Best Thriller Movies On OTT: ప్రపంచంలో చాలామందికి హైట్స్ అంటే చాలా భయం. ఓపెన్‌గా ఒప్పుకోకపోయినా.. చాలామందిలో ఈ భయం అనేది ఉంటుంది. మరికొందరికి ఈ భయం విపరీతంగా పెరిగిపోయి ఫోబియాలాగా మారుతుంది. ఇక అలాంటి వారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. అంతలా భయపెట్టే సినిమా ఏంటని అనుకుంటున్నారా? అదే ‘ఫాల్’. ఒక సినిమాలో దెయ్యాలు లేకపోయినా.. డిస్టర్బింగ్ సీన్స్ లేకపోయినా ఈ రేంజ్‌లో భయపెట్టవచ్చని ‘ఫాల్’ మూవీ చూస్తే అర్థమవుతుంది. కథ సింపుల్‌గానే ఉన్నా.. ఈ మూవీ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది.


కథ..


సినిమా మొదలవ్వగానే షిల్లో హంటర్ (వర్జీనియా గార్డెనర్), బెక్కీ (గ్రేస్ క్యారొలీన్), డ్యాన్ కానర్ (మాసన్ గూడింగ్).. అతిపెద్ద పర్వతాన్ని అధిరోహిస్తూ కనిపిస్తారు. ఈ ముగ్గురు ప్రొఫెషనల్ మౌంటెన్ క్లైంబర్స్. అప్పటికే బెక్కీ, డ్యాన్‌లకు పెళ్లి అయిపోయి ఉంటుంది. అదే సమయంలో డ్యాన్.. ఆ ఎత్తైన పర్వతంపై తన బ్యాలెన్స్ కోల్పోయి.. కింద పడి చనిపోతాడు. దీంతో తన భార్య బెక్కీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. మౌంటెన్ క్లైంబింగ్‌కు కూడా దూరంగా ఉంటుంది. డ్యాన్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని తన తండ్రి జేమ్స్ (జెఫ్రీ డీన్ మార్గన్)కు కూడా దూరంగా ఉంటుంది. ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో తన స్నేహితులరాలు హంటర్ వచ్చి.. బెక్కీ ఇలా అయిపోవడం చనిపోయిన తన భర్తకు కూడా నచ్చదని, అందుకే మళ్లీ క్లైంబింగ్ ప్రారంభించాలంటూ ఒక చోటుకి తీసుకెళ్తుంది. అక్కడ వారికోసం ఊహించని మలుపు ఎదురుచూస్తుంటుంది.


బెక్కీ క్లైంబింగ్ చేసి సంవత్సరం అయిపోతుంది. ప్రాక్టీస్ లేదని హంటర్‌తో రాను అని చెప్తుంది. అయినా హంటర్ వినకుండా 2000 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌ను ఎక్కడానికి పిలుస్తుంది. అదే బీ 67 టీవీ టవర్. ఈ టవర్ సిటీకి దూరంగా ఒక ఎడారి ప్రాంతంలో ఉంటుంది. బెక్కీకి ఇష్టం లేకపోయినా హంటర్ బలవంతం చేయడంతో ఈ టీవీ టవర్ ఎక్కడానికి ఒప్పుకుంటుంది. వారిద్దరూ ఆ టవర్ ఎక్కేవరకు సినిమా అంతా సాఫీగానే సాగుతుంది. కానీ ఇక దిగి వెళ్లిపోదాం అనుకునే సమయానికి టవర్‌కు ఉన్న నిచ్చెన ఊడి కింద పడిపోతుంది. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేయాలన్నా ఫోన్‌లో సిగ్నల్స్ ఉండవు. దీంతో వేరే దారి లేక బెక్కీ, హంటర్ ఆ టవర్‌పైనే చిక్కుకుపోతారు. చివరికి వారిద్దరికీ ఏం జరిగింది? జాగ్రత్తగా బ్రతికి బయటపడగలిగారా? అనేది తెరపై చూడాల్సిన కథ.


Also Read: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...


ఆకాశంలో సర్వైవల్ డ్రామా..


నిజంగానే ఒక 2000 అడుగుల ఎత్తుపై ఉన్న ఒక టవర్‌పై చిక్కుకుపోతే ఎలా ఉంటుందో.. ‘ఫాల్’ చూస్తున్నంతసేపు అలాగే ఉంటుంది. ఒకవేళ మనమే అంత ఎత్తైన టవర్‌పై ఉన్నామేమో అన్న ఫీలింగ్ సినిమా మొత్తంలో కచ్చితంగా ఒక్కసారైనా ఆడియన్స్‌కు వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు స్కాట్ మాన్, జోనథన్ ఫ్రాంక్. మామూలుగా సర్వైవల్ డ్రామా అంటే నీటిలోనో, గుహలోనో చిక్కుకుపోయే సినిమాలను ఎన్నో చూసుంటాం. కానీ ఆకాశంలో 2000 అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయి ప్రాణాల కోసం పోరాడితే ఎలా ఉంటుందో క్లియర్‌గా చూపిస్తుంది ‘ఫాల్’.


అదిరిపోయే ట్విస్ట్..


‘ఫాల్’లోని నటీనటుల విషయానికొస్తే.. దాదాపు గంటన్నర రెండు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కానీ వారిద్దరి నటన మాత్రమే ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అదంతా గ్రాఫిక్సే అయినా సినిమాలో అక్కడక్కడా వారు టవర్‌పై నుండి పడిపోతామేమో అని టెన్షన్ పడడం చాలా నేచులర్‌గా అనిపిస్తుంటుంది. వర్జీనియా గార్డెనర్, గ్రేస్ క్యారొలీన్ నటనే ‘ఫాల్’ను చాలావరకు నిలబెట్టింది. ఇక సర్వైవల్ డ్రామాలో పెద్దగా ట్విస్టులు ఏముంటాయిలే అని అనుకోకండి. ‘ఫాల్’లో కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది. అది కచ్చితంగా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక డిఫరెంట్ థ్రిల్లర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనుకునే వారు అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉన్న ‘ఫాల్’ను చూసేయొచ్చు.


Also Read: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది