IND vs NZ Hockey WC:  ఒడిశాలో జరుగుతున్న 15వ పురుషుల హాకీ ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకునేందుకు భారత హాకీ జట్టుకు చివరి అవకాశం. తన పూల్ లో టాప్ ర్యాంక్ ను దక్కించుకోలేకపోవటంతో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో నేడు న్యూజిలాండ్ తో జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటుంది. 


ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ మాదిరిగా ఉంటుంది. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టు 9 లేదా 12 వ స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత జట్టు క్వార్టర్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి. బలాబలాల పరంగా న్యూజిలాండ్ కంటే భారత జట్టు పైచేయిలో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఇండియా ఆరో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 12 వ ర్యాంక్ లో ఉంది. ఈ ప్రపంచకప్ ప్రదర్శనను తీసుకున్నా న్యూజిలాండ్ కన్నా భారత జట్టు ఆట మెరుగ్గా ఉంది. 


ఓటమి లేకుండా


ఈ ప్రపంచకప్ లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుతంగా ఆడింది. తన మొదటి మ్యాచ్ లో స్పెయిన్ పై 2-0 తేడాతో గెలిచింది. తర్వాత ఇంగ్లండ్ తో మ్యాచ్ ను 0-0తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత మూడో మ్యాచ్ లో వేల్స్ పై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. పూల్ డీ లో 2 విజయాలు, 1 డ్రాతో 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ తమ పూల్ లో నెదర్లాండ్స్, మలేషియా చేతిలో ఓటమి పాలయ్యింది. చిలీ జట్టుపై మాత్రమే విజయం సాధించింది. 






ఫేస్ టూ ఫేస్


భారత్- న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 44 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 24 మ్యాచులు గెలవగా.. న్యూజిలాండ్ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. 5 గేమ్ లు డ్రా అయ్యాయి. గత 4 మ్యాచుల్లో న్యూజిలాండ్ పై భారత్ దే విజయం.