టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ రాపిడో అనే సంస్థ ప్రకటనలో నటించారు. అది బైక్ మొబిలిటి బుకింగ్ యాప్. ఉద్దేశపూర్వకంగా చెప్పారో లేకపోతే అంత కంటే మంచి ఉదాహరణ ఉండదో కానీ ఆర్టీసీ బస్సుల కన్నా తమ బైక్ బుకింగ్ చాలా వేగం అని చెప్పారు. ఇది ఆర్టీసీకి కొత్తగా ఎండీగా బాధ్యతలు చేపట్టిన " ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్" సజ్జనార్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆ సంస్థతో పాటు అందులో నటించిన అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు " షూట్ " చేసేశారు. అంతే కాదు తర్వాత మీడియాతో తో మాట్లాడుతూ అల్లు అర్జున్ క్షమాపమ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఈ వివాదంపై ఆ సంస్థ కానీ.  అల్లు అర్జున్ కానీ స్పందించలేదు. అసలు బస్సుల కన్నా వేగం అని చెప్పుకుంటే ఓ సంస్థను కించపరిచినట్లేనా ? ఇది న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సరిపోతుందా ? . ఇలాంటి ప్రకటనలు ఇంతకు ముందు రాలేదా ?


Also Read : అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..


ఆర్టీసీని కించ పరిచారని సజ్జనార్ నోటీసులు !


బైక్ మొబిలిటి యాప్ యాడ్‌లో ఆర్టీసీని తక్కువ చేసి చూపారని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రధానమైన ఆరోపణ. బస్సుల కంటే వేగంగా వెళ్తుందని.. సిటీ బస్సుల్లో ప్రయాణిస్తే మసాలా దోసెలా అయిపోతారని పోల్చారు. ఇది స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిందే కానీ కించపరిచినట్లుగా ఎక్కడ ఉందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఆర్టీసీ సిటీ బస్సులు కిక్కిరిసిపోయి ఉంటాయి. వాటి టైం మేనేజ్‌మెంట్ గురించి చెప్పుకోకపోవడమే మంచిది. అవి బయలుదేరిన తర్వాత ఎప్పుడు గమ్యం చేరుకుంటాయో ఊహించడం కష్టం. ఇలాంటి పాయింట్లనే ఆ సంస్థ తన బైక్ బుకింగ్స్ కోసం వాడుకుంది. అది సజ్జనార్‌కు నచ్చలేదు. అందుకే ఆయన లీగల్ చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇందులో న్యాయపరమైన చర్యలు తీసుకోగలిగినంత సరంజామా ఉందో లేదో న్యాయస్థానాలే తేల్చాలి. 


Also Read : మగవాళ్లు చూపిస్తే తప్పులేదు...ఆడవారు చూపించ కూడదా..ఇదేనా సమానత్వం..!


ఇప్పటి వరకూ సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనల్లో నటిస్తున్నారన్న విమర్శలు  !


అల్లు అర్జున్ యాడ్ వివాదం ప్రారంభం కాక ముందు సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనల్లో నటిస్తున్నారన్న విమర్శలు ఉండేవి. అంటే అవి ప్రజలను మోసం చేసేవి అనుకోవచ్చు. సెలబ్రిటీలు ప్రకటనలు ఇచ్చే కొన్ని కంపెనీలు ప్రజలను ముంచి ఆ తర్వాత ఎత్తివేసిన వాటిని చూస్తున్నాం. ప్రత్యక్షంగా డబ్బు రూపంలో ఈ విధంగా నష్టం కలిగిస్తున్నవి కొన్ని. ఇక వాడే వస్తువులలో నాణ్యత లేక ప్రజలను మోసగించేవి యింకొన్ని. కూల్‌డ్రింక్స్‌, జంక్‌ఫుడ్‌ మొదలైన వాటిల్లో ఆరోగ్యానికి హానికరమైన వున్నాయని అనేక మంది హెచ్చరిస్తూనే ఉన్నారు. కూల్ డ్రింక్ప్ ప్రకటనల్లో నటించినా విమర్శలు వస్తూనే ఉన్నాయి. 


