సినిమా రివ్యూ: చిన్ని (తమిళంలో సాని కాయిదం)
రేటింగ్: 3/5
నటీనటులు: కీర్తీ సురేష్, సెల్వ రాఘవన్, మురుగ దాస్, వినోద్ మున్నా, జయక్రిష్ణ తదితరులు 
మాటలు: కృష్ణకాంత్ 
సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి 
సంగీతం: సామ్ సీఎస్

  
నిర్మాణం: స్క్రీన్ సీన్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌ 
విడుదల తేదీ: మే 06, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)


కీర్తీ సురేష్ (Keerthy Suresh) కమర్షియల్ కథానాయిక. 'మహానటి'తో పాటు కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినప్పటికీ... మరీ డీ - గ్లామర్ రోల్స్ చేయలేదు. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్... 'చిన్ని'లో (తమిళంలో సాని కాయిదం) కంప్లీట్ డీ - గ్లామర్ రోల్ చేశారు. ప్రచార చిత్రాల్లో కీర్తీ సురేష్ లుక్ ఆడియన్స్‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసింది. చిన్ని పాత్రలో కనబరిచిన నటన, ఆ కళ్లల్లో ఇంటెన్సిటీ ఆకట్టుకుంది. మరి, సినిమా ఎలా ఉంది (Chinni Review)? కీర్తీ సురేష్, సెల్వ రాఘవన్ ఎలా చేశారు? 


కథ: చిన్ని (కీర్తీ సురేష్) పోలీస్. ఆమె భర్త మారప్ప రైస్ మిల్లులో పని చేస్తుంటాడు. మిల్లులో కుల వివక్ష ఎదుర్కొంటాడు. తనను అవమానించడంతో పాటు తన భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో అగ్ర వర్ణానికి చెందిన వ్యక్తి ముఖంపై ఉమ్మేస్తాడు. అది సహించలేని అగ్ర వర్ణ పెద్దలు... భార్య పోలీస్ కావడంతో మారప్ప విర్ర వీగుతున్నాడని, చిన్నిపై అత్యాచారానికి ఒడిగడతారు. మారప్ప, అతని కుమార్తె ఇంట్లో ఉండగా ఇంటికి నిప్పు పెట్టి తగలబెడతారు. కోర్టులో న్యాయం జరిగేలా కనిపించదు. చిన్నికి సవతి సోదరుడు రంగయ్య (సెల్వ రాఘవన్) ఎటువంటి సహాయ సహకారాలు అందించాడు? ఇద్దరూ కలిసి ఏం చేశారు? తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు? అనేది మిగతా సినిమా (Saani Kaayidham Review).


విశ్లేషణ: తమిళ సినిమాలో కొత్త అధ్యాయం మొదలైంది. పా. రంజిత్, వెట్రిమారన్, మారీ సెల్వరాజ్ వంటి దర్శకులు సినిమాను వినోదంగా మాత్రమే చూడటం లేదు. దళితులపై అరాచకాలను, దళితులకు జరిగిన అన్యాయాలను సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దళిత కథలకు ప్రాణం పోస్తున్నారు.  రజనీకాంత్ 'కాలా', ధనుష్ 'అసురన్' (తెలుగులో 'నారప్ప'గా రీమేక్ చేశారు), 'కర్ణన్' సహా మరికొన్ని చిత్రాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగులో 'పలాస' కూడా వచ్చింది. అటువంటి చిత్రమే 'చిన్ని' కూడా! 'కాలా'లో కొన్ని కమర్షియల్ హంగులు కనిపిస్తాయి. 'అసురన్', 'కర్ణన్' సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. 'చిన్ని'నీ సహజత్వానికి దగ్గరగా తీశారు.


'చిన్ని' కథలో ట్విస్టులు లేవు. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కోసం దర్శకుడు ఒక్క విషయాన్ని దాచారు. దానిని చివర్లో చెప్పారు. అదొక్కటీ మినహాయిస్తే... కథేంటి? ముగింపు ఏంటి? అనేది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ప్రేక్షకుడికి తెలుస్తూ ఉంటుంది. ఇక, కథానాయిక భర్త మరణం, కోర్టులో సన్నివేశం తర్వాత క్లియ‌ర్‌గా అర్థం అవుతుంది. క్లైమాక్స్ తెలిసినప్పుడు సినిమాను చివరి వరకూ చూసేలా చేయడం, ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ ఓటీటీ అంటే ఫార్వర్డ్ బటన్ ఆప్షన్ ఉంటుంది. ఫార్వర్డ్ బటన్ వైపు వెళ్లకుండా ఆడియన్స్ చివరి వరకూ సినిమా చూసేలా చేయడంలో 'చిన్ని' సక్సెస్ అయ్యిందంటే కీర్తీ సురేష్ నటనే కారణం.


