Gaami 3 Days Collections: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ డ్రామా ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందినీ చౌదరి కథానాయకిగా నటించింది. ఆరేళ్లుగా నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


‘గామి’ సినిమా మొదటి రోజు రూ.9.07 కోట్లు, రెండో రోజు రూ.6.03 కోట్ల వసూళ్లతో రెండు రోజుల్లో రూ.15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మూడో రోజూ అదే రోజు చూపించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా మూడు రోజుల్లో రూ. 20.3 కోట్ల కలెక్షన్లతో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకొని, అన్ని ఏరియాలలో లాభాల బాట పట్టినట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 






మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్...
నిజానికి లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాలను ప్రేక్షకులను ఎంత మేరకు ఆద‌రిస్తారో, క‌మ‌ర్షియ‌ల్‌ ఆడుతుందో లేదో అనే సందేహాలు 'గామి' విడుదలకు ముందు వ్య‌క్త‌మయ్యాయి. అందులోనూ ఆరేళ్ళుగా నిర్మాణంలో ఉన్న క్రౌడ్ ఫండింగ్ సినిమా కాబట్టి, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ విశ్వక్ సేన్ సినిమా అంచ‌నాల‌కు మించి కలెక్షన్స్ రాబ‌డుతోంది. పరిమిత బడ్జెట్ లో తీసిన సినిమా మొదటి వారాంతంలో 20 కోట్లకు పైగా వసూలు చేయడం.. 'భీమా', 'ప్రేమలు' లాంటి చిత్రాలు పోటీగా ఉన్నా మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవడం గొప్ప విషయమనే చెప్పాలి.


తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ 'గామి' సినిమా స్ట్రాంగ్ గా పెరఫార్మ్ చేస్తోంది. నార్త్ అమెరికాలో శ‌నివారం షోలు పూర్త‌య్యే సమయానికి 4 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్కును అందుకుంది. ఆదివారం వసూళ్లతో హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏ జనాల అభిరుచికి తగ్గట్టు డిఫరెంట్ మూవీ కావ‌డం, విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో అక్కడ మంచి ఆదరణ దక్కుతోంది. ప్రిమియ‌ర్స్ నుంచే మంచి స్పంద‌న తెచ్చుకొని మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


'గామి' చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. తక్కువ బడ్జెట్‍లోనే హైక్వాలిటీ అవుట్ ఫుట్ తీసుకురావడంతో డైరెక్టర్ విద్యాధర్ ప్రశంసలు అందుకుంటున్నారు. కథను ఆరంభించిన తీరు, దాన్ని మూడు కథలుగా సమాంతరంగా నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో నటీనటుల పెర్ఫార్మన్స్ తో పాటుగా ఈ సినిమాలో విజువల్స్, వీఎఫ్‍ఎక్స్, టేకింగ్ మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నరేశ్ కుమారన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అయ్యాయి.