International Women's Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళల విజయాలను జరుపుకోవడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఎలాంటి వివక్ష చూపకుండా పురుషులతో సమానంగా మహిళలకు కూడా గౌరవం, గుర్తింపును ఇవ్వాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలో మహిళల పట్ల ఉన్న వివక్షను బద్దలు కొట్టడమే ఈ ప్రత్యేక దినోత్సవం ప్రధాన లక్ష్యం. తల్లిగా.. చెల్లిగా.. భార్యగా మగవాడి జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన అలాంటి స్త్రీ మూర్తులకు నీరాజనం పడుతూ, టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చాలానే వచ్చాయి. నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇటీవల కాలంలో పవర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ ప్లే చేసిన హీరోయిన్లు, మహిళా ప్రాధాన్యమున్న సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం!


అనుష్క శెట్టి - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి:


దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. 'అరుంధతి' 'పంచాక్షరి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలతోనూ స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకుంది. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనాలనుకునే యువతికి, ఒక స్టాండప్ కమెడియన్ కు మధ్య జరిగే కథ ఇది. ఇందులో స్వీటీ ఒక చెఫ్ గా, ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోవాలని అనుకునే ఫెమినిస్ట్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ క్రమంలో తనకంటే వయసులో చిన్నవాడైన నవీన్ పోలిశెట్టికి జోడీగా కనిపించడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో అనూష్క మరో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి రెడీ అయినట్లు టాక్.


నయనతార - జవాన్ & అన్నపూర్ణి:


లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటి వరకూ ఎన్నో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. మయూరి, అనామిక, కో కో కోకిల, ఐరా, డోరా, కనెక్ట్, O2, నేత్రికన్ లాంటి చిత్రాలలో అలరించింది. లాస్ట్ ఇయర్ 'జవాన్' మూవీలో పవర్ ఫుల్ ఫోర్స్ వన్ ఆఫీసర్ గా నటించింది. షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోని ఢీకొట్టే పాత్రలో మెప్పించింది. ఓవైపు ఒక బిడ్డకు తల్లిగా, మరోవైపు క్రిమినల్స్ పట్టుకొనే నిజాయితీ గల ఆఫీసర్ గా ఆకట్టుకుంది. అలానే నయన్ 'అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్' ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చెఫ్ కావాలని ఆకాంక్షించే అన్నపూర్ణి తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనేదే ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఈ సినిమాని ఓటీటీ నుంచి తీసేశారు. ఇక నయన్ ప్రధాన పాత్రలో ఇప్పుడు 'మన్నంగట్టి సిన్స్ 1960' అనే చిత్రం తెరకెక్కుతోంది.


రష్మిక మందన్న - యానిమల్:


నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ కు జోడీగా అలరించింది. గీతాంజలి సింగ్ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ పండించింది. ప్రస్తుతం ఆమె డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యానర్ లో 'రెయిన్ బో' అనే హీరోయిన్ సెంట్రిక్ రొమాంటిక్ ఫాంట‌సీ మూవీలో న‌టిస్తుంది. దీంతో పాటుగా గీతా ఆర్ట్స్ లో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. అలానే 'పుష్ప: ది రూల్' వంటి పాన్ ఇండియా మూవీలో భాగం అవుతోంది. 


ఐశ్వర్య రాజేశ్ - స్వప్న సుందరి, ఫర్జానా:


నేచురల్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కెరీర్ ప్రారంభం నుంచీ అనేక మహిళా ప్రాధాన్యత చిత్రాలలో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి, కాపే రణసింగం, భూమిక, డ్రైవర్ జమున వంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. గతేడాది 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్', 'రన్ బేబీ రన్', 'సొప్పన సుందరి' (స్వప్న సుందరి), 'ఫర్హానా' వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో అలరించింది. ప్రస్తుతం కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ, అజయంతే రందం మోషణం, హర్ వంటి చిత్రాల్లో ఐశ్వర్య  నటిస్తోంది.


రుహనీ శర్మ 'హర్ - చాప్టర్ 1' అనే ఉమెన్ సెంట్రిక్ మూవీలో పోలీసాఫీసర్ గా నటించగా.. లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. 'ఫర్జి' సిరీస్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిణిగా, నకిలీ కరెన్సీ పరిశోధన టీమ్ మెంబర్ గా రాశీ ఖన్నా నటించింది. ఇలా మరికొందరు హీరోయిన్లు సినిమాలు, వెబ్ సిరీస్ లలో ప్రధాన మహిళ పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు.


Also Read: టబు పెళ్లి చేసుకోలేనని చెప్పింది - మా ఇంట్లోనే ఉంటుంది: నాగార్జున కామెంట్స్ వైరల్