సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ‘సన్‌’ స్ట్రోక్‌ వారి రాజకీయ జీవితాన్ని మార్చే పరిస్థితి నెలకొంది. తండ్రులు ఎమ్మెల్యేలు కావడంతో పెత్తనమంతా తమ చేతులోకి తీసుకుని షాడో ఎమ్మెల్యేలుగా మారిన ఈ ఇరువురితో వారి తండ్రుల భవిష్యత్‌ అంధకారంలోకి పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావుల పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆయన పెద్ద కుమారుడైన వనమా రాఘవేంద్రరావు తండ్రికి తానే వారసుడిగా కావాలని తొలి నుంచి నియోజకవర్గంలో పెత్తనం చెల్లాయించడతో రెండుసార్లు వనమా ఓటమికి పరోక్షంగా ఆయన కుమారుడే కారణమంటూ విమర్శలున్నాయి. 2018 ఎన్నికల్లో వనమా భారీ మెజారిటీ వస్తుందని అనుకునప్పటికీ అతని కుమారుడి అత్యుత్సాహం వల్లే కేవలం సుమారు 3 వేల మెజారిటీతో గెలిచారు. ఓ దళితుడి మరణానికి కారణం కావడంతోపాటు, ఎస్సై ఆత్మహత్యలో ఇతని ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. 


ఇటీవల సూసైడ్ నోట్‌లోనూ వనమా కుమారుడి పేరు
ఇటీవల పాల్వంచకు చెందిన వడ్డీ వ్యాపారి వెంకటేశ్వరరావు తన మరణానికి కారణం వనమా రాఘవేంద్రరావు అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో వనమా రాఘవపై కేసు నమోదైంది. ఇది జరిగి నెల రోజుల కాకముందే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పోస్టాపీస్‌ సెంటర్‌లో మున్సిపల్‌ నిధులతో అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎలాంటి ప్రొటోకాల్‌ లేకుండానే సభా వేదిక ఎక్కిన వనమా రాఘవ అందరిని వేదికపైకి ఆహ్వానించారు. 


ఇదే సభకు హాజరైన ఆదివాసీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అయిన రేగా కాంతారావును వేదికపైకి ఆహ్వానించకపోవడంతో పెద్ద దుమారం లేపింది. అనంతరం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కలుగజేసుకుని రేగాను సభా వేదికపైకి ఆహ్వానించినప్పటికీ వేదిక పైనుంచే అంబేద్కర్‌ సాక్షిగా గిరిజన ఎమ్మెల్యేను అయిన తనకు అన్యాయం జరిగిందని, ఈ విషయంపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొనడం గమనార్హం. వారసుడు రావడం ఏమో గాని అసలు రాజకీయ భవిష్యత్‌కు భంగపాటు తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


వైరాలోనూ ఇలాంటి పరిస్థితే..
ఇక వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్‌కు దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. విశ్రాంత ఎస్సై అయిన రాములు నాయక్‌ 2018 ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా విజయం సాదించారు. తండ్రి రాజకీయాలకు ఆది నుంచి ఆర్థికంగా జీవన్‌లాల్‌ ఉండటంతోపాటు అన్ని తానై నడిపించడం నియోజకవర్గ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉన్న జీవన్‌లాల్‌ ముంబయిలో ఆదాయ పన్నుల శాఖలో కీలకమైన బాద్యతలు చేపడుతున్నారు. ఎన్నికల సమయంలో భారీ ఎత్తున సొమ్ములు జీవన్‌లాల్‌ ఆధ్వర్యంలోనే చేరాయని ఆరోపణలున్నాయి. 


తండ్రి గెలిచిన తర్వాత కూడా పరోక్షంగా నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఇటీవల సింగరేణి మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి తానే బాస్‌నని చెప్పుకోవడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. తాను చెబితేనే అన్ని జరుగుతాయని చెబుతూ విలేకరులపైన దుర్భాషలాడటం గమనార్హం. ఏది ఏమైనా తనయుల ప్రవర్తనతో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు తలనొప్పి మొదలైందని విశ్లేషణలు వస్తున్నాయి.