Happy Birthday Sharwanand: శర్వానంద్... కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ లో నటించి, తర్వాతి రోజుల్లో హీరోగా మారిన వర్సటైల్ యాక్టర్. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ   టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవైపు క్లాస్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తూనే, మరోవైపు కమర్షియల్ యాక్షన్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించడం ఆయనకే చెల్లింది. సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకున్న శర్వా పుట్టినరోజు నేడు(మార్చి 6). ఈ సందర్భంగా అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 


శర్వా పూర్తి పేరు శర్వానంద్ మైనేని. వసుంధరా దేవి - రత్నగిరి వర ప్రసాదరావు దంపతులకు 1984 మార్చి 6న జన్మించాడు. వీళ్లది బిజినెస్ ఫ్యామిలీ. శర్వా తాతయ్య దివంగత నందమూరి తారకరామారావు దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో రామ్ చరణ్, రానా దగ్గుబాటిలతో కలిసి చదువుకున్నాడు శర్వానంద్. సికింద్రాబాద్‌లోని వెస్లీ డిగ్రీ కళాశాలలో బి.కాం పూర్తి చేశారు. 2023 జూన్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పసునూరు మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని శర్వా పెళ్లి చేసుకున్నారు. ఇక హీరో రామ్ పోతినేని అక్క మధుస్మితను శర్వా అన్న కళ్యాణ్ వివాహం చేసుకున్నాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.


శర్వానంద్ మొదట మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'థమ్స్ అప్' యాడ్ లో నటించడంతో మీడియా దృష్టికి వచ్చాడు. ఆ తర్వాత 2003లో 'ఐదో తారీఖు' అనే చిన్న సినిమాతో తెరంగేట్రం చేసారు. 'శంకర్ దాదా M.B.B.S' లో చిరంజీవితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాడు. సంక్రాంతి, లక్ష్మి చిత్రాల్లో వెంకటేష్ తమ్ముడిగా నటించారు. 'యువసేన'లో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించిన శర్వా.. 'వెన్నెల' మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. 'అమ్మ చెప్పింది' చిత్రంలో మానసిక పరివర్తన చెందని యువకుడుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 


'గమ్యం' 'అందరి బంధువయా' సినిమాలు మంచి విజయాలు అందుకోవడమే కాదు, అవార్డులు రివార్డులు సంపాదించాయి. 'ప్రస్థానం' మూవీ ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. 'నాలై నమధే' అనే సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన శర్వా.. 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రంతో బెస్ట్ తమిళ్ డెబ్యూ హీరోగా సైమా అవార్డ్ అందుకున్నాడు. ఇదే సినిమా తెలుగులోకి 'జర్నీ' పేరుతో వచ్చి మంచి వసూళ్లు రాబట్టింది. శర్వా ఆర్ట్స్ అనే బ్యానర్ లో 'కో అంటే కోటి' మూవీతో నిర్మాతగా మారాడు శర్వానంద్. ఇది ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత మరే చిత్రాన్ని నిర్మించలేదు. 


2014లో వచ్చిన 'రన్ రాజా రన్' చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించి, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది జ్యూరీ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసించబడింది. అయితే అతని కెరీర్ లో మైలురాయి 25వ చిత్రంగా వచ్చిన 'రాధ' తీవ్రంగా నిరాశ పరిచింది.


2017లో 'మహానుభావుడు' సినిమాతో మంచి కమర్షియల్ హిట్టు కొట్టిన తర్వాత, వరుస పరాజయాలు చవిచూశారు శర్వానంద్. 'ప‌డి ప‌డి లేచే మ‌న‌సు' 'ర‌ణ రంగం' 'జాను' 'శ్రీకారం' 'మహా సముద్రం' 'ఆడవాళ్లు మీకు జోహార్లు' లాంటి అర డజను చిత్రాలు ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. అలాంటి టైంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ 'ఒకే ఒక జీవితం' శర్వానంద్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. దీని తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించారు కానీ, కొన్ని తెలియని కారణాలతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆగిపోయింది. దీంతో యువ హీరోకి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. 


అయితే ఈ ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు శర్వానంద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'శర్వా 36' మూవీ చేయనున్నారు. అలానే సమజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో #Sharwa37 మూవీ లైన్ లో ఉంది. శర్వా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తున్నాయి. రానున్న  మరెన్నో సినిమాలు చేసి విజయాలు అందుకోవాలని కోరుకుంటూ 'abp దేశం' శర్వానంద్ కు బర్త్ డే విషెస్ అందజేస్తోంది. 


 Also Read: ‘శతమానం భవతి’ సీక్వెల్.. శర్వా ప్లేస్ లో ఆ క్రేజీ హీరో!