బుల్లితెరపై ఒకానొక సమయంలో ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా ఉదయ భాను (Udaya Bhanu) కనిపించేవారు. ఈటీవీ, జెమిని, మాటీవీ, జీ తెలుగు... ఒక్కటేమిటి? అన్ని ఛానళ్లలో ప్రోగ్రామ్స్ చేశారు. వెండితెరపై కూడా ఆమె సందడి చేశారు. పెళ్లి, పిల్లలు... కుటుంబ బాధ్యతల కారణంగా నటనకు కొన్నాళ్ళు విరామం ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం మళ్ళీ యాంకరింగ్ స్టార్ట్ చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలిసింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది! అది ఏమిటంటే...
'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?
ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా 'ఆగస్టు 6 రాత్రి' (August 6 Night Movie ). బి. సుధాకర్, కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ రాహుల్, దుర్గాప్రియ, పవన్ వర్మ, సుప్రితా రాజ్, నాగమహేశ్, ధీరజ అప్పాజి, మునిచంద్ర, పద్మారెడ్డి, బక్తరపల్లి రవి, రాయదుర్గం రాజేశ్, మణి సాయి తేజ, ఆనంద్ మట్ట, శ్రీని రావ్, వినోద్ కుమార్ ప్రధాన తారాగణం.
ఇటీవల 'ఆగస్టు 6 రాత్రి' సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన ప్రేమకథతో సినిమా తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు చెప్పారు. 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగిందనేది ఆసక్తికరమని తెలిపారు. కర్నాటకలోని హొసకోట సమీపంలో భక్తరపల్లి పరిసరాల్లో మూడు రోజుల పాటు చిత్రీకరణ చేశామన్నారు. ఈ సినిమాలో ఉదయ భాను ఓ పాత్ర చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఉదయ భాను షూటింగ్ ఒక్క రోజే!
'ఆగస్టు 6 రాత్రి' చిత్రీకరణలో ఉదయ భాను ఇంకా జాయిన్ కాలేదు. హైదరాబాద్ సిటీలో జరగనున్న ఆఖరి షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటారని చిత్ర దర్శకుడు ఆర్.కె. గాంధీ తెలిపారు. ఒక్క రోజులో ఆమె సన్నివేశాలు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, సినిమాలో ఆమె పాత్ర నిడివి ఎక్కువే ఉంటుందట! ఆర్ నారాయణమూర్తి 'ఎర్ర సైన్యం'లో ఉదయ భాను ఓ పాత్ర చేశారు. ఆమెకు తొలి చిత్రమది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే, 'లీడర్' & 'జులాయి' చిత్రాల్లో ప్రత్యేక గీతాలు వెండితెరపై ఆమెకు ఎక్కువ పేరు తెచ్చాయి.
Also Read : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్
తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా సినిమా చేస్తున్నామని ఆర్.కె. గాంధీ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇప్పటికి ఐదు రోజులు షూటింగ్ చేశాం. బెంగళూరు, నెల్లూరు, అనంతపురంలో చిత్రీకరణ పూర్తి అయ్యింది. అతి త్వరలో హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ చేస్తాం. కేవలం 6 రోజుల్లో 'ఆగస్టు 6 రాత్రి' షూటింగ్ పూర్తి చేస్తాం. ఉదయ భాను, సుమన్, నాగ మహేశ్, మునిచంద్ర గారి సీన్లు ఒక రోజులో చేయనున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఎం నాగేంద్ర కుమార్, సంకలనం : డి మల్లి, సంగీతం : ఎం ఎల్ రాజ.
Also Read : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!