Actor Arun Vijay Files Police Complaint Against YouTube Channel: గత కొంత కాలంగా సోషల్ మీడియా ప్రభావం మరింత పెరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నా, డిజిటల్ మీడియాను కట్టడి చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించి కొన్ని ఛానెళ్లు అడ్డగోలుగా వార్తలు పబ్లిష్ చేస్తున్నాయి. వ్యూస్ కోసం వెకిలి రాతలు రాస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తమిళ నటుడు అరుణ్ విజయ్ కుటుంబం గురించి పలు అసభ్య వార్తలను ప్రసారం చేసింది. ఈ కథనాలపై అరుణ్ సీరియస్ అయ్యారు. సదరు ఛానెల్ నిర్వాహకులపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన గురించి, తన కుటుంబం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అవాస్తవాలతో తన పరువుకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అసలు ఏం జరిగిందంటే?
అరుణ్ విజయ్.. సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమారుడు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రముఖ తమిళ దినపత్రిక విజయ్ కుమార్ రెండవ భార్య, నటి మంజులతో సహా కొంతమంది నటీమణులపై అత్యంత అసభ్యకరమైన వార్తలను ప్రచురించింది. వీటిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. విజయ్ కుమార్ 1969లో ముత్తుకన్నను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కవితా విజయకుమార్, అనితా విజయకుమార్, అరుణ్ విజయ్. తరువాత, విజయ్ కుమార్ 1976లో నటి మంజులతో రెండవ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. వనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్, శ్రీదేవి. మంజుల 2013లో జాండిస్‌తో మరణించింది. ఆమె మరణానంతరం, సదరు దిన పత్రిక అసభ్యరీతిలో వార్తలను ప్రసారం చేసింది. ఇప్పుడే అవే కథనాలను ఓ యూట్యూబ్ ఛానెల్ పబ్లిష్ చేసింది. విజయ్ కుమార్ తో పాటు దివంగత మంజులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది.
పోలీసులను ఆశ్రయించిన అరుణ్ విజయ్
ఈ వార్త కథనాలు ప్రసారం చేసిన సదరు యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని అరుణ్ విజయ్ పోలీసులను కోరారు. దివంగత నటీమణి మంజులతో పాటు, తన తల్లిపైనా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరింత మందిపై బురదజల్లే ప్రయత్నం చేస్తారని అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరుణ్ విజయ్ చివరి సారిగా L విజయ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మిషన్: చాప్టర్ 1’లో కనిపించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ తో పాటు అమీ జాక్సన్, నిమిషా సజయన్, అబి హాసన్, భరత్ బోపన, ఇయల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది.