తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన బౌలర్ హర్భజన్ సింగ్ ఆటకు దూరమైన తరువాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. హర్భజన్ తొలి సినిమా 'ఫ్రెండ్ షిప్' ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్ పాల్ శామ్, శామ్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. 


నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో మేకర్స్ సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో హర్భజన్ సింగ్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. 


ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సినిమా ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించే సమాజ తీరుని ఈ సినిమాతో ప్రశ్నించనున్నారు. ట్రైలర్ లో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపించాయి. '' ఏ ఒక్క స్త్రీ, మగవాడి ప్రత్యేక అవసరం కోసం సృష్టించింది కాదు.. ఆడది అంటే మనకు బాధ్యత. ఈ అందమైన విషయాన్ని మాకు నేర్పింది ఫ్రెండ్‌షిప్‌'' అనే డైలాగ్ సినిమా ఎలా వుండబోతుందనే చెప్పేసింది. మరి ఈ సినిమాతో హర్భజన్ కు ఎలాంటి హిట్ వస్తుందో చూడాలి!