రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఇటీవల ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. కథానాయకుడిగా ఆయనకు 13వ సినిమా (VD13 Movie) అది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ చేశారట.
'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ సినిమాకు 'ఫ్యామిలీ స్టార్' (VD 13 titled as Family Star) టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విజయ్ దేవరకొండ టార్గెట్ చేశారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలు. కుటుంబ కథా చిత్రాలకు 'దిల్' రాజు పెట్టింది పేరు. విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో వచ్చిన 'గీత గోవిందం' ఫ్యామిలీ సినిమాయే. మరోసారి అటువంటి సినిమాతో వస్తున్నారట.
దర్శకుడు పరశురామ్ తీసిన చివరి మూడు సినిమాలు చూస్తే... హీరో ఒరిజినల్ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా ఫిక్స్ చేశారు. 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు పేరు మహి అలియాస్ మహేష్. 'గీత గోవిందం'లో విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండను చూపించారు. 'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ పేరు శిరి అలియాస్ శిరీష్. 'ఫ్యామిలీ స్టార్'కు వస్తే విజయ్ దేవరకొండను కుటుంబ రావుగా చూపించబోతున్నారని టాక్.
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు?
సంక్రాంతికి 'ఫ్యామిలీ స్టార్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత 'దిల్' రాజు ప్లాన్ చేస్తున్నారట. కుటుంబ కథా చిత్రం కనుక సంక్రాంతికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది థియేటర్లకు వస్తారని, వాళ్లకు సినిమా పక్కా నచ్చుతుందని ప్లాన్ చేశారట.
విజయ్ సరసన 'సీతారామం' భామ మృణాల్!
విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను కథానాయిక ఎంపిక చేశారు. 'సీతా రామం'లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత నాని సినిమాలో అవకాశం అందుకున్నారు. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా. విజయ్ దేవరకొండతో, 'దిల్' రాజు నిర్మాణంలో మొదటి సినిమా.
Also Read : 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?
'ఫ్యామిలీ స్టార్'కు ముందు మరో రెండు!
Vijay Devarakonda Next Movie : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. 'ఫ్యామిలీ స్టార్' కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి', గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా విజయ్ దేవరకొండ చేస్తున్నారు.
Also Read : ఆదిపురుష్ బాలేదని చెబుతావా - ప్రేక్షకుడిపై దాడి చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
విజయ్ దేవరకొండ, 'దిల్' రాజు సినిమాకు తొలుత దర్శకుడిగా చాలా మంది పేర్లు వినిపించాయి. మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి గౌతమ్ తిన్ననూరి వరకు కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ సంస్థలో చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి మరీ పరశురామ్ ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.