హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీ వరద వస్తుందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే నీటితో ఆ రెండు జలాశయాలు నిండిపోవడంతో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 2 గేట్లను అధికారులు ఎత్తి వేశారు.


హైద‌రాబాద్ న‌గ‌రానికి వాతావరణ అధికారులు అతి భారీ వ‌ర్ష హెచ్చరిక జారీ చేశారు. మ‌రో గంట‌లో భారీ వ‌ర్షం ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించారు. నగరంలో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. వాతావరణ అధికారుల సూచనతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమ‌త్తమ‌య్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంట‌ల పాటు వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చరించారు. ప్రజ‌లు ఇళ్లనే ఉండాల‌ని అధికారులు సూచించారు. స‌హాయం కోసం 040 – 2955 5500 నంబ‌ర్‌ను సంప్రదించాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.


మూసీకి వరద పోటు
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీ వరద వస్తుందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే నీటితో ఆ రెండు జలాశయాలు నిండిపోవడంతో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 2 గేట్లను అధికారులు ఎత్తి వేశారు. దీంతో మూసీలోకి వరద నీరు పోటెత్తనుంది. మరోవైపు, నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో మరింత వరద మూసీ నదిలో పెరగొచ్చని భావిస్తున్నారు. 


Also Read: Khammam: ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘సన్‌’ స్ట్రోక్ తగులుతుందా? వివాదాస్పదంగా కుమారుల తీరు


లోతట్టు ప్రాంతాలైన లంగర్ హౌస్, కిస్మత్ పుర, బండ్లగూడ, ఆసిఫ్ నగర్, షేక్ పేట్, హైదర్ గూడ, కార్వాన్, ఉస్మాన్ గంజ్, ఛాదర్ ఘాట్, ముసారాంబాగ్‌కు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. అంతేకాక, మరో మూడు రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


Also Read: Weather Update: తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు... అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు


వానలకు కారణం ఏంటంటే..
తెలంగాణ పక్కనే మరఠ్వాడాపై 4.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాల గాలుల ద్రోణి దిల్లీ బాలంగీర్‌, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించింది. భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణశాఖ సూచించింది.