లిజోమోల్‌ జోస్‌... ఈ పేరు చెబితే నోరుతిరగని ఈ పేరెందుకు చెబుతున్నారు అంటారేమో... సినతల్లి అంటే మాత్రం హా అవును జై భీమ్ సినిమాలో ఉందికదా అని ఠక్కున చెబుతారు. నిజమే జై భీమ్ లో సినతల్లిగా నటించిన ఆమె అసలు పేరు లిజోమోల్ జోస్. మలయాళీ పిల్ల. చాలామంది కేరళ అమ్మాయిల్లానే తెలుగు తెరపైకి వచ్చింది. అందరిలా వచ్చి ఉంటే కేరళ అమ్మాయి కదా బావుందిలే అనుకుని వదిలేశేవారు. ఓ నాలుగైదు సినిమాల్లో ఆఫర్లిచ్చేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ లిజోమోల్ జోస్ గురించి జరుగుతున్న చర్చ వేరు. జై భీమ్ సినిమాలో ఆమెని చూడలేదెవ్వరూ..ఆమె నటనను మాత్రమే చూశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆహా అనకుండా ఉండలేకపోయారు. సూర్య లాంటి స్టార్ హీరో స్త్రీన్ పై ఉన్నా సినతల్లిగా టాలెంట్ చూపించి కేరళ కుట్టి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె ఈ మధ్య సిద్దార్థ్ హీరోగా నటించిన ఒరేయ్ బామ్మర్ది సినిమాలో నటించింది కానీ పెద్దగా ఎవరికీ తెలియలేదు.  కానీ  ‘జై భీమ్’లో ‘సినతల్లి’ పాత్రలో ఓవర్ నైట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 



 కేరళ రాష్ట్రంలో 1992లో జన్మించిన లిజోమోల్ జోస్ ది మధ్యతరగతి కుటుంబం. లిజోకు ఓ సోదరి కూడా ఉంది. ‘అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన లిజోమోల్  పాండిచ్చేరి యూనివర్సిటీలో ‘ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్‌’లో మాస్టర్స్‌ చదివింది. కొన్ని రోజుల పాటూ ఓ టీవీ ఛానల్‌లో ఉద్యోగం చేసింది. నటుడు అరుణ్‌ ఆంటోనీని  ఈ మధ్యే పెళ్లిచేసుకున్న లిజోమోల్... ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన ‘మహేశింటే ప్రతీకారం’ సినిమాతో ఫస్ట్ ఛాన్స్ దక్కించుకుంది. ‘రిత్విక్‌ రోషన్‌’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.  ‘హనీ బీ 2.5’ కూడా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.  ‘స్ట్రీట్‌లైట్స్‌’, ‘ప్రేమసూత్రం’, ‘వత్తకోరు కాన్ముకన్‌’ సినిమాలతో లిజో పేరు మాలీవుడ్‌లో మార్మోగిపోయింది.  ఇక తమిళంలో ‘శివప్పు మంజల్‌ పచ్చాయ్‌’ ( తెలుగులో ఒరేయ్ బామ్మర్ది) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  ‘శివప్పు’లో లిజో నటనను చూసిన  దర్శకుడు జ్ఞానవేల్‌ ‘జై భీమ్‌’లో సినతల్లి క్యారెక్టర్ కు ఆమెను తీసుకున్నారు. 



 
‘జై భీమ్‌’లో తన పాత్ర గురించి స్పందించిన లీజో దాన్నుంచి బయటకు రాలేకపోయానంది.  షూటింగ్ సమయంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉండాల్సి వచ్చిందట. ఒక సారి పోలీస్ స్టేషన్ లో భర్తను కొడుతున్న సమయంలో కన్నీరు పెట్టుకుంటూ నటించాల్సిన సన్నివేశంలో గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడ్చేసిందట. దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా కన్నీళ్లు ఆగలేదంది లిజోమోల్ జోస్. దర్శకుడు సన్నివేశం చెబుతున్న సమయంలోనే కన్నీళ్లు వచ్చేశాయని చాలా మానసిక సంఘర్షణ అనుభవించానంది లిజో.  గతంలో తాను పోషించిన ఏ పాత్ర కూడా ఇంతలా ప్రభావితం చేయలేదంది. ఏదేమైనా హీరోయిన్ గా నటిస్తోన్న సమయంలో ఇలాంటి పాత్రకు ఓకే చెప్పడం సాహసం అనుకుంటే ఇప్పుడదే క్యారెక్టర్ ఆమె కెరీర్లో ది బెస్ట్ గా నిలవడం విశేషం.



Also Read: 'జై భీమ్' చూశాక 37 ఏళ్లు వెనక్కి వెళ్లా... ఆమె నా కళ్లల్లో మెదిలింది - సీపీఐ నారాయణ
Also Read: నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం, నాగశౌర్య 'లక్ష్య' సింగిల్ లిరికల్ వీడియో..
Also Read: బాలగోపాల్‌ ను నయీం ఎలా బెదిరించాడంటే...
Also Read: నక్సలైట్ల కళ్లుగప్పి నయీం 16 ఏళ్లు ఎలా తప్పించుకోగలిగాడు అన్నదే నయీం డైరీస్‌ థీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి