Umesh Yadav:


ఉద్యోగం లేదని, ఫ్రెండే కదానీ మేనేజర్‌గా పెట్టుకొంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు ఆ వ్యక్తి! టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు రూ.44 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. ఆలస్యంగా నిజం తెలుసుకున్న క్రికెటర్‌ చివరికి పోలీసులను ఆశ్రయించాడు.


కొరాడి ప్రాంతానికి చెందిన శైలేశ్‌ ఠాక్రే, టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్నేహితులు. మిత్రుడికి ఉద్యోగం లేదని తెలియడంతో 2014, జులై 15న ఉమేశ్ అతడిని మేనేజర్‌గా తీసుకున్నాడు. నమ్మకంగా పనిచేయడంతో ఆర్థిక లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపు, బ్యాంకు ఖాతాల నిర్వహణ వంటివి అతడికే అప్పగించాడు.


ఉమేశ్‌ ఒకరోజు నాగ్‌పుర్‌లో స్థలం కొందామనుకుంటున్న విషయం ఠాక్రేకు చెప్పాడు. తాను చూసుకుంటానులే అన్న శైలేశ్‌ రూ.44 లక్షలను తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. చివరికి తన పేరుతోనే రిజిస్టర్‌ చేసుకున్నాడు. విషయం తెలియడంతో ఉమేశ్ పోలీసులను సంపద్రించగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


'కాలం గడిచే కొద్దీ ఉమేశ్‌కు ఠాక్రేపై నమ్మకం పెరిగింది. పేసర్‌కు సంబంధించిన అన్ని లావాదేవీలు అతడే చూసుకోవడం మొదలు పెట్టాడు. బ్యాంకు ఖాతా, ఆదాయపన్ను, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు' అని పోలీసులు తెలిపారు. నాగ్‌పుర్‌లో స్థలం కొనుగోలు చేయాలనుకున్న విషయం అతడికి చెప్పాడన్నారు. 'బారెన్‌ ప్రాంతంలో ఠాక్రే ఓ స్థలం చూపించాడు. రూ.44 లక్షలకే వస్తుందని నమ్మించాడు. దాంతో ఠాక్రే ఖాతాలోకి ఉమేశ్ రూ.44 లక్షలు బదిలీ చేశాడు. దానిని ఠాక్రే తన పేరుతోనే రిజిస్టర్‌ చేసుకున్నాడు' అని పోలీసులు వివరించారు.


నిజం తెలుసుకున్న యాదవ్‌ స్థలాన్ని తన పేరుకు బదిలీ చేయాలని కోరగా ఠాక్రే నిరాకరించాడు. డబ్బు తిరిగిచ్చేందుకూ అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. 'కరాడీ పోలీస్‌ స్టేషన్లో ఠాక్రేపై ఉమేశ్‌ ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద ఠాక్రేపై కేసు నమోదైంది' అని పోలీసులు వెల్లడించారు.


ఉమేశ్‌ యాదవ్‌ మళ్లీ టీమ్‌ఇండియాలో పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. పేసర్ల పని భారాన్ని కఠినంగా పర్యవేక్షిస్తుండటంతో అతడికి చోటు దొరకడం ఖాయమే.


మరికొన్ని రోజుల్లో భారత్‌, ఆస్ట్రేలియా అత్యంత కీలకమైన బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచే నాలుగు టెస్టుల సిరీసు మొదలవుతోంది. టీమ్‌ఇండియా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఆసీస్‌ 18 మందిని ఎంపిక చేసింది.


భారత జట్టు : రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్ భరత్‌, ఇషాన్‌ కిషన్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌


ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌, ఏస్టన్‌ ఆగర్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నేథన్ లైయన్‌, లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మార్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్‌ వార్నర్‌