సినిమా రివ్యూ: అశోక వనంలో అర్జున కళ్యాణం
రేటింగ్: 2.75/5
నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ,  కాదంబరి కిరణ్ తదితరులు
కథ, కథనం, మాటలు, షో రన్నర్: రవి కిరణ్ కోలా 
సినిమాటోగ్రఫీ: పవి కె పవన్ 
సంగీతం: జయ్ క్రిష్‌     
సమర్పణ: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
నిర్మాతలు: భోగవల్లి బి, సుధీర్ ఈద‌ర‌
దర్శకత్వం: విద్యాసాగ‌ర్ చింతా
విడుదల తేదీ: మే 06, 2022


విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడం కోసం ఆయన ఒక ప్రాంక్ వీడియో చేశారు. దానిపై ఒకరు కంప్లయింట్ చేయడం, టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించడం, అందులో వాగ్వాదం చోటు చేసుకోవడం... విశ్వక్ సేన్‌ను వార్తల్లో నిలిపాయి. ఆ వివాదం పక్కన పెడితే... 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ఎలా ఉంది?   


కథ: అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)ది సూర్యాపేట్. వయసు 30 దాటింది. తమ కులంలో అమ్మాయిలు దొరకడం లేదని, వేరే కులం అయినప్పటికీ.... గోదావరి జిల్లా అమ్మాయి మాధవి (రుక్సార్ థిల్లాన్)ను చేసుకోవడానికి సిద్ధమవుతాడు. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అమ్మాయి ఇంటికి వెళతారు. మొదటి రోజు బస్ ప్రాబ్లమ్, ఆ తర్వాత కరోనా కారణంగా వచ్చిన జనతా కర్ఫ్యూ వల్ల అర్జున్ కుమార్ & గ్యాంగ్ అమ్మాయి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మాధవికి దగ్గర కావాలని అర్జున్ కుమార్ ప్రయత్నించినా... అమ్మాయి దూరం జరుగుతుంది. పెళ్లికి ముందు లేచిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మాయి ఎందుకు లేచిపోయింది? ఆ తర్వాత కూడా అమ్మాయి ఇంట్లో ఉండాల్సి రావడంతో అబ్బాయి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యింది? చివరికి, అర్జున్ కుమార్ అల్లం చేశాడు? అతడికి పెళ్లి అయ్యిందా? లేదంటే అమ్మాయి ఎవరూ దొరక్క అలా మిగిలిపోయాడా? అనేది మిగతా సినిమా. (AVAK Movie Story)


విశ్లేషణ: పెళ్లి ఎవరి కోసం చేసుకోవాలి? సమాజం కోసమా!? మన బంధువులు, ఇరుగు పొరుగు అడుగుతున్నారనా!? పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడా!? లేదంటే 30 ఏళ్లు వచ్చాయి కాబట్టి వచ్చిన సంబంధం చేసుకోవాలా!? ఈ తరం యువతలో ఇటువంటి సందేహాలు ఎన్నో ఉంటాయి. వాటికి సమాధానం ఇస్తుందీ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా.


అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు వస్తే... ఇదొక సాదాసీదా కథ, సాదాసీదా కుర్రాడి కథ. సహజత్వానికి కాస్త దగ్గరగా ఉన్న కథ. ముఖ్యంగా ఈతరం యువత కనెక్ట్ అయ్యే కథ. సినిమాకు అదే ప్లస్, అదే మైనస్. ఫస్టాప్ అంతా సరదాగా నవ్విస్తూ వెళుతుంది. అయితే, కథ ఏంటనేది ఈజీగా అర్థం అవుతుంది. ఇంటర్వల్ దగ్గరకు నెక్స్ట్ హాఫ్ ఏం జరుగుతుందనేది క్లారిటీ వస్తుంది. ప్రేక్షకుల ఊహకు దగ్గరగా సినిమా వెళుతుంది. సహజత్వానికి దగ్గరగా తీయడం వల్ల వచ్చిన సమస్య ఇది. అయితే, కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. కొన్ని మనసుకు హత్తుకుంటూయి.


