ఈమధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యువ దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు. వీరిలో కొంతమంది ఎంట్రీ తోనే పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంటే, మరి కొంతమంది మాత్రం నూతన తారాగణంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీసి సక్సెస్ అందుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటి ఆడియన్స్ కూడా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పేర్లను చూడకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ కోవలో ఇప్పటికే చాలా సినిమాల సక్సెస్ అయ్యాయి. ఇక తాజాగా మరో సరికొత్త కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే 'భీమదేవరపల్లి బ్రాంచి'. తెర వెనక ఉండి ఒక సంఘటనని లేదా ఓ సందర్భాన్ని ఒక సామాన్యుడిని వైరల్ చేసి హీరోలుగా చేస్తారు కొందరు.. టాప్ టెన్ యూట్యూబర్స్, టాప్ టెన్ ట్విట్టరైట్స్, టాప్ టెన్ ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, టాప్ టెన్ ఫేస్బుక్ యూజర్స్. వీళ్లంతా తెర వెనక హీరోలే.


అలాంటి వాళ్లంతా కలిసి ఒకేసారి అంతర్జాతీయ వేదికపై ఈరోజు భీమదేవరపల్లి బ్రాంచి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ట్రైలర్ ని ఒకసారి పరిశీలిస్తే.. అందమైన, అమాయకమైన ఓ పల్లెటూరు కథ ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్న నేపథ్యంలో రాసుకున్న కథలా ఈ సినిమా ఉండబోతోంది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే ప్రభుత్వాలు ఇచ్చాయని అనుకొని, ఆ డబ్బులు మొత్తాన్నీ ఖర్చు చేసేస్తే, ఆ తర్వాత తలెత్తిన పర్యవసనాలు ఈ విధంగా ఉన్నాయనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అంతకంటే ముందు అమాయక పల్లెటూరి ప్రజలు, వారి అభిమానాలు, ప్రేమలు ఈ సినిమా కోసం లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అప్పనంగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసి తీరా కట్టాల్సి వచ్చినప్పుడు నెలకొన్న ఇబ్బందులు, ఆపై పనిలో పనిగా ఈ ఉచిత పథకాలపై టీవీ డిబేట్లు ఇలా చాలా మలుపులు తిరిగినట్లు ట్రైలర్లో చూపించారు.


ఇక భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కథ నుంచి ఎంపిక నిర్మాణం, ప్రచారం అన్ని మూస ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ వినూత్నంగా సరికొత్త పద్ధతిలో వెళ్లడం అందరిని ఆకట్టుకుంటుంది. ఒక సినిమాని కార్టూన్స్ ద్వారా ప్రచారం చేయాలని దర్శకుడు రమేష్ చెప్పాల ఆలోచనతో సినిమా జనాల్లోకి వెళ్ళింది. రీసెంట్ గానే తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక జూన్ 23న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. డాక్టర్ బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, బలగం తాత సుధాకర్ రెడ్డి, రాజవ్వ, అభిరామ్, కీర్తి లత, రూపా శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. శుద్దాల అశోక్ తేజ, సంజయ్ మహేష్ వర్మ సాహిత్యం అందించగా.. చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చారు. కే. చిట్టిబాబు కెమెరామెన్ గా వ్యవహరించగా.. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.