‘హిందీ’ వివాదంలో చిక్కుకున్న సుహాసిని, ‘మీకంటే సోనూ నిగమ్ బెటర్’ అంటున్న దక్షిణాది జనం!
కన్నడ హీరో కిచ్చా సుదీప్‌తో మొదలైన ‘హిందీ’ వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తీవ్రంగా భావిస్తూ సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగడం.. దక్షిణాది ప్రజలకు నచ్చలేదు. దీంతో ఆయన్ని దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ట్రోలర్స్ సీనియర్ నటి సుహాసినీని వెంటపడ్డారు. ఇందుకు కారణం, ఆమె హిందీపై చేసిన తాజా వ్యాఖ్యలే. 


సుహాసిని ఓ షోలో హిందీ భాష గురించి మాట్లాడుతూ.. “హిందీ మంచి భాష. మీరు దానిని నేర్చుకోవాలి. హిందీ మాట్లాడేవారు మంచివారు. తమిళులు కూడా మంచివారే. మీకు ఎన్ని భాషలు తెలిస్తే, మీరు అంత సంతోషంగా ఉంటారు. మాకు ఆ భాషే కావాలంటే.. తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలి’’ అని అన్నారు. అయితే, తమ భాషను ఎంతో గౌరవించే తమిళ ప్రజలకు సుహాసిని వ్యాఖ్యలు అస్సలు నచ్చలేదు. హిందీపై అంత అభిమానం ఉంటే.. వెళ్లి బాలీవుడ్‌లో సినిమాలు చేసుకోండని మండిపడుతున్నారు. మీకంటే హిందీ గాయకుడు చాలా బెటర్ అని అంటున్నారు.





తాజాగా సోను నిగమ్ కూడా హిందీ జాతీయ భాష? కాదా అనే విషయంపై స్పందించారు. ‘‘మన దేశంలో ఎన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయినా, హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది? ఎక్కువ మంది మాట్లాడే భాష. తమిళం దేశంలోనే అత్యంత ప్రాచీన భాష. ఈ దేశంలో ఒకే భాష ఉందని, అంతా దాన్నే మాట్లాడాలంటూ భాషను రుద్దడం తగదు. ఏ భాష మాట్లాడాలో ఎంచుకునే హక్కు ప్రజలకు ఉంది. భాషల పేరుతో ప్రజలను విడదీయొద్దు’’ అని అన్నారు. దీంతో సోను నిగమ్ కరెక్టుగా చెప్పారని, ఇప్పటికైనా తమ భాషే దేశమంతా మాట్లాడాలని భావిస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు. మరి, ఈ వివాదానికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 


Also Read: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ గొడవపై ఆర్జీవీ ట్వీట్, ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటీ?


Also Read: హైదరాబాద్‌లో షూటింగ్స్ వద్దు, హీరో అజీత్‌పై రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు