విరామం లేదు... విశ్రాంతి లేదు... ఓ సినిమా తర్వాత మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళుతూ... వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). యువ దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్ కూడా ఉన్నారు.
సంక్రాంతి పండక్కి 'వీర సింహా రెడ్డి' సినిమాతో థియేటర్లలోకి వచ్చారు బాలయ్య. ఆ సినిమా విడుదలకు ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది? అంటే... ఓ రెండు మూడు కథలు, దర్శకులు రెడీగా ఉన్నారు. 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999' అనౌన్స్ చేశారు కూడా!
బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా తర్వాత 'ఆదిత్య 999 మ్యాక్స్' సెట్స్ మీదకు వెళుతుందా? లేదంటే మధ్యలో మరో సినిమా వస్తుందా? అంటే... ముందా, వెనుకా అనేది పక్కన పెడితే బాలకృష్ణతో హరీష్ శంకర్ సినిమా ఉంటుందనేది నిజం. 'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకకు వచ్చిన హరీష్ శంకర్... బాలకృష్ణతో సినిమా చేయాలని ఉందని చెప్పారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ ''మా బావ గోపీచంద్ మలినేనికి గుర్తు ఉందో? లేదో? నేనే 'వీర సింహా రెడ్డి' ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశా. 'నువ్వు ఎప్పుడూ బాలకృష్ణను డైరెక్ట్ చేయలేదు కదా! రేపు ఓపెనింగ్ ఉంది. వచ్చి ఒక్క షాట్ చెయ్' అని నన్ను ఇన్వైట్ చేశాడు. ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంటే... రేపు సినిమా డైరెక్ట్ చేస్తే? అతి త్వరలో బాలయ్య బాబు గారిని ఒప్పించి, మంచి కథతో ఆయన అనుమతి తీసుకుని సినిమా డైరెక్ట్ చేయడానికి చాలా చాలా ఉత్సాహ పడుతున్నాను. ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు... మా నిర్మాతల కోరిక కూడా'' అని చెప్పారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరిగా హరీష్ శంకర్ పేరు తెచ్చుకున్నారు. తనను తాను పవన్ భక్తుడిగా పేర్కొన్నారు. అలాగని, ఇతర హీరోలపై ఎప్పుడూ ఆయన కామెంట్స్ చేసిన సందర్భాలు లేవు. అందరినీ గౌరవిస్తారు. ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'రామయ్యా వస్తావయ్యా' సినిమా చేశారు. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
Also Read : ఇప్పుడు కేసులు పెట్టడం... మళ్ళీ ఏపీ ప్రభుత్వానికి చురకలు వేసిన బాలకృష్ణ?
బాలకృష్ణ, హరీష్ శంకర్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రొడ్యూస్ చేస్తున్నదీ వాళ్ళే. పవన్ వీరాభిమానితో బాలకృష్ణ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. హరీష్ శంకర్ డైలాగులకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన రాసిన మాటలు బాలకృష్ణ నోటి వెంట వస్తే... ఒక్కసారి ఊహించుకోండి! సూపర్ కదూ! ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.
Also Read : నా జీవితానికి బాలకృష్ణే శివుడు, 'అఖండ' చేసేటప్పుడు ఆమ్లెట్ కూడా తినలేదు - తమన్ వైరల్ స్పీచ్