ఊర్వశి రౌతేలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై అందాల ఆరబోతతో రచ్చ చేసే ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఐటమ్ గర్ల్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గతంలో క్రికెటర్లతో డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలిచిన ఈ భామ.. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో ఫోన్ పోగొట్టుకొని వార్తల్లోకి ఎక్కడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


క్రికెట్ లో అత్యున్నత టోర్నీ అయిన వన్డే వరల్డ్ కప్-2023 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నో సంచలనాలకు వేదిక అవుతున్నాయి. శనివారం నాడు జరిగిన మ్యాచ్ లో టీంఇండియా మన ప్రత్యర్థి పాకిస్తాన్‌ ను మట్టి కరిపించింది. ప్రపంచకప్‌లో పాక్‌కు వరుసగా ఎనిమిదోసారి ఓటమి రుచి చూపించింది. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లింది ఊర్వశి రౌతేలా. ఈ క్రమంలో సదరు స్టేడియంలో తన కాస్ట్లీ ఐ ఫోన్‌ ను పోగొట్టుకుంది.


ఊర్వశి రౌతేలా తన మొబైల్ మిస్ చేసుకున్న విషయాన్ని ఆదివారం సాయంత్రం తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తన 24 క్యారెట్ల రియల్ గోల్డ్ ఐ ఫోన్‌ పోయిందని ట్వీట్ చేసింది. అది ఎవరికైనా కనిపిస్తే దయచేసి వీలైనంత త్వరగా తనకు తిరిగిచ్చి సహాయం చెయ్యాలని కోరింది. ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేసింది. 






Also Read: ఇండియన్ సినిమాపై సౌత్ ఇండస్ట్రీ ప్రభావం గురించి సీనియర్ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు!


12 గంటలు గడిచినా ఊర్వశి రౌతేలా నుంచి మరో ట్వీట్ రాకపోవడంతో ఆమె ఐఫోన్ ఇంకా దొరకలేదని అర్థమవుతోంది. ఆ ఫోన్ పోయిందా? లేదా ఎవరైనా కొట్టేసారా? అనేది తెలియదు కానీ, బాలీవుడ్‌ బ్యూటీకి పెద్ద కష్టమే వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ జనసంద్రంలో తిరిగి దొరుకుతుందో లేదో అని కొందరు అంటుంటే.. ''స్టేడియంలు అంత సురక్షితం కాదు కాబట్టి దయచేసి క్రికెట్ మైదానాలకు, క్రికెటర్లకు దూరంగా ఉండండి మేడమ్" అని మరికొందరు ట్వీట్స్ పెడుతున్నారు.


కాగా, ఊర్వశి రౌతేలా 2013లో 'సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2015లో మిస్ దివా, మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' 'పాగల్‌ పంతి' వంటి హిందీ సినిమాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కన్నడ, బెంగాలీ, తమిళ్ భాషల్లో ఒక్కో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఐటం సాంగ్స్‌ ద్వారా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది.


'వాల్తేరు వీరయ్య' మూవీలో 'బాస్‌ పార్టీ, 'ఏజెంట్‌' లో 'వైల్డ్‌ సాలా', 'బ్రో'లో 'మై డియర్‌ మార్కండేయ', 'స్కంద' సినిమాలో 'కల్ట్‌ మామా' వంటి స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడింది ఊర్వశి రౌతేలా. అప్పుడెప్పుడో 'బ్లాక్ రోజ్' అనే తెలుగు సినిమాలో నటించింది కానీ, అది రిలీజ్ అయిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆమె హిందీలో 'దిల్‌ హై గ్రే' అనే సినిమా చేస్తోంది. 


ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, గతంలో టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌ చేసినట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌తో ప్రేమాయణం సాగించినట్లు గట్టిగా వినిపించింది. అప్పట్లో రిషబ్, ఊర్వశి సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్ పోస్టులతో వాదించుకోవడం హాట్ టాపిక్ అయింది. అప్పటి నుంచి ఊర్వశికి సంబంధించిన ప్రతి విషయంలోనూ నెటిజన్లు పంత్‌ పేరుని తీసుకురావడం మనం చూస్తున్నాం.






Also Read: మా నాన్న సిల్వర్ స్క్రీన్ టైటాన్, సినిమా నా DNAలోనే ఉంది: సితార ఘట్టమనేని



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial