విజయ భాను... ఈ తరం ప్రేక్షకులకు ఆవిడ ఎవరు తెలియకపోవచ్చు. కానీ, 70వ దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆవిడ ఒక వెలుగు వెలిగారు. సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందిన కళాకారిణి కూడా. ఆవిడ ఇక లేరు. చెన్నైలో తుది శ్వాస విడిచారు.

Continues below advertisement


అమెరికన్‌తో ప్రేమ పెళ్లి... అక్కడే సెటిల్...
ఇటీవల చెన్నై వచ్చి తిరిగిరాని లోకాలకు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటిగా విజయ భాను పదేళ్ల పాటు సినిమాలు చేశారు. అప్పట్లో రాజబాబుకు జోడీగా ఆవిడ నటించిన ప్రతి సినిమా హిట్. ఆ జంటకు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగుతో పాటు ఇతర భాషలలో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలో, కెరీర్ పిక్ స్టేజీలో ఉండగా ఒక అమెరికన్‌తో విజయ భాను ప్రేమలో పడ్డారు. అతడిని పెళ్లి చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు ఒక అమ్మాయి ఉంది.


విజయ భాను స్వస్థలం అనంతపురం. అయితే ఆవిడ జన్మించింది, చదువుకున్నది, నటిగా పేరు తెచ్చుకున్నది చెన్నైలో. అక్కడ ఆమెకు సొంత ఇల్లు ఉంది. ఇటీవల విజయ భాను ఇండియా వచ్చారు. నెల క్రితం వచ్చిన ఆవిడ... చెన్నైలోని సొంత ఇంటిని చూసుకునేందుకు వెళ్లారు. ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు గురైన విజయ భాను... తన ఇంటిలో ఇటీవల తుది శ్వాస విడిచారు. నటిగా తనకు పేరు తీసుకు వచ్చిన నగరంలో చివరి శ్వాస విడవడం విధి నిర్ణయం అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


విజయ భాను ఏయే సినిమాల్లో నటించారు?
మెగాస్టార్ చిరంజీవి, లోక నాయకుడు కమల్ హాసన్, సహజ నటి జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇది కథ కాదు' గుర్తు ఉందా? సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నారు విజయ భాను. 


ఎన్టీఆర్ 'నిప్పులాంటి మనిషి', శోభన్ బాబు 'కిలాడీ బుల్లోడు', విజయ లలిత 'ఒక నారి వంద తుపాకులు', శారద 'ప్రియ బాంధవి', కృష్ణంరాజు 'స్త్రీ', జగ్గయ్య 'శభాష్ పాపన్న' ఘట్టమనేని రమేష్ బాబు హీరోగా జంధ్యాల దర్శకత్వం వహించిన 'చిన్ని కృష్ణుడు' తదితర సినిమాలలో విజయ భాను నటించారు.


Also Read: 'కన్నప్ప' విడుదలకు ముందు విష్ణు మంచుకు షాక్... డిజప్పాయింట్ చేసిన 'ఢీ' రీ రిలీజ్‌... మరీ ఇంత పూర్ రెస్పాన్స్ ఏంటి?


విజయ భాను ఆకస్మిక మృతి పట్ల సీనియర్ హీరోయిన్ మాజీ ఎంపీ జయప్రద, ప్రముఖ నటుడు సుమన్, దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.‌ చెన్నైలో జరిగిన విజయ భాను దశదిన కర్మకు జయప్రద హాజరు అయ్యారని సింధూరి జయసింఘే తెలిపారు. తన అక్క విజయభాను స్ఫూర్తితో తాను కూడా అమెరికా వెళ్లి సెటిలై అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నానని సింధూరి తెలిపారు. స్వతహాగా సాంప్రదాయ నృత్య కళాకారుని అయిన విజయ భాను... కూచిపూడి, భరతనాట్యం కథక్, కథాకేళి నృత్య రీతులలో నిష్ణాతురాలు. ఆమెకు నాట్య మయూరి బిరుదు ఉంది. లాస్ ఏంజిల్స్ సిటీలో శ్రీ శక్తి శారద నృత్య నికేతన్ పేరుతో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి ఎంతోమందికి నృత్యంలో శిక్షణ ఇచ్చారు.


Also Readఅఖిల్ పెళ్లి చేసిన కొన్ని గంటల్లో డబ్బింగ్ థియేటర్‌కు వెళ్లిన నాగార్జున... ఎందుకో తెలుసా?