Women's Day Special Playlist: స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. ఒక అమ్మగా, అమ్మాయిగా, చెలియాగా, చెల్లాయిగా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సందర్భంగా స్త్రీల ఔనత్యాన్ని, మహిళల విశిష్టతను, గొప్పదనాన్ని వివరించే తెలుగు సినిమా పాటల గురించి తెలుసుకుందాం.


'లేచింది నిద్ర లేచింది' - గుండమ్మ కథ
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గుండమ్మ కథ'. ఈ చిత్రంలో 'లేచింది నిద్ర లేచింది మహిళాలోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది' అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచింది. 1962 లోనే స్త్రీలు అన్ని వర్గాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారనే విషయాన్ని చర్చించిన గీతం ఇది. ఘంటసాల స్వర సారథ్యంలో వచ్చిన ఈ పాటకు పింగళి నాగేశ్వర రావు సాహిత్యం అందించారు.



'ఎవరు రాయగలరు', 'సృష్టికర్త ఒక బ్రహ్మ' - అమ్మ రాజీనామా 
1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథా చిత్రం 'అమ్మ రాజీనామా'. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి, తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమాలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇందులోని 'ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న తియ్యని కావ్యం', 'సృష్టికర్త ఒక బ్రహ్మ' పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. కె. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు.




'ఆడ జన్మకు' - దళపతి 
మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దళపతి'. మహాభారతంలోని దుర్యోధన, కర్ణ, అర్జున పాత్రలను ఆధారంగా చేసుకుని తీసిన సాంఘిక చిత్రమిది. భారతంలో కుంతీ దేవి కర్ణుడికి ఎలా దూరం అవుతుందో, అలానే ఈ సినిమాలో హీరోని అతని తల్లి చిన్నతనంలోనే వదిలేస్తుంది. ఇదే నేపధ్యంలో చిత్రీకరించిన 'ఆడజన్మకు ఎన్ని శోకాలో... చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో' పాట క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని పి. సుశీల అద్భుతంగా ఆలపించారు.



'అపురూపమైనదమ్మ ఆడజన్మ' - పవిత్ర బంధం 
వెంకటేశ్, సౌందర్య ప్రధాన పాత్రల్లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పవిత్ర బంధం'. పెళ్ళి విశిష్ట్తతను, దాని గొప్పతనాన్నీ సున్నితంగా హృద్యంగా చిత్రీకరించారు. ఇందులోని 'అపురూపమైనదమ్మ ఆడజన్మ' పాట పురుషుల జీవితంలో మహిళల పాత్ర గురించి గొప్పగా వివరిస్తుంది. 'కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభ' అంటూ సాగే ఈ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం రాయగా.. జేసుదాసు తనదైన శైలిలో పాడారు.



'మగువా మగువా', 'కదులు కదులు' - వకీల్ సాబ్ 
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన రీమేక్ సినిమా 'వకీల్ సాబ్'. ఇందులో ఎస్ తమన్ స్వరపరిచిన 'మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా' 'కదులు కదులు' పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్త్రీ ఔన్నత్యాన్ని వివరించే 'మగువా' పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించారు. మహిళలను చైతన్యపరిచే 'కదులు కదులు' గీతానికి సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ, హేమచంద్ర కలిసి పాడారు.




మహేశ్ బాబు నటించిన 'నాని' చిత్రంలోని 'పెదవే పలికిన మాటల్లోని' పాట.. 'బిచ్చగాడు' సినిమాలోని 'వంద దేవుల్లే' సాంగ్.. 'రఘువరన్ బీటెక్' లోని 'అమ్మా అమ్మా' గీతాలు తల్లి గొప్పదాన్ని వర్ణిస్తాయి. 'అమృత' సినిమాలోని 'ఏ దేవి వరమో నీవు'.. 'ఆకాశమంత' చిత్రంలోని 'ఆటల పాటల' పాటలు కుతుర్ల పట్ల ప్రేమను ఆవిష్కరిస్తాయి. 'మహానటి' టైటిల్ సాంగ్ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మహిళ గురించి వివరిస్తుంది. 'కలుసుకోవాలని' సినిమాలోని 'ఆకాశం' గీతం తనకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవించాలని కోరుకునే ఒక అమ్మాయి భావాలను తెలియజేస్తుంది.



Also Read: లేచింది మహిళా లోకం - పవర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమాలివే!