కశ్మీర్ ఫైల్స్.. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి ఏదో రకంగా చర్చల్లో ఉన్న సినిమా. అయితే పాజిటివ్ లేదా నెగటివ్. ఈ సినిమా గురించి మాట్లాడిన వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కశ్మీర్ లో హిందూ పండిట్లపై జరిగిన దారుణమైన ఊచకోత కథాంశంగా వచ్చిన ఈ సినిమాను సపోర్ట్ చేసిన వాళ్లు..కన్నీళ్లు పెట్టుకుని నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుని కృతజ్ఞతలు చెప్పుకున్న వాళ్లు ఎంత మంది ఉన్నారో...నాటి ఘటనను పొలిటికలైజ్ చేశారంటూ ఇందులో ప్రధానంగా బీజేపీ హస్తం ఉందంటూ విమర్శించిన వాళ్లు ఉన్నారు. సరే సినిమా రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదంతా గతం. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా చుట్టూ వివాదం రాజుకుంది. కానీ ఈ సారి ప్రపంచస్థాయి వేదికపై. 


గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-IFFI లో ముగింపు వేడుకల్లో ఈ ఘటన జరిగింది. మన మెగాస్టార్ చిరంజీవి కి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అందించిన వేదికపైనే ఇఫీ జ్యూరీకి అధ్యక్ష హోదా లో ఉన్న ఇజ్రాయెల్ కు చెందిన డైరెక్టర్, రైటర్ నాదవ్ లాపిడ్(Nadav Lapid) చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపుతున్నాయి. 


అసలేం జరిగింది?


ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా అనేక నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ను ఇఫీలో ప్రదర్శించారు. అంతా బాగానే ఉంది. వేడుకలు ముగిశాయి. వందనసమర్పణ కోసం మాట్లాడాల్సిన ఇఫీ జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ డైరెక్టర్ నాదవ్ లాపిడ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు. కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్‌ ఎప్పటికీ స్వాగతిస్తుంది. అందుకే నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతున్నా’’ అంటూ వ్యాఖ్యలు నాదవ్ లాపిడ్. తొలుత అక్కడ ఉన్నవాళ్లకు ఆయనేం మాట్లాడారో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.


ట్విట్టర్ లో ట్రెండింగ్


కొన్ని గంటల్లోనే నాదవ్ లాపిడ్ చేసిన కామెంట్లను బీజేపీ వ్యతిరేక పార్టీలు, కశ్మీర్ ఫైల్స్ ను విమర్శించిన వారు ట్రెండ్ చేయటం మొదలుపెట్టారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ షేమ్ అనే పదం ఇప్పుడు అఫీషియల్ అయ్యింది అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో ఉన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నేరుగా అయితే ఇప్పటి వరకూ స్పందించలేదు కానీ ఇజ్రాయెల్ రాయబారులు చేసిన ట్వీట్లను రీట్వీట్ చేశారు. భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్ ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. లాపిడ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. ‘భారతీయ సంప్రదాయంలో అతిథిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి దేశానికి వచ్చి ఇఫిలో జడ్జీ ప్యానెల్‌కు హెడ్‌గా ఉన్న మీరు(లాపిడ్‌).. ఆతిథ్యమిచ్చిన దేశాన్నే అవమానించారు. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటికి గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్‌ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నా. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని గిలాన్‌ ట్వీట్స్ చేశారు.


మండిపడిన కశ్మీరీ ఫైల్స్ టీమ్


కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ లాపిడ్ వ్యాఖ్యలపై ట్వీట్లు చేశారు. యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని అనుపమ్ ఖేర్ ట్వీట్  చేశారు. డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి కూడా ట్విటర్‌లో స్పందించారు. ‘నిజం చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రజలతో అబద్దాలు చెప్పించగలదు’ అంటూ ట్వీట్ చేశారు.


లాపిడ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం : జ్యూరీ బోర్డు


నాదవ్ లాపిడ్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన తరుణంలో....ఇఫి జ్యూరీ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీనిపై జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘‘జ్యూరీ సభ్యులుగా.. ఒక సినిమా సాంకేతికత, నాణ్యత, సామాజిక-సాంస్కృతిక ఔచిత్యాన్ని మాత్రమే మేం అంచనా వేస్తాం. అంతేగానీ సినిమాలపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోం. ఒకవేళ జ్యూరీ సభ్యులెవరైనా అలా చేస్తే.. అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని జ్యూరీ బోర్డు ప్రకటనలో పేర్కొంది.


ఇఫీ అధ్యక్షుడి హోదాలో లాపిడ్ చేసిన వ్యాఖ్యలు ఇఫీ చేసిన వ్యాఖ్యలే అని బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. వాస్తవానికి కశ్మీర్ ఫైల్స్ ను ప్రమోట్ చేసిన వాళ్లలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. కశ్మీరీ పండిట్ల పై జరిగిన దురాగతాలను చరిత్ర మర్చిపోదు అంటూ ఆయన అప్పట్లో సినిమాను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వమే నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రప్రభుత్వమే నియమించిన జ్యూరీ అధ్యక్షుడు కశ్మీరీ ఫైల్స్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్రం ఎలా కప్పిపుచ్చుకుంటుందంటూ విమర్శిస్తున్నారు. మొత్తంగా విడుదలై ఇన్ని నెలల గడుస్తున్నా కశ్మీర్ ఫైల్స్ చర్చల్లో ఉంటూనే వస్తోంది.