'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు, విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. ఆ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా 'విరాట పర్వం' (Virata Parvam). ఇందులో రానా దగ్గుబాటి హీరో. ఆయనకు జోడీగా సాయి పల్లవి నటించారు. త్వరలో ఈ జోడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు.
'విరాట పర్వం' సినిమాను జూలై 1న (Virata Parvam Release Date) విడుదల చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. డి. సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ''వెండితెరపై ప్రేమ, విప్లవం ప్రణయ గాథను జూలై 01న చూడండి'' అని చిత్ర బృందం పేర్కొంది.
'విరాట పర్వం'లో మావోయిస్టు పాత్రలో రానా కనిపించనున్నారు. ఆయన్ను ప్రేమించే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించారు. సాయుధ పోరాటంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ప్రేమకథకూ సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'చిన్ని' రివ్యూ : కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?