Shatamanam Bhavathi Next Page: ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో 'శతమానం భవతి' ఒకటి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి సతీష్ వేగెశ్న దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సాధించింది. ఈ సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్మాతలు దీనికి సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


సంక్రాంతి సందర్భంగా ‘శతమానం భవతి’ సీక్వెల్ గా ‘శతమానం భవతి నెక్స్ట్ పేజి’ అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 2025 సంక్రాంతికి కలుద్దాం అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ మొదటి భాగానికి పని చేసిన టీమ్‌నే కొనసాగిస్తారని, శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తారని.. సతీష్ వేగెశ్న దర్శకత్వం వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని పూర్తిగా కొత్త టీమ్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 


వంశీ పైడిపల్లి సినిమాలకు కో-రైటర్‌గా వ్యవహరించిన హరి.. ఇప్పుడు 'శతమానం భవతి నెక్స్ట్ పేజీ' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడట. గత 4-5 ఏళ్లుగా దిల్ రాజు క్యాంపులో ఉన్న హరి.. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్ మీద గత ఏడాది కాలంగా వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు ఇందులో శర్వానంద్ స్థానంలో దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా నటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ నడుస్తోంది.


దిల్ రాజు ప్రొడక్షన్ లో 'రౌడీ బాయ్స్‌' అనే యూత్ ఫుల్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి. 2022 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ & సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో 'సెల్ఫిష్' అనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన విశాల్ కాశి ఈ చిత్రానికి దర్శకుడు. గతేడాది సమ్మర్ లోనే ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేసారు. అయితే ఎందుకనో ఈ సినిమాని అనుకున్న విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. 


'సెల్ఫిష్' ను అటుంచి 'లవ్‍ మీ - ఇఫ్ యూ డేర్' అనే రొమాంటిక్ హారర్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసాడు ఆశిష్ రెడ్డి. ఇటీవలే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. ఇందులో ఆశిష్ సరసన 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ చిత్రంతో అరుణ్ భీమవరపు అనే కొత్త డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. 2024 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత ఆశిష్ నుంచి ‘శతమానం భవతి 2’ తో పాటుగా 'సెల్ఫిష్' చిత్రాలు రాబోతున్నాయని తెలుస్తోంది. 


Also Read: జరగండి జరగండి.. 'గేమ్ ఛేంజ‌ర్‌' అప్డేట్ తో చెర్రీ వచ్చేస్తున్నాడు!