‘స్క్విడ్ గేమ్’ (Squid Game).. ఈ వెబ్‌సీరిస్ రిలీజ్ అయ్యే వరకు ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదేదో చిన్న పిల్లల గేమ్‌లా ఉందే.. ఒకసారి చూద్దామని మొదలుపెట్టిన ప్రేక్షకులను ఈ వెబ్‌సీరిస్ కట్టిపడేసింది. ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు మెచ్చిన వెబ్‌సీరిస్‌గా రికార్డులు సైతం బద్దలు కొట్టేసింది. దీంతో అంతా ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) సీజన్ 2 వెంటనే రిలీజ్ చేసేయండి చూసేస్తాం అంటున్నారు. అయితే, ఈ వెబ్‌సీరిస్‌కు ఇంత క్రేజ్ వస్తుందని నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కూడా ఊహించలేదట. మరో చిత్రం ఏమిటంటే.. ‘స్క్విడ్ గేమ్’ తర్వాత కొరియన్ వెబ్‌సీరిస్‌లను చూసేవారి సంఖ్య రెట్టింపు అయ్యిందట. నవంబరు 19న విడుదల కానున్న హెల్ బాండ్ (Hellbound) వెబ్ సీరిస్‌పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అకస్మాత్తుగా మనుషులను నరకానికి లాక్కెళ్లిపోయే అతీంద్రియ శక్తులు చేసే విధ్వంశాన్ని ఈ వెబ్‌సీరిస్‌లో చూపించనున్నారు.


‘స్క్విడ్ గేమ్’ రాక ముందు కూడా చాలామంది కొరియన్ వెబ్‌సీరిస్‌లు చూసేవారు. కొందరు ఇంగ్లీష్‌లో డబ్బింగ్ కాలేదని.. పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అయితే, ఇప్పుడు అనువాదంతో పనిలేకుండానే సబ్ టైటిల్స్‌తో కొరియా వెబ్‌సీరిస్‌లు చూసేస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అమేజాన్ ప్రేమ్ వీడియో ఓటీసీ సంస్థ కూడా నవంబరులో పలు వెబ్‌సీరిస్‌లను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ముందుగా ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ఈ 6 పాపులర్ కొరియన్ వెబ్‌సీరిస్‌లను చూసేయండి.


కింగ్‌డమ్ (Kingdom): ఈ వెబ్‌సీరిస్ 2019లో విడుదలైంది. మధ్యయుగంలో కొరియాలోని జాంబీస్ వైరస్ ముప్పు వల్ల ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారనేది ఈ వెబ్‌సీరిస్‌లో చూపించారు. ఇది మాంచి థ్రిల్ కూడా ఇస్తోంది. సాధారణ జాంబీస్ వెబ్‌సీరిస్ కంటే భిన్నంగా ఉంటుంది. కొరియా నుంచి వచ్చని మొదటి నెట్‌ఫిక్స్ ఒరిజనల్స్‌ సీరిస్ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో రెండు సీజన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి.. ఫుల్ టైంపాస్. అయితే, ఈ కింగ్‌డమ్‌ను పిల్లలతో మాత్రం చూడకండి. 


మై నేమ్ (My Name): ఇటీవలే విడుదలైన కొరియన్ డ్రామా ఇది. తండ్రి గ్యాంగ్‌స్టర్ కావడంతో.. కూతురు అతడికి దూరంగా ఉంటుంది. ఓ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా తండ్రి.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా ఆమె ఉంటున్న ఇంటికి వస్తాడు. ఈ సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె తండ్రిని చంపేస్తాడు. తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకొనేందుకు ఆమె ఓ డాన్ సాయం తీసుకుంటుంది. కరాటేలో శిక్షణ పొందుతుంది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరి హంతకుడి గురించి అన్వేషిస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ఇది కూడా ఒకటి.


వాగాబాండ్ (Vagabond): తల్లిదండ్రులు వదిలేయడంతో ఓ బాలుడు అనాథ శరణాలయంలో ఉంటాడు. సినిమాల్లో స్టంట్ మ్యాన్‌గా పనిచేస్తున్న ఆ బాలుడి మేనమామ ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి సొంత కొడుకులా చూసుకుంటాడు. ఆ బాలుడికి కరాటేలో శిక్షణ ఇచ్చి మొరాక్కోలో జరిగే ఓ ప్రదర్శనకు బలవంతంగా పంపిస్తాడు. విమాన ప్రమాదంలో మేనల్లుడు చనిపోతాడు. అయితే, ప్రమాదానికి ముందు మేనల్లుడు విమానంలో తీసిన వీడియో ద్వారా అది ప్రమాదం కాదని, తీవ్రవాదుల చర్య అని తెలుసుకుంటాడు. ఆ విమానాన్ని కూల్చేసిన వ్యక్తి మొరక్కోలో కనిపించడంతో అసలైన కథ మొదలవుతోంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలే కాదు.. గుండెలో పిండేసే సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. మొత్తం 16 ఎసిసోడ్స్ ఇందులో ఉన్నాయి. దక్షిణ కొరియాలో ఇది మోస్ట్ పాపులర్ వెబ్‌సీరిస్.  


సేవ్ మీ (Save Me): నగరంలో నివసించే ఓ కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులతో ఓ గ్రామానికి మకాం మార్చుతుంది. కొడుకు ఆత్మహత్యతో వారు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోతారు. దీంతో ఆ కుటుంబమంతా స్థానిక మత సంస్థలో చేరుతారు. మత పెద్దల వలలో చిక్కుకుని ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనేది మిగతా కథ. ఇది 2017లో విడుదలై కొరియన్ డ్రామా. మొదటి సీజన్‌లో మొత్తం 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. రెండో సీజన్ ఇప్పటికే కొరియాలో విడుదలైంది. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు.  


స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్ (Strangers From Hell): టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం సియోల్‌ నగరానికి వెళ్లే ఓ వ్యక్తికి ఎదురయ్యే వింత అనుభవలే స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్. ఈడెన్ స్టూడియోలో సరసమైన ధరలో ఒక గదిని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సందర్భంగా అతడు తన పొరుగువారి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. మొత్తం 10 ఎపిసోడ్‌లను Netflixలో చూడవచ్చు. హత్యలు, నరమాంస భక్షణ సన్నివేశాలతో ఈ సీరిస్ మిమ్మల్ని థ్రిల్‌కు గురిచేస్తుంది. 


హోటల్ డెల్ లూనా (Hotel Del Luna): హింసాత్మక నేరాలకు పాల్పడిన ఓ మహిళ ప్రాయశ్చితంగా దెయ్యాల కోసం ఓ హోటల్‌ను నిర్వహిస్తుంది. అదే ‘హోటల్ డెల్ లూనా’. ఈ వెబ్‌సీరిస్.. ఫాంటసీ, రొమాన్స్‌తోపాటు మాంచి థ్రిల్‌కు గురిచేస్తుంది. రక్తపాతాన్ని చూసే ధైర్యం ఉంటే.. ఈ వెబ్‌సీరిస్‌ను చూడొచ్చు.  ఇది కొరియాలోనే అత్యధిక రేటింగ్ పొందిన వెబ్‌సీరిస్. ఇందులో మొత్తం 16 థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే చూసేయండి. దీని తర్వాత ‘అమేజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతున్న థ్రిల్లింగ్ కొరియన్ వెబ్‌సీరిస్ గురించి తెలుసుకుందాం. 


Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి