WTC Final 2023: పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవాలనే లక్ష్యంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. ఆ క్రమంలో దారుణంగా విఫలమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఫాటు ఫీల్డింగ్‌లో కూడా చెత్త ప్రదర్శనతో ఓటమి అంచున నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్లపైనే గాక హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ.. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా చేసిందేమీ లేదని అతడో ‘జీరో’ అని విమర్శలు గుప్పించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకుంటూ బాసిత్ అలీ ద్రావిడ్‌పై విరుచుకుపడ్డాడు. అలీ మాట్లాడుతూ.. ‘నేను రాహుల్ ద్రావిడ్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ను. గతంలో ఇదే మాట చెప్పా భవిష్యత్‌లో కూడా ఇదే చెప్తా. అతడు క్లాస్ ప్లేయర్. ఒక లెజెండ్. కానీ కోచ్‌గా మాత్రం అతడు అసమర్థుడు.
నాకు ఇది అర్థం కావడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. ఇండియాలో వాళ్లు టర్నింగ్ పిచ్‌లు తయారుచేసుకుంటున్నారు.. కానీ భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్తే అక్కడ టర్నింగ్ పిచ్‌లు ఉంటాయా..? బౌన్సీ వికెట్స్ ఉంటాయి కదా. మరి ఇక్కడ టర్నింగ్ పిచ్‌లు ఎందుకు తయారుచేసుకుంటున్నారో అర్థం కాదు. అసలు ద్రావిడ్ ఏం ఆలోచిస్తున్నాడో దేవుడికే తెలియాలి..’ అని వాపోయాడు.
ఈ మ్యాచ్‌లో విఫలమైన భారత ఆటగాళ్లపై కూడా అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ‘ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పజెప్పినప్పుడే టీమిండియా ఓటమికి పునాధులు పడ్డాయి. ఇప్పటికిప్పుడు భారత్ చేయగలిగిందైతే ఏమీ లేదు. ఏదైనా అద్భుతం జరుగుతందా..? అని వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ కూడా చాలా సాదాసీదాగా ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసిన తొలి ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో గమనిస్తే విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా మినహా మిగిలిన ఫీల్డర్లంతా బద్దకంగా కనిపించారు. వారి ముఖాల్లో అలసట కొట్టొచ్చినట్టు కనిపించింది...’ అంటూ విమర్శలు గుప్పించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) లు సెంచరీలతో కదం తొక్కారు. అలెక్స్ కేరీ (48) రాణించాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్.. 69.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ విఫలమైనా అజింక్యా రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51), రవీంద్ర జడేజా (48) ల పుణ్యమా అని భారత జట్టు ఫాలోఆన్ తప్పించుకుంది. 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్.. 84.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (66), లబూషేన్ (41), స్టార్క్ (41) లు రాణించారు. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఎదురీదుతోంది. 28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా.. 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా 324 పరుగులు కావాల్సి ఉండగా ఆసీస్ గెలుపునకు ఏడు వికెట్లు కావాలి. మరి ఓవల్‌లో గద అందుకునేది ఎవరో..?