'యశోద' సినిమా (Yashoda Movie) ను ఓటీటీలో విడుదల చేయకూడదని ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు 'ఈవా' అని పేరు పెట్టారు. హైదరాబాద్, వరంగల్‌లో 'ఈవా ఐవీఎఫ్' పేరుతో హాస్పిటల్స్ ఉన్నాయి.


'యశోద'లో 'ఈవా' పేరు ఉపయోగించడం వల్ల తమ హాస్పిటల్స్ బ్రాండ్ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోందని ఆస్పత్రి వర్గాలు ఐదు కోట్ల రూపాయలకు కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే 'యశోద' చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఆస్పత్రి వర్గాలతో సంప్రదింపులు జరిపారు. దాంతో సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం అయ్యింది.


'యశోద'లో ఈవా పేరు తీసేశారు!'యశోద'లో 'ఈవా' పేరును తొలగించినట్టు శివలెంక కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ నిర్ణయంతో 'ఈవా ఐవీఎఫ్' ఆస్పత్రి ఎండీ మోహన్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇరువురు కలిసి మంగళవారం హైదరాబాద్‌లో విలేఖరులతో సమావేశం అయ్యారు. అందులో ఏం మాట్లాడారంటే...
 
మాకు బాధపెట్టే ఉద్దేశం లేదు : శివలెంక కృష్ణ ప్రసాద్
ఒకరిని బాధ పెట్టే ఉద్దేశం గానీ, ఇతరుల మనోభావాలను కించపరిచే ఆలోచన గానీ తమకు అసలు లేదని 'యశోద' నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. 'ఈవా ఐవీఎఫ్' పేరుతో ఆసుపత్రి ఉన్న విషయం తమకు తెలియకపోవడంతో ఆ పేరును సినిమాలో ఉపయోగించమని, దాంతో చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మించిన 'యశోద' విజయవంతమైన సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి 'ఈవా' అని పేరు పెట్టాం. దానికి మేం ఇచ్చిన నిర్వచనం వేరు. సినిమా అనేది పవర్ ఫుల్ మీడియం కావడంతో... 'యశోద'లో ఈవా అని చూపించడంతో తమకు ఇబ్బంది కలుగుతుందని కోర్టు ద్వారా న్యాయం కోసం హైదరాబాద్ - వరంగల్‌కు చెందిన 'ఈవా ఐవీఎఫ్' ఫెర్టిలిటీ ఆసుపత్రి వారు ప్రయత్నించారు. తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు కోర్టు థియేటర్లలో కాకుండా ఓటీటీ వరకు ఆ పేరు వాడకూడదని ఆర్డర్స్ ఇచ్చింది. నాకు విషయం తెలిసిన వెంటనే 'ఈవా ఐవీఎఫ్' హాస్పటల్స్ యాజమాన్యాన్ని సంప్రదించాను. 'ఈవా' పేరు తీసేస్తామని నేను చెబితే... అప్పుడు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇప్పుడు సినిమాలో 'ఈవా' అనేదానిని తొలగించాం. భవిష్యత్తులో 'యశోద' సినిమాలో ఎక్కడా 'ఈవా' పేరు కనిపించదు. అయితే, థియేటర్లలో ప్లే అవుతున్న సినిమాలో మార్పుకు కొంత సమయం పడుతుంది. ముందు సెన్సార్ జరగాలి. ఆ తర్వాత కేడీఎంలు మార్చాలి. ఈ విషయం చెబితే... 'ఈవా ఐవీఎఫ్' ఆసుపత్రి వర్గాలు అంగీకరించాయి. ఇప్పుడు సమస్య పరిష్కారం అయ్యింది'' అని చెప్పారు. 'ఈవా ఐవీఎఫ్' ఆస్పత్రికి తాను వెళ్ళానని, వాళ్ళు ఆర్గనైజ్డ్‌గా మంచి సర్వీస్ అందిస్తున్నారని ఆయన తెలిపారు.   


సమస్య ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని అనుకోలేదు : ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావు
ఈ సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని తాను అనుకోలేదని, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు, ఆయన టీమ్ వెంటనే స్పందించినందుకు చాలా సంతోషంగా ఉందని 'ఈవా ఐవీఎఫ్' ఎండీ మోహన్ రావు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేను ట్రైలర్ గానీ, థియేటర్లలో విడుదలైన వెంటనే సినిమాను గానీ చూడలేదు. నా స్నేహితులు చూసి చెప్పడంతో వెళ్ళాను. మా బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందని కేసు వేశా. అయితే... కృష్ణ ప్రసాద్ గారు మాతో మాట్లాడారు. మాకు ఇచ్చిన మాట ప్రకారం సినిమాలో 'ఈవా' పేరు తొలగించారు. ఇటీవల నాకు సినిమా చూపించారు. అందులో ఎక్కడా 'ఈవా' అని లేదు. నిన్న (సోమవారం) మళ్ళీ న్యాయస్థానం దగ్గరకు వెళ్లి... 'యశోద' నిర్మాత చేసిన మార్పులతో సంతృప్తిగా ఉన్నామని చెప్పాం. అలాగే, కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపాం. కోర్టు వెంటనే ఆమోదించింది. ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా అయ్యింది'' అని చెప్పారు. నిర్మాతను సంప్రదిస్తే ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని తనకు ముందు తెలియదని... అందుకే కోర్టుకు వెళ్ళామని ఆయన తెలిపారు. 


Also Read : ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్


సమంత టైటిల్ పాత్రలో నటించిన 'యశోద' చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. రూ. 30 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది.