Janasena Chief Pawan Kalyan- 'రాష్ట్ర పరదాల మహారాణిని కాలేజీ విద్యార్థులు బస్సు యాత్రలో ఏదో అన్నారని కోపం వచ్చింది. విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈ మహారాణిని ఇంటికి పంపడానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై ఉన్నార'ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్‌ది శాడిస్టిక్ మనస్తత్వం! కలుగులో ఎలుక లాంటివాడు.. ఎవరికి పేరు వచ్చినా తట్టుకోలేని స్వభావం. చిత్ర పరిశ్రమను సైతం రాజకీయాల్లోకి లాగాలని చూశారని వ్యాఖ్యానించారు. 


శనివారం రాజానగరంలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో ఎంతో హుందాగా ముఖ్యమంత్రితో మాట్లాడానికి వచ్చిన అభిమాన హీరోలను సైతం గేటు దగ్గర నుంచి నడిపించారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా కించపరిచి ఆనందం పొందిన వ్యక్తి జగన్. అజాత శత్రువుగా సినిమా పరిశ్రమలో ఉండే చిరంజీవిని సైతం కించపరిచారన్నారు. 


‘ఉదయం లేస్తే మనందరికీ నీతులు చెప్పే సీఎం జగన్ గత ఐదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. 38 కేసులు ఎదుర్కొని 16 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి. ప్రతి శుక్రవారం వాయిదా ఎలా ఎగ్గొట్టాలి అని వణుకుతూ ఉంటాడు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జగన్ అవినీతి విషయంలో మళ్లీ జైలుకెళ్లడం ఖాయం. జగన్ ఎక్కడ కోరుకుంటే అక్కడ.. ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పి ప్రత్యేక జైలు ఏర్పాటు చేస్తాం. అవినీతి పరులను వదలమని రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన సభ సాక్షిగా చెప్పిన మోదీ గ్యారెంటీతో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం’ అన్నారు పవన్ కళ్యాణ్.


ప్రజలను వేధిస్తే కోపం వస్తుంది 
నన్ను వ్యక్తిగతంగా దూషించినా నాకు కాస్త అయినా కోపం ఉండదు. ఒక దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే కోపం వస్తుందన్నారు పవన్. అణగారిన వర్గాలకు అకారణంగా అన్యాయం చేస్తే కోపం వస్తుంది. బస్సు యాత్రలో చిన్న పూల మూట తగిలితే డ్రామాలు చేసి కంటిపైన పెద్ద స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్న జగన్ కు 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే ఏమాత్రం పట్టదు. ప్రతిసారి నా మీద పడి వ్యక్తిగతంగా ఏడవడం తప్ప పాలన కూడా చేతకాదంటూ మండిపడ్డారు.


వైసీపీ రహిత రాష్ట్రం కోసమే కూటమి
2019 తర్వాత జనసేన పార్టీ బలం భారీగా పెరిగింది అని తెలిసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు.. మళ్లీ జగన్ రాకూడదు.. రాష్ట్రం నాశనం కాకూడదు అనే లక్ష్యంతోనే ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా వెనక్కి తగ్గాం. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని పదునైన వ్యూహాలతో ముందుకు వెళ్తామన్నారు.


పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం
‘‘పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి. పోలవరం పూర్తిచేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం కచ్చితంగా తీసుకుంటుంది. ఉత్తరాదిలో గంగానది ప్రక్షాళన మాదిరి నరేంద్ర మోదీతో మాట్లాడి గోదావరి ప్రక్షాళన కు నడుం బిగించాలని కోరుతాం. రాజమండ్రి – భద్రాచలం పాపికొండల పర్యాటక సర్క్యూట్ ను కేంద్రం అమలు చేసేలా చూస్తాం. నువ్వు నా సతీమణిని పెళ్లాం అని సంభోదిస్తే ... నేను నిన్ను నా నాల్గో పెళ్లాం అని అనాల్సి ఉంటుంది. నా నాల్గో పెళ్లానికి కాకినాడలో అవమానం జరిగింది అని ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరిని, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని’’ పవన్ కళ్యాణ్ కోరారు.


క్రిస్టియన్లపై ఈగ వాలనివ్వను 
తర భార్య కూడా రష్యన్ క్రిస్టియన్ ఆర్థోడక్స్ విధానాలు పాటిస్తారని.. పిల్లలకు సైతం మీరు ఏ మతాన్ని ఎంచుకున్నా, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన వ్యక్తిని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే... క్రిస్టియన్లకు కష్టకాలం తప్పదని జగన్ ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ జెరూసలెం ఎప్పుడు వెళ్లాడో తెలియదు కానీ నేను ఆయన కంటే ముందే జీసస్ నడియాడిన ప్రాంతాన్ని దర్శించుకున్నట్లు పవన్ తెలిపారు. క్రిస్టియన్ సోదరులు జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.