మంచిది.


రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా డామినేషన్
అంతకు ముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 173 పరుగుల తొలి  ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే సిరాజ్, ఉమేశ్ లు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు.  డేవిడ్ వార్నర్ (1) ను సిరాజ్ ఔట్ చేయగా ఉస్మాన్ ఖవాజా (13) ను ఉమేశ్ పెవిలియన్ పంపాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ భరత్‌కే క్యాచ్ లు ఇచ్చారు.


24 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా టీమిండియా  మళ్లీ పట్టు విడిచింది. స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 34, 3 ఫోర్లు) తో కలిసి  మార్నస్ లబూషేన్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.  అయితే స్మిత్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడ్డూ వేసిన 30.1 వ ఓవర్లో  స్మిత్ భారీ షాట్ ఆడబోయి శార్దూల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (18) కూడా  ఎక్కువసేపు నిలువలేదు. హెడ్ వికెట్ కూడా   జడ్డూకే దక్కింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.


నాలుగో రోజు ఆస్ట్రేలియాకు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో నిలదొక్కుకున్న మార్నస్ లబుషేన్‌ను (41: 126 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఉమేష్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (25: 95 బంతుల్లో, నాలుగు ఫోర్లు), అలెక్స్ క్యారీ (66 నాటౌట్: 105 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. కామెరాన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. కానీ అలెక్స్ క్యారీ, మిషెల్ స్టార్క్ (41: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు)  మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు.


లంచ్ తర్వాత అలెక్స్ క్యారీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏడో వికెట్‌కు మిషెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ 93 పరుగులు జోడించారు. ఆ తర్వాత కాస్త వ్యవధిలోనే స్టార్క్, ప్యాట్ కమిన్స్ (5: 5 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు. ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేశాక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.