కీర్తీ సురేష్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది? మహానటి! చక్కగా నటిస్తుంది. అయితే, ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తుంది. పంచ్ డైలాగులు లేవ్, ఫైటుల్లేవ్, గ్లామర్ లేదు! కానీ, కీర్తీ సురేష్ క్యారెక్టర్‌లో హీరోయిజం కనిపిస్తుంది. దానికి కారణం దర్శకత్వమో? ఇంకొకటో? అని చెప్పలేం! చిన్ని మనసులో రగులుతున్న ప్రతీకార జ్వాలను కీర్తీ సురేష్ పలికించిన తీరే అందుకు కారణం. చాలా వరకూ పాత్ర తాలూకూ పెయిన్ ప్రేక్షకుడు ఫీలయ్యేలా నటించారు. సాధారణ సన్నివేశాలను తన నటనతో అద్భుతంగా మలిచారు. ఆమెకు సెల్వ రాఘవన్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఆయన కూడా పాత్రలో ఒదిగిపోయారు. మిగతా నటీనటులు పాత్రలు తగ్గట్టు నటించారు.


కీర్తీ సురేష్, సెల్వ రాఘవన్ ఎంపికతో దర్శకుడిగా అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌ సగం సక్సెస్ అయ్యారు. సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్, సినిమాటోగ్రాఫర్‌గా యామిని యజ్ఞమూర్తి ఎంపికతో మిగతా సగం సక్సెస్ అయ్యారు. కానీ, కథకుడిగా ఫెయిల్ అయ్యారు. కీర్తీ సురేష్ పాత్రను చక్కగా రాసుకున్న దర్శకుడు, ఆమెకు ధీటైన విలన్ పాత్రలు రాయడంపై దృష్టి పెట్టలేదు. దాంతో 'వన్ వే ట్రాఫిక్' తరహాలో కథానాయిక పాత్రకు ఎదురు లేకుండా పోయింది. ప్రతీకారం తీర్చుకోవడంలో ఆమెకు బలమైన సవాళ్లు ఎదురైతే... హీరోయిజం మరింత ఎలివేట్ అయ్యేది.


'చిన్ని' సినిమాలో సంగీతం, ఛాయాగ్రహణం బావున్నాయి. నేపథ్య సంగీతంలో సైలెన్స్‌ను (నిశ్శబ్దాన్ని) ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. కీర్తీ సురేష్ తర్వాత  సామ్ సీఎస్ రీ రికార్డింగ్ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో కొన్ని సన్నివేశాలను యామిని యజ్ఞమూర్తి అద్భుతంగా చిత్రీకరించారు. యాక్షన్ సీన్స్ (ఫైట్స్ కాదు, మర్డర్ సీన్స్)లో వయలెన్స్ ఎక్కువైంది. అది కొంత మంది కంటికి ఇబ్బందిగా అన్నిస్తుంది. కీర్తీ సురేష్ చేతిలో వాళ్ళు (విలన్లు) చావడం ఖాయమని, త్వరగా చంపేస్తే సినిమా ముగుస్తుందని అనిపిస్తుంది. అయితే, ప్రీ క్లైమాక్స్ లో కీర్తీ సురేష్ మెటాడోర్ / వ్యాన్ డ్రైవ్ చేసే యాక్షన్ సీన్ గూస్ బంప్స్ ఇస్తుంది. వయలెన్స్‌ను భరించలేని ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉండటం మంచిది. వయలెన్స్‌కు తోడు కథను దృష్టిలో పెట్టుకుని చిన్న పిల్లలనూ సినిమాకు దూరంగా ఉంచాలి.


Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?


'చిన్ని' కథ విషయానికి వస్తే... సింపుల్‌గా, సింగిల్ లైన్‌లో చెప్పవచ్చు. తన భర్త, కుమార్తెను చంపేసి తనపై అత్యాచారం చేసిన వ్యక్తులపై ఒక మహిళ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నది అనేది సినిమా. అయితే... కీర్తీ సురేష్, సెల్వ రాఘవన్ అభినయం ఈ సింపుల్ స్టోరీని ఎక్సట్రాడినరీగా మార్చింది. దర్శకుడు అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌ గ్రిప్పింగ్‌గా తీశారు. ముఖ్యంగా కీర్తీ సురేష్ నటన ఆమెపై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. సింపుల్ స్టోరీ అయినా ఎంగేజ్ చేస్తుంది. కీర్తీ సురేష్ కోసమైనా తప్పకుండా సినిమా చూడాలి.


Also Read: 'గాలివాన' రివ్యూ: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?