Pushpa 2: 'పుష్ప 2' నుంచి డీఎస్పీని తప్పించిన బన్నీ - సుక్కు? లాస్ట్ మినిట్‌లో వస్తున్న తమన్?

Pushpa 2 Music Director: పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే చిన్న పిల్లాడు సైతం దేవి శ్రీ ప్రసాద్ పేరు చెబుతారు. కానీ, ఇప్పుడు ఆయన బదులు వేరే సంగీత దర్శకుడు సినిమాను టేకప్ చేస్తున్నారని సమాచారం.

Continues below advertisement

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం లేని సుకుమార్ (Sukumar) సినిమాను ఊహించుకోలేం! లెక్కల మాస్టర్ నుంచి క్రియేటివ్ జీనియస్ వరకు సుక్కు పేరు తెచ్చుకోవడంలో డీఎస్పీ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని టాలీవుడ్ టాక్.‌ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన 'ఆర్య' నుంచి 'పుష్ప' వరకు అన్ని సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కానీ, 'పుష్ప 2' విషయానికి వచ్చేసరికి వేరొక సంగీత దర్శకుడు వచ్చారని యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి వినపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

దేవి శ్రీ బదులు తమన్ వస్తున్నారా? అజనీషా?
'పుష్ప' సినిమాలో పాటలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు... అందరికీ తెలుసు. ముఖ్యంగా సమంత సందడి చేసిన ప్రత్యేక గీతం 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ'తో పాటు 'శ్రీవల్లి', 'దాక్కో దాక్కో మేక' సైతం ప్రేక్షకులు చేత స్టెప్పులు వేయించింది. 'పుష్ప' సినిమాకు గాను దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అటువంటి డీఎస్పీని తీసి మరొక సంగీత దర్శకుడిని 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

Thaman to compose the background music for Pushpa 2?: తమన్ లేదా అజనీష్ లోకనాథ్...‌‌ వాళ్ళిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మ్యాగ్జిమమ్ తమన్ ఖరారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ రావొచ్చని అంటున్నారు. తెలుగులో సాయి దుర్గా తేజ్ 'విరూపాక్ష', 'మంగళవారం'తో పాటు కన్నడ హిట్స్ 'కాంతార', 'విక్రాంత్ రోణ'కు ఆయన మ్యూజిక్ అందించారు. 

అసలు దేవి శ్రీతో గొడవ ఎందుకు వచ్చింది?
దర్శకుడు, సంగీత దర్శకుడిగా కంటే సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ మధ్య స్నేహం ఎక్కువ. సినిమాలతో సంబంధం లేని, సినిమాలకు అతీతమైన బంధం వాళ్ళది. తాను కథ మాత్రమే చెబుతానని ఎటువంటి పాటలు కావాలి? ఎటువంటి నేపథ్య సంగీతం కావాలి? అనేది ఎప్పుడూ దేవి శ్రీకి చెప్పనని, తన కథకు అనుగుణంగా అద్భుతమైన బాణీలు, నేపథ్య సంగీతం ఇస్తాడని సుకుమార్ పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి స్నేహితులు మధ్య 'పుష్ప 2' విషయంలో ఎందుకు గొడవ వచ్చింది? అనేది పరిశ్రమ వర్గాలకు సైతం అంతు పట్టని విషయం.

Also Read: సిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?


హైదరాబాద్ సిటీలో ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం రెండు వారాల కంటే ఎక్కువ సమయం కేటాయించడం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే దర్శకుడు సుక్కుకు నచ్చలేదట. పైగా దేవిశ్రీ చేసిన రీ రికార్డింగ్ బాలేదని చెప్పడంతో వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీ గుసగుస. 

తప్పనిసరి పరిస్థితుల్లో దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారని చెబుతున్నారు. ఆయన చేతిలో ఏమీ లేదని... గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు నేపథ్యంలో సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో కొత్త సంగీత దర్శకుడు వచ్చి సినిమాను అర్థం చేసుకుని నేపథ్య సంగీతం ఇవ్వడం టఫ్ టాస్క్. రిజల్ట్ మీద అది ఎటువంటి ప్రభావం చూపుతుందో?

Also Read: కేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా

Continues below advertisement