రవి కిరణ్ కోలా కథలో కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. కానీ, కొత్తదనం లేదు. పెళ్లికి ముందు అమ్మాయి లేచిపోవడం వంటి కథలు గతంలో తెరపై చూడటం, అమ్మాయి లేచిపోతుందని మనకు అర్థం అవుతూ ఉండటం వల్ల సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ అనేవి మిస్ అయ్యాయి. రవి కిరణ్ కోలా కథను విద్యాసాగర్ చింతా చక్కగా తెరకెక్కించారు. జయ్ క్రిష్ పాటలు సినిమా విడుదలకు ముందే హిట్ అయ్యాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా బావుంది. అయితే, నేపథ్య సంగీతం విషయంలో ఆయన మరింత కాన్సంట్రేట్ చేయాల్సింది. ఎందుకంటే... కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని నేపథ్య సంగీతం డామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాలో ఎక్కువ భాగం ఓకే ఇంట్లో జరిగినా... ఆ ఫీల్ రానివ్వకుండా చూసుకున్నారు. మధ్య మధ్యలో గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.


అర్జున్ కుమార్ అల్లం కోసం విశ్వక్ సేన్ బరువు పెరిగారు. పాత్రలో ఒదిగిపోయారు. మందు తాగిన తర్వాత వచ్చే సన్నివేశంలో ఆయన నటన థియేటర్లలో అబ్బాయిల చేత విజిల్స్ వేయిస్తుంది. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాని అబ్బాయిల పరిస్థితిని నటనలో విశ్వక్ సేన్ చక్కగా చూపించారు. బయట హుషారుగా కనిపించే విశ్వక్ సినిమాలో అండర్ ప్లే చేశారు. రుక్సార్ తెల్లటి బొమ్మలా ఉన్నారు. నటిగా ఏమంత ఆకట్టుకోలేదు. అయితే... రుక్సార్ చెల్లెలు పాత్రలో నటించిన రితికా నాయక్ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉంటారు. చూపులకు పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అయితే... ఆమె క్యారెక్టరైజేషన్, ఆ పాత్రలో రితికా నాయక్ నటన ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్ ఒక్క సన్నివేశంలో కనిపించారు. ఆ కాసేపు నవ్వించారు. విశ్వక్ సోదరి పాత్రలో విద్య శివలెంక సహజంగా నటించారు. తమిళ హీరో అశోక్ సెల్వన్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. కాదంబరి కిరణ్, గోపరాజు రమణ తదితరుల పాత్రలను చూస్తే... మనం ఎక్కడో ఇక చోట చూసిన పాత్రల వలే ఉంటాయి. ఫోటోగ్రాఫర్ పాత్రలో, గోదావరి యాసతో రాజావారు రాణిగారు ఫేమ్ రాజ్ కుమార్ చౌదరి కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. 


Also Read: భళా తందనాన రివ్యూ: శ్రీ విష్ణు ‘భళా’ అనిపించాడా?


ఓవరాల్ గా చెప్పాలంటే... రెండున్నర గంటలు కాస్త మనసుకు ఆహ్లాదాన్ని పంచే సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. గొప్ప కథ ఏమీ లేదు. గొప్ప పాత్రలూ లేవు. అయితే, కాసేపు మనల్ని - మన చుట్టుపక్కల చూసిన సంఘటనలను తెరపై చూసినట్టు ఉంటుంది. కథ వీక్ అయినప్పటికీ... క్యారెక్టరైజేషన్స్, కామెడీ సీన్స్ కొంత వినోదం పంచుతాయి. పెళ్లి గురించి చివర్లో చిన్న సందేశం కూడా ఉంది. ఎటువంటి అంచనాలు పెట్టకోకుండా థియేటర్లకు వెళితే... వేసవిలో చల్లటి వినోదం అందిస్తుంది సినిమా. కుటుంబంలో కలిసి చూసే చిత్రమిది. సింపుల్ సినిమా, నీట్ గా ఉన్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. 


Also Read: 'చిన్ని' రివ్యూ : కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?