ప్రముఖ హాలీవుడ్ నటుడు, WWW రెజ్లర్ జాన్ సీనా గురించి హాలీవుడ్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు యాక్షన్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ సీనా.. ఆస్కార్ అవార్డుల వేడుకలో అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆస్కార్ వేదికపైకి వచ్చి ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. ‘బెస్ట్ కాస్ట్యూమ్స్’ విజేతను కూడా ప్రకటించాడు. అదేంటీ, ఒంటి మీద దుస్తులు లేకుండా ‘బెస్ట్ కాష్ట్యూమ్స్’ అవార్డు ప్రకటించడం ఏమిటీ? మరీ ఫన్నీ కాకపోతే అనుకుంటున్నారా? అయితే, అతడు కావాలని అలా చెయ్యలేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. 


ఆస్కార్ అవార్డుల్లో ‘పూర్ థింగ్స్’ మూవీకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ లభించింది. జాన్ సీనాకు ఈ అవార్డును ప్రకటించే అవకాశం లభించింది. దీంతో సీనా.. కేవలం కవర్‌ను మాత్రమే అడ్డంగా పెట్టుకుని స్టేజ్ మీదకు నగ్నంగా వచ్చాడు. అతడిని అలా చూడగానే అంతా నవ్వేశారు. అయితే, కొందరు మాత్రం అంతర్జాతీయ వేదికపై ఇలాంటి పనులేంటి అని చెవులు కొరుకున్నారు. అయితే జాన్ సీనా అలా చేయడానికి కారణం.. 1974లో జరిగిన ఓ ఘటన. 


సరిగ్గా 50 ఏళ్ల కిందట జరిగిన ఆస్కార్ వేడుకల్లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఎలిజబెత్ టేలర్‌ను వేదికపైకి పిలిచిన సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా స్టేజ్ మీదకు వచ్చి హల్‌చల్ చేశాడు. ఆస్కార్ అవార్డుల చరిత్రలో అదొక సంచలనంగా నిలిచిపోయింది. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ జాన్ సీనా ఇలా చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇలా నగ్నంగా వచ్చిన జాన్ సీనా ఓ సందేశం కూడా ఇచ్చాడు. ‘‘మగాడి శరీరం జోక్ కాదు. కాస్ట్యూ్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా’’ అంటూ అందరినీ నవ్వించాడు.


అయితే, జాన్ ప్రకటించాల్సిన అవార్డు గ్రహీత పేరు.. అతడు తన రహస్యాంగాలకు అడ్డుగా పెట్టుకున్న కవర్‌లోనే ఉంది. దాన్ని ఎలా బయటకు తీసి చదవాలో అర్థంకాక ఇబ్బంది పడుతోన్న జాన్ సీనాకు యాంకర్ జిమ్మీ కెమెల్ సాయం చేశాడు. కవర్‌లో ఉన్న ఆస్కార్ విజేత పేరు చదివి జాన్ సీనాను సేవ్ చేశాడు. లేకపోతే జాన్ సీనా.. మరోరకంగా వైరల్ అయ్యేవాడు. ‘బార్బీ’ సినిమాలో జాన్ సీనా కేమియో రోల్ చేశాడు. ఆ సినిమా 8 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. దీంతో సీనాకు ఈ ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందింది.






Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్స్ స్వీట్ సర్‌ప్రైజ్ - పాటే కాదు, స్టేజిపై ఎన్టీఆర్, చరణ్ స్టంట్స్‌ కూడా!


96వ ఆస్కార్స్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సిటీలో జరిగాయి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' ఈ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటింది. మెజారిటీ విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుని ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఏకంగా ఏడు అవార్డులను ఈ మూవీ సొంతం చేసుకుంది. క్రిస్టోఫర్ నోలన్‌కు ఇదే తొలి ఆస్కార్ అవార్డు కావడం గమనార్హం. 


Also Read: క్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే