Vishal About Politics: కోలీవుడ్ యాక్టర్ విశాల్... రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంటర్ అవ్వకపోయినా తనకు రాజకీయాలపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో పలుమార్లు పరోక్షంగా బయటపెట్టారు. అయితే త్వరలోనే విశాల్... పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని కూడా పలుమార్లు సినీ సర్కిల్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ఈ హీరో మాత్రం బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ‘రత్నం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవ్వగా మేకర్స్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో రాజకీయాలపై విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడును స్ఫూర్తిగా తీసుకోవాలి..
ముందుగా దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలి అంటూ సూచించాడు విశాల్. ఇక తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికలను గుర్తుచేసుకుంటూ తన ఓటును తాను వినియోగించుకున్నానని చెప్పాడు. ఇటీవల ముగిసిన తమిళనాడు ఎలక్షన్స్‌లో 70 శాతం ఓటింగ్ నమోదయ్యిందని, ఇంకొక 20 శాతం కూడా నమోదు అయ్యింటే సంచలనం అయ్యేదని సంతోషం వ్యక్తం చేశాడు. తమిళనాడును స్ఫూర్తిగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాలని సలహా ఇచ్చాడు. ఇక సినిమాలను రాజకీయాలతో పోలుస్తూ... ఈ శుక్రవారం కాకపోతే మరో శుక్రవారం సినిమా చూడొచ్చని, ఓటు మాత్రం ఒక రోజు మాత్రమే వేయగలం అని అన్నాడు.
ఇంకో నాయకుడు పుట్టడు..
ఓటు హక్కు గురించి, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని సూచించారు. నమ్మిన వాళ్లకు ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఓటు వేయించుకున్న వారి బాధ్యతను నిర్వర్తించాలని గుర్తుచేశాడు. తాను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పనని, ఎవరిని కించపరిచేలా మాట్లడటం తనకు ఇష్టం ఉండదని, ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటానని తన గురించి స్పష్టం చేశాడు విశాల్. తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటానని ముక్కుసూటిగా చెప్పేశాడు. రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ , ఇంకో నాయకుడు పుట్టడని, రాజకీనాయకులు నటులుగా మాట్లాడుతుంటే నటులు రాజకీయ నాయకులవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అవన్నీ ప్రజలు అడుగుతున్నారా?
రాజకీయం అనేది సమాజ సేవ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు విశాల్. తాను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని గుర్తుచేశాడు. ఇక వారి స్వచ్చంద సంస్థ ద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం తమ ఏజెండా అని, అలాగే రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయడం ఎజెండాగా ఉండాలని చెప్పుకొచ్చాడు. ప్రజలు బెంజ్ కార్ అడుగుతారా? బంజారాహిల్స్‌లో ఇళ్లు అడుగుతున్నారా? అంటూ ప్రశ్నించాడు. తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం మాత్రమే ప్రజలు అడుగుతున్నారని అన్నాడు. తాను ఇప్పుడు ఒక ఓటర్ మాత్రమే అని, తాను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయనని, ఏ పార్టీలో కలిసిపోనని స్పష్టం చేశాడు విశాల్.
Also Read: తారకరత్న భార్య కీలక నిర్ణయం - ఏపీ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో తేల్చేసిన అలేఖ్య