భారతీయ సినిమా హద్దులు, సరిహద్దులను 'ఆర్ఆర్ఆర్' సినిమా చెరిపేసింది. మన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన కాల్పనిక దేశభక్తి చిత్రం గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన దర్శకులు, ఫిల్మ్ మేకర్స్ తమకు ఎంత నచ్చినదీ చెబుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' అభిమానుల జాబితాలో తాజాగా 'టైటానిక్', 'అవతార్' చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరాన్ కూడా చేరారు.
 
'ఆర్ఆర్ఆర్' (RRR Movie) చూసిన జేమ్స్ కామెరూన్ (James Cameron) తనను కూడా సినిమా చూడామని చెప్పినట్లు ఆయన భార్య సుజీ తెలిపారు. అంతే కాదు... తామిద్దరం కలిసి సినిమా చూశామని ఆవిడ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌ వేడుకలో జేమ్స్ కామెరూన్, రాజమౌళి కలిశారు. అప్పుడు సినిమాకు తనదైన శైలిలో జేమ్స్ కామెరూన్ రివ్యూ ఇచ్చారు.
 
ఆయన హీరోలు పేర్లు చెప్పలేదు...
ఇండియలో ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు!
'ఆర్ఆర్ఆర్' సినిమాలో సన్నివేశాలను జేమ్స్ కామెరూన్ విశ్లేషించారు. అయితే, తన మాటల్లో ఎక్కడా హీరోల పేర్లను ఆయన చెప్పలేదు. రాజమౌళి దర్శకత్వ శైలిపై ప్రశంసల జల్లు కురిపించారు. అక్కడ వరకు బావుంది. కానీ, ఇక్కడ ఇండియాలో హీరోల అభిమానుల తీరు ఏమాత్రం బాలేదు. జేమ్స్ కామెరూన్ చెప్పింది తమ హీరో గురించి అంటే, తమ హీరో గురించి అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో ఒక్కటే ఫైటింగ్. 


ఒక పక్క హీరోలు తమ మధ్య ఏ గొడవలు లేవంటూ తమ చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. హ్యాపీగా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్ కోసం ఫారిన్ ట్రిప్పులు వేస్తున్నారు. కానీ, ఇక్కడ ఫ్యాన్స్ ఇంకా గొడవల నుంచి బయటకు రావడం లేదు. ఎప్పటికి మారతారో? ఏంటో?


Also Read : 'గజినీ' టైపులో 'హంట్' ఉంటుందా? - ఇదిగో మహేష్ క్లారిటీ


అభిమానుల గొడవ పక్కన పెడితే... ఇప్పుడు సగటు భారతీయ సినిమా ప్రేక్షకుడు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆస్కార్ నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 24న ఆస్కార్స్ అకాడమీ ఏయే సినిమాలకు నామినేషన్స్  లభించాయి? అనేది అనౌన్స్ చేయనుంది. అందులో 'ఆర్ఆర్ఆర్' పేరు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. 


రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ!?
రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ అతి త్వరలో జరగనుంది. అయితే, అది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతోనా? లేదంటే ఆ తర్వాత సినిమాతోనా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ సీఏఏతో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. మహేష్ సినిమాకు హాలీవుడ్ రైటర్లు, టెక్నీషియన్లు వర్క్ చేయనున్నారు. అయితే, అది ఇంటర్నేషనల్ లెవల్ రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ, 'ఆర్ఆర్ఆర్'కు లభించిన స్పందన దృష్ట్యా ఫారిన్ ఆడియన్స్ చూపు కూడా సినిమాపై పడుతుందని చెప్పవచ్చు.  


Also Read : 'లైగర్' అప్పులు, గొడవలు - పూరి జగన్నాథ్‌ను వెంటాడుతున్న డిస్ట్రిబ్యూటర్లు? 


హాలీవుడ్ ఏజెన్సీని రాజమౌళి సంప్రదించడం కాదు... రాజమౌళికి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నుంచి ఆఫర్ వచ్చింది. ''హాలీవుడ్‌లో సినిమా చేయాలని ఉంటే చెప్పు... మాట్లాడుకుందాం'' అని రాజమౌళి చెవిలో జేమ్స్ కామెరూన్ చెప్పారు. 'టెర్మినేటర్', 'టైటానిక్' నుంచి లేటెస్ట్ 'అవతార్' వరకు జేమ్స్ కెమరూన్ తీసిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వేల కోట్ల రూపాయల వసూళ్ళు సాధించాయి. ఆయన నుంచి రాజమౌళికి ఆఫర్ రావడం అంటే చాలా గొప్ప విషయం. భారతీయ ప్రేక్షకులు గర్వించాల్సిన విషయం.