WTC Final 2023, Virat Kohli: 


టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నిగూఢమైన అర్థాలతో కూడిన సందేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ నేపథ్యంలో మొన్నే ఒక సందేశం పెట్టాడు. నాలుగో రోజు ఆట ముగియగానే రెండోది పోస్టు చేశాడు. ఇంతకీ అతడెందుకు ఇలా చేస్తున్నాడో అభిమానులకూ అర్థమవ్వడం లేదు.


'ఎక్కువ భయాలు, ఆందోళనలు, సందేహాలు ఉన్న చోట ప్రేమ, జీవితానికి అవకాశమే ఉండదు. అందుకే చాలా వాటిని వదిలేయడం ప్రాక్టీస్‌ చేయాలి' అని విరాట్‌ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక శుక్రవారం 'ఇతర వ్యక్తుల అభిప్రాయాల చెరసాల నుంచి స్వేచ్ఛను పొందాలంటే అయిష్టాలను భరించే శక్తిని అభివృద్ధి చేసుకోవాలి' అని పెట్టాడు.


మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్‌ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కాసేపటికే డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడు ఏదో తింటూ  కనిపించాడు. అప్పుడు అతడిపై విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. ఆర్సీబీ ఓడుతుంటే బాధపడే కోహ్లీ టీమ్‌ఇండియా కష్టాల్లో ఉంటే ఇలా తింటున్నాడని విమర్శించారు. దాంతోనే అతడు ఇలాంటి సందేశాలు పెడుతున్నాడని సమాచారం.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నాలుగో ఇన్నింగ్సులో 444 పరుగు లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగింది. ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44 బ్యాటింగ్‌), అజింక్య రహానె (20 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచారు. ఈ మ్యాచులో హిట్‌మ్యాన్‌ సేన గెలవాలంటే ఆఖరి రోజు 280 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లే ఉన్నాయి. అందుకే ఆదివారం కోహ్లీ-అజింక్య జోడీ కనీసం రెండు సెషన్లైనా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. వీరిద్దరూ ఔటైతే శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. టెయిలెండర్లు మహా అయితే 40-50 పరుగులు జోడించగలరు.


టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగో ఇన్నింగ్సులో 444 పరుగుల లక్ష్యాన్ని ఎవరూ ఛేదించలేదు. ఒకవేళ టీమ్‌ఇండియా ఈ టార్గెట్‌ను ఛేజ్‌ చేస్తే తిరుగులేని రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక నాలుగో ఇన్నింగ్స్ ఛేదన 418 పరుగులే. 2003లో స్వదేశంలో వెస్టిండీస్ చేసింది. ఇక టీమ్‌ఇండియా అత్యధిక ఛేదన 406 పరుగులు. అదీ 1976లో పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సాధించింది. 


ఈ మ్యాచులో గిల్ క్యాచ్ వివాదంగా మారింది. 8వ ఓవర్ వేసిన స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో  మొదటి బంతి.. గిల్ బ్యాట్‌కు తాకి  స్లిప్స్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కామెరూన్ గ్రీన్ పక్కకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి  నేలకు తాకింది. దీంతో అనుమానంగానే గిల్‌తో పాటు ఆన్ ఫీల్డ్ అంపైర్లు కూడా థర్డ్ అంపైర్‌కు రివ్యూ చేశారు.  టీవీ రిప్లేలో బంతికి నేలకు తాకడం స్పష్టంగా కనిపించింది.   వివిధ యాంగిల్స్‌ నుంచి పరిశీలించిన థర్డ్ అంపైర్ మాత్రం.. దానిని ఔట్‌గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది. 


ఓవల్‌లో మ్యాచ్ చూస్తున్న టీమిండియా ఫ్యాన్స్‌కు ఇది ఆగ్రహం కలిగించింది. దీంతో  స్టేడియంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ.. ‘చీటర్స్.. చీటర్స్’ అంటూ నినాదాలు చేశారు.  ఇక గిల్ వివాదాస్పద ఔట్ తర్వాత ట్విటర్‌లో థర్డ్ అంపైర్  పై భారత క్రికెట్ అభిమానంలో ఆవేశం కట్టలు తెంచుకుంది.  టీమిండియా ఫ్యాన్స్ చేసే  సోషల్ మీడియా దాడికి దెబ్బకు ట్విటర్‌లో #Cheaters ట్రెండింగ్ అయింది.