'వీర సింహా రెడ్డి' విడుదలైన తర్వాత ఏపీలోని అధికార రాజకీయ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పటి కథానాయిక, మంత్రి రోజా సహా మరికొందరు ప్రతి విమర్శలకు దిగారు. దీని అంతటికీ కారణం సినిమాలో కొన్ని డైలాగులు ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఉండటమే. కథానుగుణంగా, అక్కడ సన్నివేశానికి అనుగుణంగా రాసిన డైలాగులే తప్ప... తమకు ఎవరినీ టార్గెట్ చేసే ఉద్దేశం లేదని దర్శక, రచయితలు వివరించారు.
అయితే... సంక్రాంతి వేడుకలకు ఏపీ వెళ్ళిన బాలకృష్ణ, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో 'వీర సింహా రెడ్డి' విడుదల తర్వాత పైకి చెప్పకున్నా... బాలకృష్ణ, ఏపీ ప్రభుత్వం మధ్య పరిస్థితి ఉప్పు నిప్పు అన్నట్లు ఉంది. అందువల్ల, 'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడిన ఓ మాట కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినదేనా? అనే అనుమానం కొందరిలో కలుగుతోంది. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం బాలకృష్ణకు 'వీర సింహా రెడ్డి' చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. 'సమర సింహా రెడ్డి' సినిమా చూడటానికి వెళ్ళి పోలీస్ లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి. అతడి గురించి చెబుతూ చెబుతూ ''నేను కారణం చెప్పను. ఎందుకంటే... మళ్ళీ ఇప్పుడు కేసు బుక్ చేస్తారు. ఇప్పుడు చాలా తేలిక కదా! కేసులు బుక్ చేయడం... నిరపరాధుల మీద'' అని బాలకృష్ణ అన్నారు. ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : రాజమౌళిని పొగిడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకోవడం ఏంట్రా బాబు?
ఏపీలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, సోషల్ మీడియాలో చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ కొందరిని అరెస్టులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అవుతున్నాయి. ఇక, సినిమాలో ఏపీ ప్రభుత్వానికి చురకలు వేసిన డైలాగుల విషయానికి వస్తే...
Also Read : 'గజినీ' టైపులో 'హంట్' ఉంటుందా? - ఇదిగో మహేష్ క్లారిటీ
'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో! కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు' - 'వీర సింహా రెడ్డి' ట్రైలర్‌లో డైలాగ్ రాజకీయ పరంగా చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పేల్చిన డైలాగ్ బుల్లెట్ కింద ఆ మాటను చాలా మంది చూశారు. సినిమాలో ఆ డైలాగ్ తర్వాత 'దట్స్ మై ఫాదర్' అని కంటిన్యూ చేస్తారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసిన జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్సార్ పేరును పెట్టడంతో ఆ సెటైర్ వేశారని జనాల అభిప్రాయం. సినిమాలో డైలాగులు అంత కంటే ఘాటుగా ఉన్నాయి.
'వీర సింహా రెడ్డి'లో ప్రజల అండదండలు ఉన్న నాయకుడిగా టైటిల్ పాత్రలో బాలకృష్ణ కనిపించారు. ఆయనకు హోమ్ మంత్రి నుంచి పిలుపు వస్తుంది. ఓసారి వచ్చి కలిసి వెళ్ళమని! అప్పుడు ''నువ్వు వెళ్ళడం ఏమిటి పెద్దన్నా'' అని ఓ పాత్రధారి అంటే... ''ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు! గౌరవించడం మన బాధ్యత'' అని బాలకృష్ణ బదులు ఇస్తారు.'ప్రజలు ఎన్నుకున్న వెధవలు' అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? సినిమా పరిశ్రమ పెద్దలు అందరూ అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో ''అక్కడకు హీరోలు వెళ్ళడం ఏమిటి?'' అని కామెంట్లు వినిపించాయి. కొందరికి ఆ దృశ్యాలు గుర్తుకు వచ్చి, ఈ మాటను అన్వయించుకుంటున్నారు.
''ప్రగతి సాధించడం అభివృద్ధి... ప్రజల్ని వేధించడం కాదు! జీతాలు ఇవ్వడం అభివృద్ధి... బిచ్చం వేయడం కాదు! పని చేయడం అభివృద్ధి... పనులు ఆపడం కాదు! నిర్మించడం అభివృద్ధి... కూల్చడం కాదు! పరిశ్రమలు తీసుకు రావడం అభివృద్ధి... ఉన్న పరిశ్రమలు మూయడం కాదు! బుద్ధి తెచ్చుకో... అభివృద్ధికి అర్థం తెలుసుకో'' డైలాగ్, జీవో డైలాగ్ కూడా ఏపీలో పరిస్థితులను ఉద్దేశించే విధంగా ఉన్నాయనేది చాలా మంది చెప్పే మాట.