జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ భిన్న ధ్రువాలని ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. వాళ్లిద్దరికీ మంచి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యం ఉందని, కానీ దానికి వారి దారులు వేరని తెలిపారు. ఆర్ఆర్ఆర్ చెన్నై ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఇది నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెప్తాను. మనం ఎంత పెద్ద వాళ్లం అయినా మన హెడ్మాస్టర్, ప్రిన్సిపల్‌ను చూస్తే భయపడతాం. చెన్నై నాకు హెడ్మాస్టర్, ప్రిన్సిపల్ లాంటిది. చెన్నై మహానగరానికి, తమిళ తల్లికి నమస్కారం.’


‘ముందుగా నిర్మాత దానయ్య గురించి మాట్లాడాలి. 13 సంవత్సరాల క్రితం ఆయన నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఒక సినిమా చేయాలని అడిగారు. మర్యాద రామన్న, ఈగ చేసేటప్పుడు అది మీతోనే చేస్తానని అడిగాను. కానీ ఆయన నాతో పెద్ద సినిమా చేయాలనుకున్నారు. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆయనకే చేశాను. నా మీద నమ్మకంతో ఇంతకాలం ఎదురుచూసినందుకు, ఖర్చుకు వెనకాడకుండా సినిమా తెరకెక్కించినందుకు దానయ్యకు థ్యాంక్స్.’


‘తల్లిదండ్రులు పిల్లలని చిన్న వయసులో మాత్రమే ఎత్తుకుని పెంచుతారు. కానీ నాకు 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ.. మా నాన్న ఇప్పటికీ తన భుజాల మీద నన్ను మోస్తున్నారు. ఆయనే నా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్. అలాగే అన్నయ్య కీరవాణికి కూడా నేను రుణపడి ఉంటాను.’


‘నేను ఆర్ఆర్ఆర్ గురించి ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణం.. ఇది భారతదేశ మట్టిలో ఉండే ఎమోషన్. దీన్ని లార్జర్ దేన్ లైఫ్ స్థాయిలో తెరకెక్కించాం. కానీ దాన్ని తెరకెక్కించాలంటే నాకు రెండు ఫిరంగులు కావాలి. వారు ప్రేక్షకుల మనసును బలంగా తాకాలి.’


‘ఇటువంటి సినిమా చేయాలంటే నాకు డెడికేషన్, ఫ్రెండ్‌షిప్, సపోర్ట్ బలంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కావాలి. వారిలో ఒకరు నా సోదరుడు, నా స్నేహితుడు, నాతో ఎప్పుడూ గొడవ పడే ఎన్టీఆర్. తనెప్పుడూ నా విద్యార్థినని చెప్పుకుంటాడు. కానీ నాకు తనంటే చాలా ఇష్టం.’


‘నేను చరణ్ నుంచి చాలా నేర్చుకున్నాను. భారతదేశంలో ఆర్ఆర్ఆర్ కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారన్నా.. అమెరికాలో ప్రీ-సేల్స్ ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు దాటినా.. దానికి కారణం నేను కాదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణే దానికి కారణం.’


‘ఎన్టీఆర్ నాతో ఎప్పుడూ గొడప పడుతూ ఉంటాడు. నాకంటే తనే సీనియర్ అంటాడు. తారక్ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. ఎన్టీఆర్‌కి, నాకు చాలా గొడవలు ఉంటాయి. వీళ్లతో రెండేళ్లు పని చేశాక నేను ఎన్టీఆర్‌ని చరణ్ అని, చరణ్‌ని తారక్ అనే వాడ్ని.’


‘ఎన్టీఆర్‌కు అస్సలు టైమ్ సెన్స్ లేదు. ఏడు గంటలకు షూటింగ్ అయితే ఆరు గంటలకే సెట్‌కు వస్తాడు. నా మనసులో ఏముందో తారక్ తెలుసుకుని నేను చెప్పకముందే అలా చేస్తాడు. ఎన్టీఆర్ లాంటి నటుడు దొరకడం ఇండియన్ సినిమా అదృష్టం. మూడేళ్లు ఆర్ఆర్ఆర్‌తో ఉండిపోయినందుకు తారక్‌కు థ్యాంక్స్.’


‘చరణ్‌ నా హీరో. తన గురించి తను సెక్యూర్‌గా ఫీల్ అయిన చరణ్ లాంటి నటుడిని నేను ఇంతవరకు చూడలేదు. తారక్, చరణ్ ఇద్దరికీ ఒక స్థానానికి చేరుకోవాలని ఆశ ఉంది. కానీ దాన్ని చేరుకోవడానికి వాళ్లు ఎంచుకున్న దారులు వేరు. ఇద్దరూ పూర్తి వ్యతిరేక ధ్రువాలు. ఈ రెండు ధ్రువాలు అయస్కాంతంలా ఆర్ఆర్ఆర్‌కు అతుక్కున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. జనవరి 7వ తేదీ ఆర్ఆర్ఆర్ మీ ముందుకు వస్తుంది. మీకు బాహుబలి నచ్చితే ఆర్ఆర్ఆర్ కూడా కచ్చితంగా నచ్చుతుంది. ’ అంటూ తన స్పీచ్‌ను ముగించారు.







Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద‌ కొట్టిన రాజమౌళి
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
Also Read: రాజమౌళి మాట్లాడారు! సరే కానీ... హీరోలు అందుకు రెడీగా ఉన్నారా?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి