Dune Part 2 Review in Telugu
సినిమా రివ్యూ: డ్యూన్ పార్ట్ 2
రేటింగ్: 3/5
నటీనటులు: తిమోతి షాలామే, జెండాయా, రెబెక్కా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్ తదితరులు 
ఛాయాగ్రహణం: గ్రెగ్ ఫ్రేజర్
కథ: ఫ్రాంక్ హెర్బెర్ట్ రాసిన డ్యూన్ పుస్తకం ఆధారంగా
స్క్రీన్‌ప్లే: డెనీ విల్నెవ్, జాన్ స్పాయిట్స్
సంగీతం: హాన్స్ జిమ్మర్
నిర్మాణ సంస్థలు: లెజండరీ పిక్చర్స్, విల్నేవ్ పిక్చర్స్
దర్శకత్వం: డెనీ విల్నెవ్
విడుదల తేదీ: మార్చి 1, 2024


2021లో విడుదల అయిన ‘డ్యూన్ పార్ట్ 1’ హాలీవుడ్‌లో భారీ విజయం సాధించింది. కోవిడ్ కాలంలో కూడా 400 మిలియన్లకు పైగా డాలర్లు వసూలు చేసింది. ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను కూడా సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా?


కథ: ఫస్ట్ పార్ట్‌లో తండ్రిని కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి తల్లి లేడీ జెస్సికాతో (రెబెక్కా ఫెర్గూసన్) పారిపోతాడు పాల్ అట్రీడియస్ (తిమోతి షాలామే). అలా పారిపోతూ అరాకిస్ గ్రహంలో విప్లవ కారులైన ఫ్రెమెన్ తెగ ప్రజలతో చేరతాడు. వీరందరూ తమ గ్రహాన్ని కాపాడే రక్షకుడు వస్తాడని ఎప్పుడో పూర్వీకుల కాలం నాటి గ్రంథాల్లో రాసిన భవిష్యవాణిని నమ్ముతారు. దీన్ని జెస్సికా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. తన కొడుకే వీరు వెతుకుతున్న రక్షకుడని నమ్మించి ఆ తెగల వారిని తన అధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది.


పాల్ అట్రీడియస్‌కు రాజు అవ్వాలన్న కోరిక ఉండదు. ఫ్రెమెన్ తెగలో ఈ భవిష్యవాణిని నమ్మని వారు కొందరు ఉంటారు. వారిలో చాని (జెండాయా)... పాల్‌తో ప్రేమలో పడుతుంది. ఫ్రెమెన్ తెగతో కలిసి అరాకిస్‌లో మాత్రమే దొరికే ఒక రకమైన డ్రగ్ అయిన స్పైస్‌ని తీసే హార్కొనెన్ తెగ వారిపై దాడులు చేసి వారిని బలహీనపరుస్తూ ఉంటాడు. మొదటి భాగంలో పాల్ తండ్రిని చంపేది ఈ తెగకు చెందిన వారే. తండ్రిని చంపిన వారిపై పాల్ పగ తీర్చుకున్నాడా? జెస్సికా ఆశించినట్లు పాల్ రక్షకుడి అవతారం ఎత్తాడా? అసలు చివరికి ఏమైంది? అన్నది తెలియాలంటే ‘డ్యూన్ పార్ట్ 2’ చూడాల్సిందే.


విశ్లేషణ: పీక్ హీరోయిజంతో కూడిన సినిమాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. కిందటి తరం స్టార్ల నుంచి నేటి సూపర్ స్టార్ల వరకు టాప్ హీరోలందరికీ పీక్ హీరోయిజం సినిమాల ద్వారానే స్టార్‌డమ్ దక్కింది. కానీ హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు చాలా అరుదు. అందులోనూ డ్యూన్ లాంటి ఫ్యూచరిస్టిక్ సినిమా నుంచి హీరోయిజం, ఎలివేషన్స్‌ను కథ నుంచి పక్కకు వెళ్లకుండా డెలివర్ చేయడం సామాన్య విషయం కాదు. ఇందులో డెనీ విల్నెవ్ 100 శాతం సక్సెస్ అయ్యారు.


సినిమా చాలా సాధారణంగా మొదలవుతుంది. పాల్, జెస్సికా ఫ్రెమెన్ తెగలో ఇమిడిపోవడానికి ప్రయత్నించడం, ఆ తెగ వారి నమ్మకాన్ని జెస్సికా తనకు అనుకూలంగా మార్చుకోవడం, మరోవైపు పాల్, చానిల ప్రేమ కథ... ఇలా చాలా క్యాజువల్‌గా వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాల్ క్యారెక్టర్‌లో ఛేంజ్ కనిపిస్తుందో అక్కడి నుంచి సినిమా వేరే లెవల్‌కు వెళ్లిపోతుంది. ఇండియన్ సినిమాలో ఉండే పీక్ హీరోయిజం సీన్లకు తీసిపోని సన్నివేశాలు ఇందులో ఉంటాయి. అలాగే క్లైమ్యాక్స్‌ను కూడా మూడో పార్ట్‌కు కనెక్ట్ చేస్తూ ఇంట్రస్టింగ్‌గా ఎండ్ చేశారు.


మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ ప్రాణం పెట్టి పని చేశారు. హాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఇంకో లెవల్‌కు తీసుకెళ్లింది. స్క్రీన్‌పై హీరోయిజం, ఎలివేషన్ సీన్లు పండాలంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విషయంలో హాన్స్ జిమ్మర్‌కు 200 శాతం క్రెడిట్స్ ఇవ్వచ్చు. గ్రెగ్ ఫ్రేజర్ సినిమాటోగ్రఫీ కూడా అల్టిమేట్. సినిమాకు ఫ్యూచరిస్టిక్ లుక్ వచ్చిందంటే దానికి రీజన్ గ్రెగ్ ఫ్రేజ్ సినిమాటోగ్రఫీనే.


ఇక నటీనటుల విషయానికి వస్తే... ఈ సినిమాకు మొదటి మూడు స్తంభాలు డైరెక్టర్ డెని విల్నెవ్, మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్, సినిమాటోగ్రాఫర్ గ్రెగ్ ఫ్రేజర్ అయితే నాలుగో స్తంభం పాల్ అట్రీడియస్ పాత్ర పోషించిన తిమోతి షాలామే. నిజానికి తిమోతి షాలామేకి హాలీవుడ్‌లో మిగతా యాక్షన్ హీరోలకు ఉన్నంత కటౌట్ లేదు. ఫిజిక్ పరంగా కూడా చాలా సన్నగా ఉంటాడు. కానీ హీరోయిజం సీన్లు బాగా పండాయంటే దానికి కారణం తన పెర్ఫార్మెన్సే. రక్షకుడిగా మారక ముందు, మారిన తర్వాత తన పెర్ఫార్మెన్స్‌లో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు వేరియేషన్లను కూడా చక్కగా చూపించాడు.


తిమోతి తర్వాత అంత కీలక పాత్ర జెండాయాది. చాని పాత్రకు జెండాయా న్యాయం చేశారు. సినిమా క్లైమ్యాక్స్‌లో తన నటన ఆకట్టుకుంటుంది. మిగతా వారంతా తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. ఫ్రేమెన్ తెగ నాయకుడి పాత్రలో కనిపించిన జేవియర్ బర్డెమ్ అక్కడక్కడ నవ్విస్తారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు హాలీవుడ్ సినిమాల లవర్ అయితే ‘డ్యూన్ పార్ట్ 2’ కచ్చితంగా చూడాల్సిన సినిమా. భారతీయ సినిమాల్లోని హీరోయిజం, ఎలివేషన్లు నచ్చే వారికి కూడా ఇది నచ్చుతుంది. కాబట్టి ఈ వీకెండ్‌లో ఏదో ఒక మూవీ చూడాలనుకునే వారు హ్యాపీగా ‘డ్యూన్ పార్ట్ 2’ చూసేయచ్చు.