Also Read : పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !


వినియోగదారుల పరిరక్షణకు ఇప్పటికే చట్టం  !


సెలబ్రిటీల్నీ ప్రకటనల్లో చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారన్న ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టం లోక్‌సభలో ఆమోదం పొందింది. ప్రక‌ట‌న‌లో న‌టించిన సెల‌బ్రిటీల‌ను బాధ్యులను చేయటం, కల్తీకి కఠిన శిక్ష విధించటం వంటివి అందులో ఉన్నాయి. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు.. ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ. 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష వంటివి చట్టంలో ఉన్నాయి. 


Also Read : ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే!


సెలబ్రిటీలపై సరోగసి అడ్వర్‌టైజింగ్ వివాదాలు !


సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లోనే కాదు.. ఆరోగ్యానికి హానీ చేసే డొంక తిరుగుడుప్రకటనల్లోనూ నటిస్తున్నారు. సరోగేట్ అడ్వార్‌టైజింగ్‌లోనూ నటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు, గుట్కా, మద్యం ప్రకటనలను నిషేధించింది.  ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగులు, పత్రిక , టీవీ ప్రకటనలు ఇవ్వకూడదు. అయితే మొదట్లో కొన్నాళ్లు ఆ కంపెనీలు ప్రకటనలు నిలిపివేశాయి. కానీ తర్వాత డొంక తిరుగుడు పద్దతిలో మార్కెట్లో ప్రకటనలు విడుదల చేయడం ప్రారంభించాయి.  ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంది. రాయల్ చాలెంజర్స్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఆ పేరుతో ప్రకటనలు కూడా వస్తాయి. ఆ ప్రకటనల్లో చివరికి ఓ సోడా లేదా మంచినీళ్ల సీసాను ప్రమోట్ చేస్తారు. అలాగే పాన్ మసాలా పేరిట యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇలాచీ, వక్కపొడి అంటూ ప్రకటనలు ఇచ్చి.. బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు అసలు ఉద్దేశం పొగాకు ఉత్పత్తుల ప్రచారమే. దీన్నే సరోగేట్ అడ్వర్ టైజింగ్ అంటారు. బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తు ఇలాంటి ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. ఇటీవల ఓ ప్రకటన నుంచి విమర్శలు రావడంతో అమితాబ్  బచ్చన్ విరమించుకున్నారు. 


Also Read : సినీ తారల "సరోగేట్‌" కక్కుర్తి ! విమర్శలొచ్చినా వెనక్కి తగ్గరా ..?


అల్లు అర్జున్ ప్రకటన ఎక్కడా మోసం చేసేలా లేదు ! కానీ మనోభావాల సమస్య !


అయితే అల్లు అర్జున్ నటించిన ప్రకటనలో ఎక్కడా వినియోగదారుల్ని మోసం చేసేలా లేదు. కానీ ఇక్కడ ఆర్టీసీ మనోభావాల సమస్య వచ్చింది. దాన్ని సజ్జనార్ హైలెట్ చేశారు. తాను నడిపిస్తున్న సంస్థను చూపించి.. తన సంస్థను ప్రమోట్ చేసుకోవడం ఆయనను  బాధించి ఉండవచ్చు. ఇటీవలి కాలంలో ఆయన ఆర్టీసీని గాడిలో పెట్టడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా ఓ ప్రైవేటు సంస్థ ఆర్టీసీని దోసె. మసాలదోసెలను ఉదాహరణగా చూపించినంత మాత్రాన జనం బస్సులుఎక్కడం మానేస్తారా..? అందరూ ఆ యాప్‌ను ఉపయోగించుకుని బైక్‌లు బుక్ చేసుకుంటారా అంటే అలాంటిదేమీ ఉండదని స్పష్టంగా చెప్పవచ్చు.  ఇంకా చెప్పాలంటే ఈ యాడ్‌లో అల్లు అర్జున్ నటించకపోతే... ఆయనే కాదు ఏ సెలబ్రిటీ నటించకపోయినా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో ...?


Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి