Economic Survey 2023: 


ఏటా బడ్జెట్‌ సమావేశాల ఆరంభంలో ఎకనామిక్‌ సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధిని ఇది ప్రతిబింబిస్తుంటుంది. మున్ముందు చేపట్టాల్సిన ప్రణాళికలు, అమలు చేయాల్సిన వ్యూహాల గురించి వివరిస్తుంది.


రాష్ట్రపతి ప్రసంగంతో జనవరి 31న బడ్జెట్‌ సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొవిడ్‌ ఇబ్బందుల నుంచి దేశం ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత వంటివి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న ఎకానమీ సర్వేకు ఎంతో ప్రాముఖ్యం నెలకొంది.



ఎప్పట్నుంచి ఎకనామిక్‌ సర్వే ఇస్తున్నారు?


1950, జనవరిలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచే ఎకానమీ సర్వే నివేదిక విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. 1964 వరకు కేంద్ర బడ్జెట్‌తో కలిపి దీనిని ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత బడ్జెట్‌ నుంచి దీనిని విడదీశారు. బడ్జెట్‌ను మరింత బాగా అర్థం చేసుకొనేందుకు ఇలా చేశారు. సాధారణంగా ప్రధాన ఆర్థిక సలహాదారు (Chief Economic Advisor - CEA) మార్గనిర్దేశంలో రూపొందిస్తారు. ఈ సారి సమావేశాలు రెండు దఫాలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పదకొండో బడ్జెట్‌ ఇది.


ఎకనామిక్‌ సర్వే అంటే ఏంటి ।  What is the Economic Survey  


నిజం చెప్పాలంటే బడ్జెట్‌కు ఎకనామిక్‌ సర్వే ఒక అర్థం తీసుకొస్తుంది. గతేడాది దేశ ఆర్థిక పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. ఆయా రంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయో చూపిస్తుంది. రానున్న ఆర్థిక ఏడాదిలో వచ్చే సవాళ్లనూ ఇది ముందు ఉంచుతుంది. ఆర్థిక వ్యవహారాల శాఖలో చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ ఆధ్వర్యంలో దీనిని రూపొందిస్తారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఆ నివేదికను ఆమోదిస్తారు. 


కొన్నేళ్లుగా ఎకనామిక్‌ సర్వే నివేదికను రెండు వాల్యూములుగా ఇస్తున్నారు. ఉదాహరణకు 2018-19లో మొదటి వాల్యూమ్‌ ఇండియా ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లపై పరిశోధన, విశ్లేషణను ఇచ్చింది. రెండో వాల్యూమ్‌లో ఆయా రంగాల అభివృద్ధి గురించి వివరించింది. అరవింద్‌ సుబ్రహ్మణ్యం ప్రధాన ఆర్థిక సలహాదారుగా వచ్చాక ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కేవీ సుబ్రహ్మణ్యం దానిని కొనసాగించారు.  ప్రస్తుత ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్‌ ఇప్పటికే ఆర్థిక సర్వే కూర్పు మొదలుపెట్టేశారు.


ఎకనామిక్‌ సర్వే ప్రాముఖ్యం ఏంటి ।  What is the importance of Economic Survey?


నగదు ప్రవాహం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, వాణిజ్య ఉత్పత్తి, ఉపాధి, ధరలు, దిగుమతులు, ఎగుమతులు, విదేశీ మారక ద్రవ్యం నిల్వల గురించి ఎకనామిక్‌ సర్వే నివేదిక వెల్లడిస్తుంది. ఆర్థిక కారకాల గురించీ వివరిస్తుంది. బడ్జెట్‌లో ఏయే రంగాలకు ఎంత కేటాయించాలన్నది నివేదిక సూచిస్తుంది. అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర పరిణామాలూ కనిపిస్తాయి. 2018లో ఎకానమిక్‌ సర్వేను గులాబి రంగులో ముద్రించారు. లింగ సమానత్వం, వేధింపులకు గురవుతున్న మహిళల గురించి నొక్కి చెబుతూ అరవింద్‌ సుబ్రహ్మణ్యం ఇలా చేశారు. అంతేకాకుండా నివేదికలో మంచి మంచి నానుడులు, కొటేషన్స్‌ ముద్రించారు.


ఎకనామిక్‌ సర్వే కచ్చితంగా విడుదల చేయాలా ।  Is it mandatory to present the Economic Survey?


ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఈ ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతున్నారు. కచ్చితంగా ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టాలన్న నిబంధనేమీ లేదు. ఆ నివేదికలోని సూచనలకు  కట్టుబడాలా వద్దా అన్నది ప్రభుత్వ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య ఆర్థిక సంస్కరణల అవసరాన్ని నొక్కి చెబుతూ సర్వేను రూపొందిస్తున్నారు. ఈ నివేదిక పీడీఎఫ్‌ కాపీని finmin.nic.in, indiabudget.nic.in వెబ్‌సైట్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.