ప్రస్తుతం ఇండియన్ సినిమాపై సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ కనిపిస్తోంది. గత కొంతకాలంగా దక్షిణాది చిత్రాలు నార్త్ బెల్ట్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. బాహుబలి, RRR, KGF, పుష్ప లాంటి సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్నారు. మన 'నాటు నాటు' పాట ఆస్కార్ కలను సాకారం చేస్తే, పుష్పరాజ్ గా బన్నీ నేషనల్ అవార్డ్ సాధించారు. ఇలా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యడమే కాదు, వరల్డ్ సినిమా కూడా మన వైపు చూసేలా చేసింది. ఇదే విషయం మీద సీనియర్ నటి ఖుష్బూ సుందర్ స్పందిస్తూ, పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 


చెన్నైలో జరిగిన ABP Southern Rising Summit 2023 వేడుకలో భాగంగా.. 'ABP దేశం'కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయ సినిమాపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ప్రభావం గురించి ఖుష్బూ మాట్లాడింది. ''సౌత్ ఇండియన్ సినిమాకు ప్రస్తుతం మంచి టైం నడుస్తోంది. నేను ముంబైలో పుట్టాను. కానీ 36 ఏళ్లుగా చెన్నైలో ఉంటున్నాను. నన్ను ఎవరైనా మద్రాసీ అంటే నేను దాన్ని అంగీకరిస్తాను. అలాంటిది ఇప్పుడు సౌత్ టాప్ లో ఉండటం చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇండియన్ మూవీ ఫెస్టివల్ జరిగినప్పుడు సౌత్ సినిమాకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. నాకు చాలా బాధగా అనిపించేది. కానీ ఈరోజు మనం ఆస్కార్ వరకూ వెళ్లి అవార్డ్ గెలుచుకొని వచ్చాం. ఇప్పుడు ఏ హిందీ సినిమా రిలీజైనా అందులో తెలుగు తమిళ్ కన్నడ నటులు ఉంటున్నారు'' అని అన్నారు. 


అట్లీ లాంటి సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో సినిమా చేయడం, రోహిత్ శెట్టి లాంటి హిందీ డైరెక్టర్ దక్షిణాది సినిమాలను ఫాలో అవడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు ఖుష్బూ. ''పక్కా కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయనేది సౌత్ మూవీస్ చూస్తే తెలుస్తుంది. రోహిత్ శెట్టి లాంటి దర్శకులు మొదటి నుంచీ కూడా సౌత్ ను ఫాలో అయ్యే సినిమాలు తీస్తుంటారు. ఆయన సినిమాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. బన్నీ, రామ్ చరణ్, తారక్ లాంటి హీరోలు 'పుష్ప' 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలతో జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. నేషనల్ వైడ్ కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తున్నారు. నిజంగా ఇది దక్షిణాది గర్వపడే సమయం'' అని పేర్కొన్నారు. 


సూర్య, ధనుష్, అల్లు అర్జున్ లాంటి సౌత్ హీరోలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ సాధించడం.. ఎలాంటి వివక్ష లేకుండా అందరూ RRR ఆస్కార్ కు వెళ్ళడాన్ని సెలబ్రేట్ చేసుకోవడంపై ఖుష్బూ మాట్లాడింది. ''మనం కాస్త సమయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు సరైన ట్రాక్ లోకి వచ్చేసాం. అందరూ ఇప్పుడు దక్షిణాది సినిమాల వైపు చూస్తున్నారు. మలయాళ చిత్రాలు చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాయి కానీ, పెద్ద విజయం సాధిస్తున్నాయి'' అని తెలిపింది. అలానే ఓటీటీ కంటెంట్ కు కచ్చితంగా సెన్సార్ షిప్ ఉండాలని సీనియర్ నటి అభిప్రాయ పడింది. 


''ఒక ఆడియన్ గా కచ్చితంగా ఓటీటీ కంటెంట్ కు కూడా సెన్సార్ ఉండాలని కోరుకుంటాను. గతంలో యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ని కలిసినప్పుడు ఓటీటీ కంటెంట్ కు కూడా పరిమితులు విధించాలని చెప్పాను. ఎందుకంటే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఎలాంటి కంటెంట్ ను అయినా ప్రసారం చెయ్యొచ్చు. అప్పుడప్పుడు అది పరిధులు దాటడం వల్ల కుటుంబంతో అమ్మానాన్నలతో పిల్లలతో కలిసి చూడటం కష్టంగా మారుతోంది. అందుకే వాటిని నియంత్రించడానికి సెన్సార్ ఉండాలి. సినిమాలకు ఎ, యు/ఎ లాంటి సెన్సార్ సెర్టిఫికేట్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి.. కానీ ఓటీటీలకు అలాంటివేం లేవు. అందుకే ఓటీటీ కంటెంట్ కు కూడా ఒక రకమైన సెన్సార్ షిప్ ఉండాలని నేను భావిస్తాను'' అని కుష్బూ చెప్పుకొచ్చింది. 



Also Read: చేతికి సెలైన్‌తో హాస్పిటల్ బెడ్ మీద సమంత - ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial