బర్దస్త్ షో తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పలువురు కమెడియన్స్ ఇప్పటికే హీరోగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం హీరోగానే కాదు కొంతమంది కమెడియన్స్ మెగా ఫోన్ పట్టి ఏకంగా సినిమాలను సైతం డైరెక్ట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ వేణు గురించి. సినిమాల్లో కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత జబర్దస్త్ షో తో బుల్లితెర ఆడియన్స్ ను అలరించాడు. రీసెంట్ గా మెగాఫోన్ పట్టి 'బలగం' అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే.


తెలంగాణ నేటివిటీతో ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఏకంగా 100కు పైగా అవార్డులు అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి సినిమాతోనే ఇంత పెద్ద విజయాన్ని అందుకొని దర్శకుడిగా వేణు ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరోల విషయానికొస్తే, సుడిగాలి సుదీర్ హీరోగా మారి వరస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా గెటప్ శ్రీను కూడా హీరోగా మారి 'రాజు యాదవ్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇదే జబర్దస్త్ షో నుంచి మరో కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


తాజాగా రాకింగ్ రాకేష్ నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రానికి 'KCR' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. 'కెసిఆర్' అంటే 'కేశవ చంద్ర రమావత్' అని అర్థం. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కటౌట్ ముందు ఒక పిల్లాడు నిలుచుని ఉన్నట్లు ఈ పోస్టర్ ఉంది. దీంతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని స్పష్టం అవుతుంది.


మొదటి సినిమాకే రాకింగ్ రాకేష్ ఇలాంటి టైటిల్ని పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ సరసన అనన్య హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, ధన్ రాజ్ లతో పాటూ తాగుబోతు రమేష్, రచ్చ రవి, సుజాత ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించడంతోపాటు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. బత్తుల మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బలగం మధు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : హీరోగా అకీరా? కొడుకు సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్





Join Us on Telegram: https://t.me/abpdesamofficial