FIFA WC 2022:  ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో టీం పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. సోమవారం ఉరుగ్వేతో జరిగిన మ్యాచులో 2-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ఫ్రాన్స్, బ్రెజిల్ తర్వాత నాకౌట్ దశకు చేరుకున్న మూడో జట్టుగా నిలిచింది. ఆ జట్టు ఆటగాడు బ్రూనో ఫెర్నాండెజ్ ఆ రెండు గోల్స్ చేశాడు. 


ప్రథమార్ధంలో గోల్ లేకుండానే


ఆట మొదటి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఎక్కువభాగం బంతిని నియంత్రణలోనే ఉంచుకున్న పోర్చుగల్ గోల్ మాత్రం కొట్టలేకపోయింది. పదేపదే ఉరుగ్వే గోల్ పోస్టులోకి దాడులు చేసినా ఆ జట్టు గోల్ కీపర్ సమర్ధంగా వాటిని అడ్డుకున్నాడు. 


రెండో అర్ధభాగంలో రెండు గోల్స్


 రెండో అర్ధభాగంలో 54వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు ఫెర్నాండెజ్ గోల్ చేశాడు. రొనాల్డో పాస్ ను అందుకున్న ఫెర్నాండెజ్ బంతిని నేరుగా గోల్ పోస్ట్ లోకి కొట్టాడు. మరో గోల్ ను స్టాపేజ్ సమయంలో ఫెర్నాండెజ్ సాధించాడు. దీంతో పోర్చుగల్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉరుగ్వే చివరి వరకు గోల్ చేయలేకపోయింది. పోర్చుగల్ విజయం సాధించింది. ఈ విజయంతో 6 పాయింట్లు దక్కించుకున్న ఆ జట్టు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. పోర్చుగల్ తన చివరి మ్యాచును దక్షిణ కొరియాతో ఆడనుంది. అలాగే ఉరుగ్వే ఘనాతో తలపడనుంది. 


ఆసక్తికరంగా రౌండ్ ఆఫ్ 16 పోరు


ఈ ప్రపంచకప్ లో రౌండ్ ఆఫ్ 16 పోరు ఆసక్తికరంగా ఉంది. రెండు రౌండ్ల గ్రూప్ స్టేజ్ తర్వాత కూడా కేవలం 3 జట్లు మాత్రమే నాకౌట్ దశకు అర్హత సాధించాయి. ఇంకా 13 జట్లకు అవకాశం ఉంది. చివరి రౌండ్ లో మ్యాచుల తర్వాత ఆయా జట్లేవో తేలతాయి. ప్రస్తుతం రెండు జట్లు ఖతార్, కెనడా మాత్రమే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.