ETV Win original movie Valari review in Telugu: 'గురు' ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'వళరి'. ఆమె డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో శ్రీరామ్ హీరో. ఇదొక హారర్ థ్రిల్లర్. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? భయపెడుతుందా? లేదా? దర్శకురాలు ఎం మృతిక సంతోషిణి ఎలా తీశారు? అనేది రివ్యూలో చూడండి.


కథ (Valari movie story): నవీన్ (శ్రీరామ్) నేవీలో కెప్టెన్. ఆయన భార్య పేరు దివ్య (రితికా సింగ్). ఈ దంపతులకు ఓ కుమారుడు. ఉద్యోగరీత్యా నవీన్ కుటుంబం కృష్ణపట్నం వస్తుంది. తొలుత నేవీ క్వార్టర్స్‌లో దిగినా... తర్వాత వెంకటాపురం బంగ్లాకు షిఫ్ట్ అవుతారు. పదమూడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్టు దివ్యకు తరచూ కల వస్తుంది.


దివ్య కలకు, వెంకటాపురం బంగ్లాకు సంబంధం ఏమిటి? ఆ బంగ్లాలో దిగిన తర్వాత దివ్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం ఏమిటి? ఆమె గతం మర్చిపోతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన సైక్రియాట్రిస్ట్ రుద్ర (సుబ్బరాజు), దివ్య కుటుంబానికి బంగ్లా అద్దెకు ఇచ్చిన రామచంద్ర (ఉత్తేజ్), దివ్య తల్లి బాలాంబిక (రితికా సింగ్) ఎవరు? ఓసారి చావు నుంచి తప్పించుకున్న దివ్య, మళ్లీ చావు దగ్గరకు వెళ్లిన తర్వాత ఏమైంది? ఆ బంగ్లా ఎవరిది? వంటి ప్రశ్నలకు సమాధానాలు 'వళరి' సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Valari movie Telugu review): మెజారిటీ హారర్ / థ్రిల్లర్ సినిమాలు చూస్తే స్టోరీ ఫార్ములా, స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. నేపథ్యం మారుతుంది గానీ కథ, కథనాల్లో అంతగా మార్పులు కనిపించవు. 'వళరి' అందుకు మినహాయింపు కాదు. రొటీన్ హారర్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో తీసిన చిత్రమిది. అయితే... పతాక సన్నివేశాల్లో దర్శకురాలు మృతిక సంతోషిణి సమాజంలో జరుగుతున్న ఓ సమస్యను చూపించారు.


'వళరి' ఎమోషనల్ హారర్ థ్రిల్లర్. ఇందులో హారర్, థ్రిల్స్ మూమెంట్స్ తక్కువ. బీభత్సంగా భయపెట్టిన సన్నివేశాలు లేవు. థ్రిల్లింత సోసోగా ఉంది. ఎమోషనల్ సీన్స్ తీసిన విధానం మాత్రం బావుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి కడుపు మీద ఆపరేషన్ తాలూకు జ్ఞాపకం (కుట్లు వేసిన తర్వాత ఏర్పడే మచ్చ) గురించి తీసిన సన్నివేశం అందుకు ఓ ఉదాహరణ. ఫ్లాష్‌బ్యాక్‌లో మదమెక్కిన మగాడికి కర్రసాముతో సమాధానం చెప్పిన మహిళ వీరత్వం మరో ఉదాహరణ. లేడీ డైరెక్టర్ కావడంతో ఆ సన్నివేశాలను మరింత సెన్సిబుల్‌గా, అర్థవంతంగా తీశారు.


'వళరి'లో కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. బావున్నాయి. అయితే... కథగా, ఓ సినిమాగా చూసినప్పుడు కొత్త అనుభూతి అయితే ఇవ్వలేదు. 'వళరి' టైటిల్‌లో ఉన్న ప్రత్యేకత కథలో లేదు. సినిమాలో కూడా! 'వళరి' అనేది పురాతన ఆయుధం. చేత్తో విసిరితే పని ముగించుకుని మళ్లీ మన దగ్గరకు తిరిగొస్తుంది. కర్మ మనిషిని ఆ విధంగా వెంటాడుతుందని చెప్పడం దర్శకురాలి ఉద్దేశం. అది స్క్రీన్ మీద సరిగా ఆవిష్కరించలేదు. క్లైమాక్స్ వచ్చేసరికి రొటీన్ రివేంజ్ డ్రామాలా మారింది.


సినిమా ప్రారంభంలో తల్లిదండ్రులను 13 ఏళ్ల అమ్మాయి చంపినట్లు, దివ్య కలలో అదంతా వస్తున్నట్లు చూపించారు. ఆ పాయింట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసినా... తర్వాత సన్నివేశాలు సాధారణంగా ఉన్నాయి. సినిమా ముందుకు వెళ్ళే కొలదీ ఆసక్తి తగ్గింది. ఇందులో సర్‌ప్రైజ్ చేసే ట్విస్టులు, వావ్ అనిపించే మూమెంట్స్ లేవు. కెమెరా వర్క్, మ్యూజిక్, ఎడిటింగ్ హారర్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. మృతిక సంతోషిణి టెక్నికల్ టీమ్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. 'నీ కళ్ళు మాత్రమే ఈ లోకంలో ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం పోస్తాయి', 'నిజం అంటే వినేది కాదు చూసేది' - సన్నివేశాలకు తగ్గట్టు ఉమర్జీ అనురాధ చక్కటి మాటలు రాశారు.


రితికా సింగ్ (Ritika Singh)కు నటనలో వేరియేషన్స్ చూపించే అవకాశం 'వళరి'లో దక్కింది. బాలాంబిక పాత్రలో కర్రసాము చేశారు. చీర కట్టులో కొత్తగా కనిపించారు. ఈతరం అమ్మాయి దివ్య పాత్ర రితికాకు కొత్త కాదు. డ్రస్సింగ్ నుంచి యాక్టింగ్ వరకు కొత్తగా చేసింది కూడా లేదు. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఈ సినిమా హీరో శ్రీరామ్ విషయానికి వస్తే... నవీన్ పాత్రకు పర్ఫెక్ట్. సన్నివేశాన్ని బట్టి అవసరమైన చోట ఇంటెన్స్ చూపించారు. రుద్రగా సుబ్బరాజు నటన బావుంది. సింపుల్ & పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఉత్తేజ్ పాత్రకు చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. అది ఏమిటనేది స్క్రీన్ మీద చూడాలి.


Also Read: వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?


'వళరి' పూర్తిగా హారర్ సినిమా కాదు. అలాగని, థ్రిల్లర్ కూడా కాదు. క్లైమాక్స్ చూశాక మెసేజ్ ఓరియెంటెడ్ రొటీన్ రివేంజ్ హారర్ డ్రామా అనిపిస్తుంది. సినిమా చివర్లో ఇచ్చిన సందేశం బావుంది. కానీ, స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తిగా సినిమా తీయలేదు. మంచి ఐడియాను రెండు గంటల పాటు సాగదీశారు.


Also Read: డ్యూన్ 2 రివ్యూ: మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ సీక్వెల్ ఎలా ఉంది?