Hanu Man: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ ఈ సూపర్ హీరో సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరోయిన్ గా అమృత అయ్యర్.. కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని అలరించారు. సూపర్ విలన్ గా నటించిన వినయ్‌ రాయ్‌ మెప్పించారు. అయితే బిగ్ స్క్రీన్ మీద భయపెట్టిన ఈ మాస్క్ మ్యాన్ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లోనూ సందడి చేస్తున్నారు.


'వాన' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వినయ్ రాయ్.. ‘హనుమాన్‌’ సినిమాలో మైఖేల్‌ అనే క్రూరమైన సూపర్ విలన్ పాత్రలో నటించారు. బ్యాట్ మ్యాన్ కు జోకర్ లా, సూపర్ మ్యాన్ కోసం లెక్స్ లూథర్ లాగా.. ఇక్కడ హను మ్యాన్ కు సూపర్ విలన్ మైఖేల్ గా ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ మూవీస్ లో విలన్స్ మాదిరిగానే కస్టమ్ మేడ్ సూట్ ధరించి, గ్యాస్ మాస్క్ - పైరేట్ ఐ ప్యాచ్ పెట్టుకొని సరికొత్త లుక్ లో కనిపించారు. అయితే ఇప్పుడు బయట కూడా అదే గెటప్ తో తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు వినయ్.


"హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్" అంటూ వినయ్ రాయ్ ఒక హోటల్ లో సందడి చేసిన వీడియోని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. ఇందులో వినయ్ అచ్చం సినిమాలో మాదిరిగా ఫేస్ కి మాస్క్‌ కలిగిన బ్లాక్‌ డ్రెస్‌ ధరించి, హోటల్ సిబ్బందిని షాక్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Also Read: హీరో రామ్ పోతినేనితో శర్వానంద్ కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?






హను-మాన్ కథేంటంటే.. సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)కు చిన్నప్పటినుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక ఉంటుంది. అందుకు అడ్డు వచ్చిన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే చంపేస్తాడు. సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమవడంతో, అసలు సిసలు సూపర్‌ పవర్స్‌ కనిపెట్టేందుకు వేట మొదలుపెడతాడు. మైఖేల్ అంజనాద్రి లోకానికి ఎలా వచ్చాడు? అతీత శక్తులు కలిగిన హనుమంతును ఎలా ఢీకొట్టాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా మహా శివరాత్రి స్పెషల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.


తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన హను-మాన్.. బాక్సాఫీసు దగ్గర 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా వున్నారు. ఇటీవల హనుమాన్‌ 50 డేస్‌ ఈవెంట్ లో సీక్వెల్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఇందులో హనుమంతుడే హీరో అని, త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తామని అన్నారు. ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌ లా రెండున్నర గంటల పాటు థ్రిల్‌ కు గురిచేసేలా ఈ సినిమా వుంటుందని, కచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా తీస్తానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.


Also Read: ఇటలీ బీచ్‌లో డార్లింగ్ ఆట పాట.. క్రేజీ అప్డేట్‌తో వచ్చిన 'కల్కి' టీమ్!