FIFA WC 2022 Qatar:  ప్రపంచ నెంబర్ వన్ బ్రెజిల్ ఫిఫా ప్రపంచకప్ లో రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. సోమవారం స్విట్జర్లాండ్ తో హోరాహోరీగా జరిగిన మ్యాచులో 1-0 తేడాతో గెలిచింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్ తర్వాత నాకౌట్ చేరిన  రెండో జట్టుగా నిలిచింది. 


బ్రెజిల్ కు ఈ విజయం అంత తేలికగా దక్కలేదు. స్విట్జర్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తమ సూపర్ స్టార్ నెయ్ మార్ లేకపోయినా బ్రెజిల్ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి గెలిచారు. మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా బ్రెజిల్ విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు కాసెమిరో 83వ నిమిషంలో గోల్ చేశాడు. ఇది ఆ జట్టుకు రెండో విజయం. బ్రెజిల్ కెప్టెన్ నెయ్ మార్ గాయం కారణంగా ఈ మ్యాచులోనూ ఆడలేదు. 


ఫస్ట్ హాఫ్ లో నో గోల్


మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభమైన తొలి 10 నిమిషాలపాటు రెండు జట్లు రక్షణాత్మక ఆటతీరును కనబరిచాయి. 14వ నిమిషంలో స్విట్జర్లాండ్ కు లభించిన ఫ్రీకిక్‌ వృథా అయ్యింది. 20వ నిమిషం నుంచి బ్రెజిల్‌ ఎదురుదాడికి దిగి బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. 27వ నిమిషంలో రాఫిన్హా సూపర్‌ క్రాస్‌ను అందుకున్న వినిసియస్‌ జూనియర్‌ అతి సమీపం నుంచి గోల్‌ కోసం ప్రయత్నించినా స్విస్‌ కీపర్‌ సోమర్‌ సమర్థంగా అడ్డుకోగలిగాడు. ఇక 43వ నిమిషంలో స్విస్‌ తొలిసారి బ్రెజిల్‌ గోల్‌ పోస్టుపైకి దాడికి దిగినా ఫలితం కనిపించలేదు. 45వ నిమిషంలోనూ రాఫిన్హా కార్నర్‌ కిక్‌ను స్విస్‌ కీపర్‌ ఒడిసిపట్టుకున్నాడు. ప్రథమార్ధంలో బ్రెజిల్‌కు పలు అవకాశాలు వచ్చినా స్విస్‌ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.


చివరి నిమిషాల్లో గోల్


ద్వితీయార్ధం 65వ నిమిషంలో వినిసియస్‌ జూనియర్‌ చేసిన గోల్‌ను రెఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో బ్రెజిల్‌కు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత లభించిన ఫ్రీకిక్‌లు కూడా బ్రెజిల్‌కు ఉపయోగపడలేదు. 73వ నిమిషంలో రాఫిన్హా, రిచర్లిసన్‌ స్థానాల్లో సబ్‌స్టిట్యూట్స్‌ను ఆడించారు. అయితే బ్రెజిల్‌ పట్టు విడవకుండా ప్రయత్నించింది. 83వ నిమిషంలో ఆ జట్టుకు గోల్ దక్కింది. వినిసియస్‌ అందించిన పాస్‌ను టాప్‌ కార్నర్‌ నుంచి కాసెమిరో చక్కటి వాలీతో బంతిని నెట్‌లోకి పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. ఆతర్వాత కూడా బ్రెజిల్‌ నుంచి స్విస్‌కు తీవ్ర పోటీయే ఎదురైంది. ఓవైపు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.



  • ప్రపంచ కప్‌లో బ్రెజిల్ తొలిసారి స్విట్జర్లాండ్‌ను ఓడించింది. ఈ రెండు జట్ల అంతకు ముందు జరిగిన 2 మ్యాచులు డ్రాగా ముగిశాయి.

  •  స్విట్జర్లాండ్ డిసెంబరు 1980 తర్వాత మొదటిసారిగా బ్రెజిల్‌తో జరిగిన గేమ్‌లో స్కోర్ చేయడంలో విఫలమైంది (స్నేహపూర్వక మ్యాచ్‌లో 0-2 తేడాతో ఓడిపోయింది). ఈరోజు ముందు వారితో జరిగిన మునుపటి 6 మ్యాచ్‌లలో ఒక్కో గోల్‌ని సాధించింది.

  •  ప్రపంచ కప్ చరిత్రలో 17 వరుస గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో (మునుపటి ఎడిషన్‌లలో చివరి మరియు రెండవ గ్రూప్ రౌండ్‌లతో సహా) ఓటమి ఎరుగని మొదటి జట్టుగా బ్రెజిల్ నిలిచింది.

  •  దక్షిణ అమెరికా దేశాలలో తాను ఆడిన పదింట్లో ఒక దానిలో మాత్రమే స్విట్జర్లాండ్ విజయం సాధించింది. 2014లో బ్రెసిలియాలో ఈక్వెడార్ ను 2-1తో ఓడించింది. 

  • బ్రెజిల్ తమ చివరి తొమ్మిది గేమ్‌లలో ప్రతి ఒక్కటి గెలిచింది.