Property Registration:


స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్‌ రికార్డులు సృష్టిస్తోంది. 2022, డిసెంబర్‌ నెలలో 6,311 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన 2.4 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. మొత్తం ప్రాపర్టీల విలువ రూ.3,176 కోట్లని పేర్కొంది.


గతేడాది ఆరంభం నుంచీ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. రూ.33,605 కోట్ల విలువైన 68,519 రెసిడెన్షియల్‌ యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయని పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి రూ.37,232 కోట్ల విలువైన 83,959 యూనిట్లు రిజిస్టర్‌ కావడం గమనార్హం. హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ పరిధిలోకి హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు వస్తాయి.


డిసెంబర్‌ నెలలో రిజిస్టరైన రెసిడెన్షియల్‌ యూనిట్లలో రూ.25 లక్షల నుంచి 50 లక్షల విలువైన ప్రాపర్టీలు 54 శాతంగా ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. డిసెంబర్, 2021లో ఇది 36 శాతమే కావడం గమనార్హం. రూ.25 లక్షల కన్నా తక్కువ విలువైన ఆస్తుల నమోదు బలహీనపడింది. ఏడాది క్రితం 40 శాతంతో పోలిస్తే ఇప్పుడు 17 శాతానికి పడిపోయింది. అయితే రూ.50 లక్షల కన్నా ఎక్కువ విలువైన ఆస్తుల నమోదు పెరిగింది. 2021 డిసెంబర్లో 24 శాతం ఉండగా 2022 డిసెంబర్లో 29 శాతానికి పెరిగింది.


Also Read: ఎల్‌ఐసీ కొత్త ప్లాన్ 'జీవన్ ఆజాద్' - పొదుపు+బీమా దీని స్పెషాలిటీ


Also Read: మీ పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం మంచి పెట్టుబడి మార్గాలివి


రిజిస్ట్రేషన్లలో 500-1000 చదరపు గజాల విస్తీర్ణం గల యూనిట్లు 2021, డిసెంబర్లో 18 శాతం ఉండగా 2022, డిసెంబర్లో 20 శాతానికి పెరిగాయి. 1000 చదరపు గజాలకు పైగా ఉన్న స్థిరాస్తుల నమోదు 73 నుంచి 70 శాతానికి తగ్గింది. జిల్లా స్థాయిలో చూస్తే మేడ్చల్‌- మల్కాజ్‌ గిరి పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 42 శాతంగా నమోదయ్యాయి. 36 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ పరిధిలో 16 శాతం పెరిగాయి.


వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇళ్ల ధరలు 16 శాతం పెరిగాయి. 2022, డిసెంబర్లో సంగారెడ్డిలో అత్యధికంగా 30 శాతం పెరిగాయి. ఎక్కువ విలువైన ఆస్తులను ఇక్కడే విక్రయిస్తున్నారు. 'హైదరాబాద్ మార్కెట్‌ ఎంతో ప్రత్యేకమైంది. ప్రతిసారీ బలంగా పుంజుకుంటోంది. ముంబయి, పుణె, బెంగళూరు, కోల్‌కతా తరహాలో స్టాంప్‌ డ్యూటీ రాయితీలు లేనప్పటికీ కొన్నేళ్లుగా వృద్ధి నమోదు చేస్తోంది. సామాజిక వృద్ధి, చక్కని మౌలిక సదుపాయాలు, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం నగరాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. వడ్డీరేట్లు పెరిగినా ఇళ్లు కొనేందుకు ప్రజలు వెనుకాడటం లేదు' అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజల్‌ అన్నారు.


సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి: