‘ది గిల్టీ’ (The Guilty) మూవీ 2021లో విడుదలయిన అమేరికన్  క్రైం థ్రిల్లర్. పోలీస్ ఆఫీసర్ జో బేలర్ 911 కాల్ సెంటర్‌లో నైట్ షిఫ్ట్‌లో పని చేస్తుంటాడు. ఒక రోజు ఎమిలీ లైట్టన్ అనే మహిళ నుంచి ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఆమె కిడ్నాప్ కు గురైనట్లు చెప్తుంది. ఆమెను వైట్ వ్యాన్ లో తీసుకెళ్తున్నట్లు చెబుతుంది. పూర్తి వివరాలు చెప్పకుండానే ఫోన్ కట్ అయిపోతుంది. దీంతో జో కాలిఫోర్నియా హైవే దగ్గర పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తాడు. లైసెన్స్ ప్లేట్ నంబర్ వివరాలేవీ తెలియదు కాబట్టి వారు ఆ వ్యాన్ ను పట్టుకోలేకపోతారు.


దీంతో ఎమిలీ ఇంటికి కాల్ చేస్తాడు జో. ఆమె ఆరేళ్ల కుమార్తె అబ్బితో మాట్లాడుతాడు. తన తండ్రి హెన్రీ ఫిషర్‌తో కలిసి బయటకు వెళ్లిందని చెబుతుంది. వాళిద్దరు గొడవ పడ్డారని కూడా చెప్తుంది. అబ్బిని అడిగి హెన్రీ ఫోన్ నంబర్, వ్యాన్ నంబర్ తెలుసుకుంటాడు జో. హెన్రీ పైన ఇది వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా తెలుసుకుంటాడు. ఇంట్లో ఉన్న అబ్బి, ఆమె తమ్ముడు ఆలివర్ రక్షణ కోసం ఇద్దరు పోలీసులు అక్కడికి వెళ్తారు. అబ్బి మీద రక్తం మరకలు ఉంటాయి. ఆ రక్తం అబ్బిది కాదని తెలుసుకొని, వెతికితే ఆమె తమ్ముడు ఆలివర్ రక్తపు మడుగులో  ఉంటాడు. ఈ విషయాలు జో మాట్లాడుతున్న ఫోన్ సంభాషణలోనే ప్రేక్షకులకు తెలుస్తుంది. ఎందుకంటే జో తప్ప సినిమా మొత్తం మరెవరూ కనపడరు. అయినప్పటికీ చివరి వరకూ స్టోరీ గ్రిప్పింగ్ గా ఉంటుంది.


హెన్రీ చిన్న పిల్లవాడైన ఆలివర్‌ను చంపి వెళ్లినట్లు పోలీసులు జోకి చెప్తారు. జో ఎమిలీకి కాల్ చేసి ఆమె తప్పించుకోవటానికి మార్గాలు చెప్తూ ఈసారి హెన్రీ వ్యాన్ ఆపగానే అతన్ని రాయితో కొట్టమని చెప్తాడు. హెన్రీ అపార్ట్మెంట్ కి వెళ్లిన పోలీస్ ఆఫీసర్ రిక్ ఎమిలీ హెల్త్ రిపోర్ట్స్ చూస్తాడు. ఒక మానసిక రోగి అని జోకి చెబుతాడు. ఆలివర్ హత్యపై ఎమిలీని ప్రశ్నిస్తాడు జో. దీంతో ఆమె.. ఆలివర్ కడుపులో పాములున్నాయని, కోసి తీసేశానని అమాయకంగా చెప్తుంది. అప్పుడు జో ఆమె మెంటల్ పేషెంట్ అని తెలుసుకుంటాడు. ఆలివర్ ను చంపింది ఎమిలీ భర్త హెన్రీ కాదు.. ఎమిలీనే అని అప్పుడు అర్థమవుతుంది. హెన్రీ ఆమెను మానసిక రోగుల హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. వ్యాన్ ఆపగానే ఎమిలీ హెన్రీని ఇటుకతో కొట్టి పారిపోతుంది.


ఆ తర్వాత ఆమె జోకి మళ్లీ కాల్ చేస్తుంది. సూసైడ్ చేసుకోబోతున్నట్టు చెప్తుంది. దీంతో ఆమెను మాటల్లో పెట్టి రక్షించడానికి జో ప్రయత్నిస్తాడు. తాను డ్యూటీలో ఉన్నపుడు ఒక 19 ఏళ్ల కుర్రాడిని కోపంలో కాల్చి చంపినట్టు చెప్తాడు. ఈ లోగా పోలీసులు ఆమె లొకేషన్ ట్రాక్ చేసి.. ఆమె ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. దీంతో ఆమె కాల్ కట్ చేస్తుంది. ఆ పోలీసులు ఎమిలీ సురక్షితంగా ఉందని, అలాగే ఆలివర్ బతికే ఉన్నాడని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోందని జోకి చెప్తారు.


అయితే, ఎమిలిని మాటల్లో పెట్టేందుకు.. చెప్పిన మాటలే జోని చిక్కుల్లో పడేస్తాయి. కోర్టు విచారణలో.. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమేనని, తనకు ఎన్నాళ్లు శిక్ష పడినా పర్వాలేదు నిజం చెప్పేయాలని పోలీస్ ఆఫీసర్ రిక్‌కు చెబుతాడు. మీడియాకు కూడా తాను 19 ఏళ్ల కుర్రాడిని చంపినట్లు చెప్పేస్తాడు. అంతటితో మూవీ ముగుస్తుంది. ఈ మూవీ Netflixలో అందుబాటులో ఉంది.


Also Read: ఓర్నీ, చిన్న కారణానికే హత్య? ట్విస్టులతో పిచ్చెక్కిస్తున్న భావన లేటెస్ట్ థ్రిల్లర్