"నాకూ ఒక కుటుంబం ఉంది. అమ్మ, నాన్న, అక్క ఉన్నారు. 'వీడు ఏమైనా చేసుకుంటాడా?' అని నా ఫ్యామిలీ కూడా బాధ పడుతుందని ఆలోచన లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. నేను సమాధానం చెప్పుకోవలసింది ఒక్కరికే... మా అమ్మకు! 'అమ్మా! నీ కొడుక్కి ఏమీ కాదు. ఎవడు ఏమి పీకలేడు! రాసి పెట్టుకో'' అని యువ హీరో విశ్వక్ సేన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అందులో విశ్వక్ సేన్ నేషనల్ కామెంట్స్ చేశారు.


ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో, ఆ తరువాత కార్యక్రమంలో జరిగిన ఘటన చుట్టూ చోటు చేసుకున్న పరిణామాలపై ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ స్పందించారు. తాను చాలా చూశానని, తనకు ఇదేమీ కొత్త కాదని ఆయన అన్నారు. ''నేను అమ్మాయిలకు గౌరవం ఇవ్వనని అంటున్నారు. నేను ఆ అమ్మాయికి గౌరవం ఇవ్వకపోతే... నోరు మూసుకుని వెళ్లిపోయే వాడిని కాదు. అమ్మా... నువ్వు నీ కొడుక్కి నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు. అందరూ చూశారు. వాళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. నేను ఒక్కటి చెబుతున్నా... నాకు బ్యాక్ గ్రౌండ్ లేదనే మాట నిజమే. ఒక్కడినే ఎక్కడి నుంచో వచ్చాను. ఇండియా అనే ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న ఈగ లాంటివాడిని. నలుగురు కలిసి కొడితే పడిపోతానేమో! కానీ, నలుగురు కలిసి కొట్టడానికి నా చుట్టూ ఒక పెద్ద కవచం ఉంది. ఆ కవచమే ప్రేక్షకులు. సోషల్ మీడియాలో నాకు లభిస్తున్న మద్దతు చూసి... నేను సంపాదించిన ఆస్తి ఇది అనుకున్నాను. నన్ను ఎవరు ఏమి పీకలేని ఆస్తి. ఎవరు లాక్కోలేని ఆస్తి. 'ఏం చూసుకుని నీకు అంత పొగరు?' అంటే... నాకు ఉన్నారు. సందేహాలుంటే #VishwakSen అని సోషల్ మీడియాలో సెర్చ్‌ చేయండి'' అని విశ్వక్ సేన్ మాట్లాడారు. 


విశ్వక్ సేన్ తీరుపై సదరు టీవీ ఛానల్ యాంకర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విశ్వక్ మీద కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ స్పందించి ఉండవచ్చనేది కొందరి అభిప్రాయం.


Also Read: విశ్వక్ సేన్ ‘F’ వర్డ్, మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్, చర్యలు తప్పవా?


''నాకు తెలిసి ఎదుగుదల అంటే... ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సవాల్ ఎదురైనప్పుడు వెళ్లి ఇంట్లో కూర్చోవడం కాదు. సమస్య ఎక్కడ ఉన్నా... ఇలా ఖమ్మం వచ్చి ప్రేక్షకుల ముందు నిలబడి, చిరునవ్వుతో మాట్లాడటం. నేను ఎప్పుడు నాకు ఏదో జరిగిందని, నన్ను ఎవరో ఏదో అన్నారని, నా వైపు వేలు చూపించారని బాధ పడలేదు'' అని యువ హీరో విశ్వక్ సేన్ అన్నారు.


Vishwak Sen Speech At Ashoka Vanamlo Arjuna Kalyanam Pre Release Event: కథానాయకుడిగా తన ప్రయాణం ప్రారంభం కాక ముందు నుంచి మద్దతు ఇచ్చిన తల్లిని విశ్వక్ సేన్ గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఐలవ్యూ చెప్పారు. ''ఎవరి కుటుంబంలో అయినా ఒక అబ్బాయి వచ్చి సినిమా హీరో అవుతారని అంటే అందరూ షాక్ అవుతారు. కానీ మా అమ్మ మొదటి నుంచి నన్ను నమ్మింది. నాపై నమ్మకం పెట్టింది. అలాగే, నాన్నగారు కూడా! మా అమ్మ ఒక హిట్ సినిమా చూస్తే నాకు ఫోన్ చేసి... ‌‌'నీ సినిమా ఎప్పుడు?' అని అడిగేది. అప్పటికీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. నన్ను ఎంతగానో నమ్మిన అమ్మకు ఐ లవ్ యు'' అని విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యారు.



Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్



అంతే కాదు... కథానాయకుడు కావడం కోసం ఎంత కష్టపడినదీ, తొలి సినిమా సమయంలో ఏం జరిగినదీ విశ్వక్ సేన్ గుర్తు చేసుకున్నారు. ''ఎంతో కష్టపడి ఫిలిమ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుని, డాన్సులు నేర్చుకుని, యాక్టింగ్ నేర్చుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి... ఒక సినిమా చేద్దామని 12 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 'వెళ్ళిపోమాకే' అనే సినిమా తీశాం. దేనికి తీశామో తెలియదు. దానిని ఒక నిర్మాత థియేటర్లలో విడుదల చేశారు. అదే మాకు పెద్ద విజయం. ఆ తరువాత తరుణ్ భాస్కర్ నన్ను హీరోగా పెట్టి సినిమా (ఈ నగరానికి ఏమైంది) తీశాడు. అందువల్ల నేను ఎప్పుడూ తరుణ్ భాస్కర్ కు థాంక్స్ చెబుతూనే ఉంటా. ఎందుకంటే అంటే నాకు ఏమాత్రం వ్యాల్యూ లేనప్పుడు నన్ను పెట్టి సినిమా తీశారు. ఆ తర్వాత నేను 'ఫలక్ నుమా దాస్' సినిమా చేశా. దానికి ప్రేక్షకులు అందరి నుంచి వచ్చిన స్పందన మరువలేను. నిజంగా, ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చితే... గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉంటావ కూడా ఇటువంటి ఒక స్థానం ఇస్తారని నిరూపించిన సినిమా 'ఫలక్ నుమా దాస్'. నా ‌ప్రయాణంలో కష్టాలు ఉన్నాయ''ని ఆయన అన్నారు.


Also Read: చిరంజీవి - సల్మాన్ పాటలో గ్రేస్ మామూలుగా ఉండదు! కొరియోగ్రఫీ ఎవరంటే?